గడప గడపకు మన ప్రభుత్వం
ప్రజాశక్తి-అల్లూరు : మండల కేంద్రంలోని కోనేటిమిట్ట, రజక కాలనీ, బిసి కాలనీ అలాగే తదితర కాలనీలలో మంగళవారం ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి గడపగడప కార్యక్రమంలో పాల్గొని ఆయా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్మోహన్ రెడ్డి నిత్యం పేద ప్రజల కోసం శ్రమిస్తున్నారన్నారు. అందులో భాగంగా విరివిగా సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారని వివరించారు. నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది విద్యకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. అమ్మఒడి పథకం ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారన్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరేందుకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి అందులో జగనన్న కాలనీల పేరట ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవ్వ,తాతలకు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రతినెలా ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి పంపిణీ చేస్తున్నారని తెలియజేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతిఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు నీలం సాయికుమార్, కోడూరు సాధక్‌కుమార్ రెడ్డి, దర్శిగుంట వెంకయ్య, దాసరి పోలయ్య, చంతాటి శ్రీనివాసులు తదితరులున్నారు.










