Jul 12,2023 23:35

కేకు కట్‌ చేస్తున్న ఆనందకుమార్‌

ప్రజాశక్తి -కరాస: విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మర్రిపాలెం వుడా లేఅవుట్‌లోనిపార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్‌ మహిళల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించిన తర్వాత సిఎం జగన్‌ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. గడపగడపకు వెళ్లి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టానన్నారు. అర్హులకు పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు కృషిచేశానన్నారు. సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పింఛన్లు పొందే అవకాశం లేని 50మందికి తన సొంత నిధులతో నెలనెలా పింఛన్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి పరిశీలకులు ఎస్‌ఎ రెహమాన్‌, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్‌, కార్పొరేటర్లు, వార్డు వైసిపి అధ్యక్షులు, ఇన్‌ఛార్జిలు, వైసిపి శ్రేణులు పాల్గొన్నారు.