* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
* పలువురు ఎంపిడిఒలకు షోకాజ్ నోటీసులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: గడప గడపకు మన ప్రభుత్వంలో మంజూరైన పనులకు సంబంధించి ప్రతిపాదనలను తక్షణమే అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఎంపిడిఒలను ఆదేశించారు. ఈ పనులపై ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం సమీక్షించారు. మండలాల్లో చేపడుతున్న గడప గడపకు పనుల ఎస్టిమేషన్స్‌ను అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. జూలై కంటే ముందున్న పనులను తక్షణమే అప్‌లోడ్ చేయాలన్నారు. నరసన్నపేట, ఆమదాలవలస, సోంపేట, టెక్కలి, జలుమూరు ఎంపిడిఒలు సమావేశానికి గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఒను ఆదేశించారు. మంజూరు చేసిన పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. పనులకు నిధుల కొరత లేదన్నారు. ప్రారంభించిన పనులను తక్షణమే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, మున్సిపాల్టీల్లో తక్షణమే పనులు ప్రారంభించి బిల్లులు వెంటనే అప్‌లోడ్ చేయాలన్నారు. కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు చేపడుతున్నట్లు ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్‌ఇ మూర్తి, సిపిఒ లక్ష్మీప్రసన్న, ఇఇలు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.










