
ప్రజాశక్తి - వీరఘట్టం : మండల కేంద్రానికి కూత వేట దూరాన ఉంది గడగమ్మ గ్రామం. అయినా ఈ గ్రామం అభివృద్ధిపై ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు దృష్టి సారించకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే దర్శనమిస్తున్నాయి. ఈ గ్రామంలో 270 కుటుంబాలు దాదాపుగా 930 మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామంలో సుమారు పది మంచినీటి బోరు బావులు ఉన్నాయి. అయితే ఈ నీళ్లు తాగేందుకు ఉపయోగపడకపోవడంతో గ్రామస్తులు నాగావళి నదిని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క తాగునీరే కాదు సాగునీటి సమస్య, గ్రామంలో మౌలిక వసతులు కొరత వేధిస్తుంది.
అన్ని కాలాల్లో నదే దిక్కు
గ్రామంలో బోరుబావులు ఉన్నప్పటికీ తాగేందుకు పనికిరావు. కేవలం ఇతరత్రా అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి సమీపాన నాగావళి నది వద్దకు ఎండైనా, వానైనా అక్కడికి వెళ్లి చలమల ద్వారా నీరు తోడుకొని తీసుకొచ్చి దాహార్తి తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీరు తాగడం వల్ల వ్యాధుల బారిన పడి వేలాది రూపాయలు వెచ్చించి ఆరోగ్యం నయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఈ గ్రామంలో 133 ఎకరాల పల్లం, 168 ఎకరాల మెట్టు, ఇతరరాత్ర కలిపి 417 ఎకరాల భూమి సాగులో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు లెక్కలు చెబుతున్నారు. గ్రామానికి తోటపల్లి ప్రధాన ఎడమ కాలువ మొదటి ఛానల్ నుంచి నడిమికెల్ల, విక్రంపురం, కిమ్మి, చిట్టిపూడివలస, కొట్టుగుమ్మడ గ్రామాలు దాటి తమ గ్రామానికి సాగునీరు రావాల్సి ఉంది. సర్దార్ గౌతు లచ్చన్న రిజర్వాయర్ నుంచి ఈ ఏడాది జులై 20న నీటిపారుదల శాఖ అధికారులు సాగునీరు విడిచిపెట్టారు. దాదాపు రెండు నెలలు కావస్తున్నప్పటికీ గ్రామంలో పంట పొలాలకు సాగునీరు రాకపోవడంతో బోరు సదుపాయం ఉన్న వారు పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ అవకాశం లేని వారు వరుణుడిపై ఆశలు పెట్టుకొని పంటలు సాగు చేస్తున్నారు.
రేకుల షెడ్డులో వంటలు
గ్రామంలో మండల ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 51మంది మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల నాడు-నేడు కింద పాఠశాల అభివృద్ధి పనులు జరిగినప్పటికీ వంటశాలపై దృష్టి సారించకపోవడంతో వర్షం పడినా అందులోనే వంటలు చేసి విద్యార్థులకు భోజనాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మధ్యాహ్నభోజన నిర్వాహకులు వాపోతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఈ రేకుల షెడ్డు ఎప్పుడు కూలిపోతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ అందులోను వంటలు చేస్తున్నట్లు నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు.
అధ్వాన రహదారితో అవస్థలు
గ్రామానికి వెళ్లే బిటి రహదారి అధ్వానంగా ఉండడం వల్ల రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈ రహదారి ఎక్కడికక్క రాళ్లు తేలిపోవడంతో తరచుగా వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని వాహనచోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరేళ్ల కిందట రూ.36లక్షల అంచనా వ్యయంతో బిటి రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. పనులు చేపట్టినప్పుడు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రహదారి ఎక్కడికక్కడ రాళ్లు తేలి దర్శనమిస్తుంది. మూడు కాలాలు ఉండాల్సిన రహదారి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో కాలం చెల్లక ముందే రహదారులు అధ్వాన స్థితికి చేరుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.