Nov 03,2022 00:12

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేస్తున్న స్వామి, గుర్రన్న

ప్రజాశక్తి-నక్కపల్లి:హెటిరో పైప్‌లైన్‌ సమస్యతో ఎటువంటి అల్లర్లు, గొడవలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సిఐ నారాయణరావు, ఎస్‌ఐ శిరీష ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్ర మానికి పోలీసు బందోబస్తు మోహరించారు. హెటిరో పైప్‌ లైన్‌ సమస్య పరిష్కరించే వరకు రాజయ్యపేటలో గడప గడపకు నిర్వహించవద్దని, కాదని నిర్వహిస్తే అడ్డుకుంటామని ఇటీవల బోయపాడులో జరిగిన గడపగడప కార్యక్రమంలో ఎమ్మెల్యే బాబురావుకు మత్స్యకార జేఏసీ జిల్లా అధ్యక్షులు పిక్కి స్వామి తదితరులు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. బుధవారం ఎమ్మెల్యే బాబురావు రాజయ్య పేటలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడంతో గ్రామంలో ఎటువంటి తగాదాలు చోటు చేసుకోకుండా ముందుగానే పోలీసు బందోబస్తు మొహరించారు. దీంతో, మత్స్యకార జేఏసీ జిల్లా అధ్యక్షులు పిక్కి స్వామి, జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొంది గుర్రన్న తదితరులు గ్రామంలో పోలీసులు మోహరింపుపై తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. హెటిరో పైప్‌ లైన్‌ సమస్యపై ఎమ్మెల్యే బాబురావు కు వినతిపత్రం అందజేశారు. కంపెనీ కాలుష్యం కారణంగా ఇటీవల ఉప్పుటేరులో చేపలు మృత్యువాత పడ్డాయని తెలిపారు. దీంతో, మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. కంపెనీ నుండి వెలువడే కాలుష్యం కారణంగా ఈ ప్రాంత ప్రజలు అనేక రోగాలను బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ కొత్తగా వేస్తున్న పైప్‌ లైన్‌ వ్యతిరేకిస్తూ 337 రోజుల నుండి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. ధర్నా ప్రారంభంలో సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారని నేటి వరకు సమస్య పరిష్కారానికి మార్గం చూపలేదని ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు ఎమ్మెల్యే బాబురావు మాట్లాడుతూ, మత్స్యకార నాయకులు తన వద్దకు వస్తే జిల్లా కలెక్టర్‌ వద్దకు తీసుకువెళ్తానని గతంలోనూ చెప్పానని ,ఇప్పుడు అదే చెబుతున్నానని ఎమ్మెల్యే అన్నారు. గ్రామంలో నెలకొన్న హౌసింగ్‌ సమస్యను ఎమ్మెల్యే దష్టికి తీసుకువెళ్లారు.