Jun 01,2023 00:01

కాలనీలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి-కోటవురట్ల:మండలంలో బుధవారం చినబొడ్డేపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలు దర్శన మిచ్చాయి. ప్రధానంగా చినబొడ్డే పల్లి గ్రామంలో దళితవాడలో గతంలో నిర్మించుకున్న ఇందిరమ్మ కాలనీలు శిథిలావస్థకు చేరుకోవడం, వాటిని ప్రభుత్వం గతంలో ఆన్లైన్‌ చేయడంతో కొత్తగా మంజూరు, నిర్మించుకునేందుకు అవకాశం లేక అవస్థలు పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి పలువురు తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే వాటి స్థానంలో కొత్త ఇల్లు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాచపల్లి గ్రామంలో తాగునీటి సౌకర్యం, కాలువల నిర్మాణం చేపట్టాలని విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి పలువురు తీసుకువెళ్లారు. గ్రామంలో అంగన్వాడి సెంటర్ను తనిఖీ చేశారు. కరణం కొత్తూరు గ్రామంలో పారిశుధ్యం పట్ల పలువురు గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ దత్తుడు రాజు, స్థానిక సర్పంచ్‌ శివరాం, ఎంపీడీవో చంద్రశేఖర్‌, తహసిల్దార్‌ జానకమ్మ, బీసీ సెల్‌ అధ్యక్షులు పైల రమేష్‌, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నేడు గడప గడపకు మన ప్రభుత్వం
గొలుగొండ:మండలంలో ఏఎల్‌ పురం లో ఈనెల 1 నుండి గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వైఎస్‌ఆర్సిపి మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ తెలిపారు. బుధవారం గొలుగొండలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌ పాల్గొంటున్న ఈ కార్యక్రమం నాలుగు రోజులు పాటు నిర్వహించనున్నామన్నారు. పంచాయతీలో రెండు సచివాలయాల పరిధిలో నాలుగు రోజులు పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొవాలని ఆయన కోరారు.