Jul 11,2023 22:21

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

'గడప గడపకు మన ప్రభుత్వం'
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని డిసిపల్లి సచివాలయం పరిధిలో మంగళవారం కోనసముద్రం, ఖాన్‌ సాహెబ్‌ పేట గ్రామాల్లో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్‌ఎ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ప్రతి ఇంటికి అందచేసిన సంక్షేమ పథకాలను వారికి వివరించి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంఎల్‌ఎ కోనసముద్రం గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో గ్రామానికి చెందిన కంచర్ల వెంకటరమణ తన భార్య కంచర్ల మాధవి అనారోగ్య కారణంగా రూ.25లక్షల వరకు ఖర్చు అయిందని, తమను ఆదుకోవాలని విన్నవించడంతో ముఖ్యమంత్రి సహాయనిధికి అర్హత ఉంటే తప్పక మంజూరు చేయించేలా కృషి చేస్తానని హామీనిచ్చారు.
పలువురు రెవెన్యూ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడంతో నెలాఖరులోగా వాలంటీర్‌, విఆర్‌ఒ రెవెన్యూ సమస్యలను అన్నింటిని నమోదు చేసి జాబితాలను తమకు అందచేస్తారని, ఉన్నతాధికారులు, డివిజన్‌ స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఖాన్‌సాహెబ్‌ పేట గ్రామంలో ఎంఎల్‌ఎ పర్యటిస్తున్న సమయంలో కొంతమంది రైతులు తమకు అధికారికంగా ఆయకట్టు కల్పించి సాగునీరు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం సేవ్‌ ది క్రాప్‌ ద్వారా నీళ్లు తెచ్చుకుంటూ పంటలు సాగు చేసుకుంటున్నామని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎంఎల్‌ఎకు విన్నవించారు. స్పందించిన ఎంఎల్‌ఎ జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. గ్రామానికి చెందిన పలువురు మహిళలు తమకు మంచినీటి సమస్య అధికంగా ఉందని, గ్రామానికి వాటర్‌ట్యాంకు మంజూరు చేయాలని విన్నవించడంతో అధికారులను ప్రతిపాదనలు సిద్ధం చేసి తమకు పంపాలని ఆదేశించారు. గ్రామంలో మద్యం బెల్టు షాపులు ఉన్నాయని మహిళలు ఎంఎల్‌ఎకు తెలుపగా వెంటనే స్పందించిన ఎంఎల్‌ఎ అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐను ఆదేశించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సుబ్బిరెడ్డి, భీమవరం సొసైటీ చైర్మన్‌ సోమల మాధవరెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్‌ సిద్ధంరెడ్డి మోహన్‌ రెడ్డి, మాజీ కన్వీనర్‌ గంగవరపు శ్రీనివాసులు నాయుడు, స్థానిక సర్పంచ్‌ రేవూరు సుప్రజ, గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపిపి కోనంకి శ్రీనివాసులు నాయుడు, గంగినేని రవీంద్రబాబు నారాయణస్వామి, గంగినేని శ్రీనివాసులు, బేరి రామ్మోహన్‌ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మల్లవరపు మోహన్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.