ప్రజాశక్తి - చిప్పగిరి
ప్రతి గడపకూ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చుతున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని నగరడోన గ్రామంలో సర్పంచి మల్లమ్మ అధ్యక్షతన ఆలూరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ, వైసిపి మండల కన్వీనర్ జూటూరు మారయ్య ఆధ్వర్యంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. మంత్రి జయరామ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రూ.40 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని మంత్రి జయరామ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సచివాలయానికి ఉచితంగా స్థలం ఇచ్చిన ఎన్‌టి.రామలింగా రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు, సమస్యలపై వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు. పార్టీలకతీతంగా ఒక పైసా అవినీతి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ నగుదును బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారని చెప్పారు. వచ్చే జనవరి నుంచి వృద్ధులకు పింఛను రూ.3 వేలు అందజేస్తున్నామన్నారు. పేదల చెంతకే 'జగనన్న ఆరోగ్య సురక్ష' ద్వారా వైద్యులను గ్రామాల్లోకి పంపిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గడపగడపకు తిరిగి ఆ ఇళ్లలోని లబ్ధిదారులు పొందిన సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించారు. సర్పంచి మల్లమ్మ, నాగేంద్ర దంపతులకు చెందిన నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. దేవరగట్టు ఆలయ ఛైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, వైసిపి ఆలూరు ఇన్‌ఛార్జీ గుమ్మనూరు నారాయణస్వామి, వైసిపి సీనియర్ నాయకులు కోటిరెడ్డి, భీమ్ రెడ్డి, శేషిరెడ్డి, నాగేంద్ర, ఆలూరు జడ్‌పిటిసి శేఖర్, ఎంపిటిసి సరోజమ్మ, కాంట్రాక్టర్ ఈరన్న, తహశీల్దార్ లక్ష్మీనారాయణ, ఇఒఆర్‌డి బాలన్న, పంచాయతీ కార్యదర్శి నారాయణ స్వామి, ఎపిఎం నాగార్జున, ఎపిఒ మాధవ శంకర్, సూపర్‌వైజర్ ప్రసూన పాల్గొన్నారు.