Apr 10,2023 22:53

ప్రజాశక్తి-విజయవాడ: ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందన కార్యక్రమం ఒక ప్రత్యేక వేదిక అని, స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలు ఆశించిన స్థాయిలో సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆర్జీదారుల సమస్యల పరిష్కార దిశగా స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్లు ఎస్‌ రామలక్ష్మి, ఖతీప్‌ కౌసరా బానోలు ఆర్జీదారుల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. స్పందనలో స్వీకరించిన ఆర్జీలపై జిల్లా కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ ఆర్జీలకు నిర్థీశిత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. ఆర్జీలు ఏ స్థాయిలోను తిరిగి నమోదు కాకుడదన్నారు. సమస్యల పరిష్కారానికి స్పందన ఎకైక మార్గమని ఆర్జీదారులు ఎంతో ఆశతో స్పందనలో ఆర్జీలను అందజేస్తుంటారన్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాల్సిన భాధ్యత మనపై ఉందన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యకు సరైన పరిష్కారం చూపగలిగిన్నపుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. సమస్యను పరిష్కరించాలనే ఆలోచన పట్టుదలను అచరణలో పెడితే పరిష్కార మార్గాలు వాటికి అవే లభిస్తాయన్నారు. గ్రామ వార్డు సచివాలయాలు, 1902 కాల్‌ సెంటర్‌, స్పందన మొబైల్‌ యాప్‌, వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా అర్జీలు నమోదవుతుంటాయన్నారు. ఆఫ్‌ లైన్‌, అన్‌ లైన్‌లో నమోదవుతున్న అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్‌ డిల్లీరావు అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో 87 అర్జీల నమోదు అయ్యాయని వీటిలో అత్యధికంగా రెవెన్యూ 28, పోలీస్‌ 15, యంఏయుడి 15, విభిన్న ప్రతిభావంతులు 5, పంచాయతీరాజ్‌ 4, పౌర సరఫరాలు 3, ఉపాధి కల్పన 3, విద్య 2, సోషల్‌ వెల్ఫేర్‌ 2, దేవాదాయ శాఖ 2, కాగా మిగిలినవి వివిధ శాఖలకు చెందినవి 8 ఉన్నాయని కలెక్టర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.