
హిందూపురం : హిందూపురం పురపాలక సంఘం పాలకవర్గం అవినీతి మయం అని చెప్పడానికి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ దంపతుల నిరసనే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. అడ్డదారుల్లో గదుల లీజు వ్యవహరాన్ని నిర్వహించినట్లు ఈ ఘటన స్పష్టం చేస్తోంది. మంగళవారం నాడు ఛైర్‌పర్సన్ ఇంద్రజ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీకి చెందిన 7వ వార్డు కౌన్సిలర్ నసిరాబాను, ఆమె భర్త కింగ్స్ షఫీతో కలిసి నిరసన తెలిపారు. పట్టణంలోని రాజీవ్‌ట్రస్ట్ భవనాల కేటాయింపులో తనకు న్యాయం చేయాలంటూ కౌన్సిలర్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పట్టణంలోని పరిగి బస్టాండ్‌లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో కొంత స్థలాన్ని రాజీవ్ గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వారికి గతంలో అప్పగించారు. ఇక్కడ జరిగిన భవనాల నిర్మాణాలు, గదుల లీజు వ్యవహారంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 7వ వార్డు కౌన్సిలర్ నసిరాబాను భర్త కింగ్స్ షఫీవుల్లా ఈ గదులను తీసుకునేందుకు రూ.35 లక్షలు పాలకవర్గానికి ఇచ్చినట్లు తెలుస్తోంది. గదులను బినామీ పేర్లతో తీసుకునేందుకు కౌన్సిల్‌లో ఆమోదం చేయడం కోసం లక్షల్లో కౌన్సిలర్ల ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఇలా పాలకవర్గానికి లక్షల్లో ముడుపులు ఇచ్చి బినామీ పేర్లతో గదులను స్వాధీనం చేసుకున్న కౌన్సిలర్ భర్త కింగ్స్ షఫీవుల్లా ఆ గదులను ఇతరులతో పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకుని అద్దెకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అయితే వీటిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ విషయాన్ని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంద్రజ, వైస్ ఛైర్మన్ జబీవుల్లాలకు వివరించారు. గదులను వేరేవారికి కేటాయించి, పాలకవర్గానికి ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని గత ఎనిమిది నెలల నుంచి ఈయన కోరుతున్నారు. పలువురు వైసిపి ముఖ్య నేతల వద్ద కూడా ఈ విషయంపై చర్చించారు. అయినా ఈ వ్యవహారం ముందుకు సాగకపోవడంతో మంగళవారం నాడు కౌన్సిల్ సమావేశంలో నిరసనకు దిగారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ న్యాయం చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ కౌన్సిలర్ సమావేశం గది వద్ద కూర్చొన్నారు. దాదాపు రెండు గంటల పాటు ఆ కౌన్సిలర్ దంపతులు కౌన్సిల్ హాల్ నుంచి ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్లు, అధికారులను బయటకు వెళ్లనివ్వలేదు. దీనిపై ఛైర్‌పర్సన్ స్పందిస్తూ 20 రోజుల్లో కౌన్సిలర్ దంపతులకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.