పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో చేపడుతున్న అభివద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం నాడు విజయవాడ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాల పైన సమీక్షించారు. కలెక్టరేట్లో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, డిఆర్‌ఒ కొండయ్య సంబంధిత శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాబోయే రబీ సీజన్‌లో నీటి లభ్యత రెవెన్యూ, రీ సర్వే, జాతీయ రహదారులకు భూ సేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. రీ సర్వే వేగవంతంగా చేయాలని జాతీయ రహదారులకు, సెల్ టవర్లకు, గోడౌన్లకు అవసరమైన భూ సేకరణ చేయాలన్నారు. వ్యవసాయం పశుసంవర్ధక శాఖలో జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణ పనులు త్వరగతిన పూర్తి చేయాలన్నారు. సచివాలయంలో ఖాళీలు భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. కూలీలు అందరికీ ఉపాధి పనులు కల్పించాలన్నారు. జగనన్నకు చెబుదాం, గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.










