Aug 29,2023 22:07

పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకుంటున్న పిఒ విష్ణుచరణ్‌

ప్రజాశక్తి - సాలూరు : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులను వెంటనే పూర్తి చేయాలని, పూర్తయిన ప్రాధాన్యత భవనాలను వెంటనే అప్పగించాలని ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్‌ మండల ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యత భవనాలు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులు నిర్మాణ పరిస్థితులపై సాలూరు, పాచిపెంట మండలాల ఇంజనీర్లతో స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ నిర్మాణాలు పూర్తయిన, జరుగుతున్న పనుల గూర్చి అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలను పది రోజుల్లో అప్పగించాలని ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులన్నింటినీ పూర్తి చేయాలని, పనులు ప్రారంభం కాని చోట్ల వెంటనే పనులు మొదలు పెట్టాలని అన్నారు. పూర్తయిన పనులకు వెంటనే బిల్లులను అప్లోడ్‌ చేయాలని తెలిపారు. పనులు పూర్తి చేసి బిల్లులు సమర్పించిన వారికి సకాలంలో పేమెంట్స్‌ జరుగుతున్నాయని, కావున సకాలంలో పనులు పూర్తి చేసి బిల్లులు పొందాలని సూచించారు. సమావేశంలో మండల ఇంజనీరింగ్‌ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.