Jun 27,2021 10:29

పైసా ఖర్చు లేకుండా రంగు రంగుల పూలతో అందంగా విచ్చుకుని, ఆహ్లాదాన్ని పంచే అపురూపమైన మొక్కలు గడ్డి గులాబీలు. వీటిని గడ్డి పూలు, నాచు గులాబీలు అనీ పిలుస్తారు. ఫోర్టలాక గ్రాండిఫ్లోరా దీని శాస్త్రీయనామం. వీటిలో పదుల సంఖ్యలో రకాలున్నాయి. ఇవి అర్జెంటీనా దేశంలో పుట్టి, ప్రపంచమంతా ఎగబాకాయి. ఈ పూలను పరిచయం చేసుకుందాం పదండి..

గడ్డిపూలు విచ్చుకోవడానికి కాస్త సూర్యరశ్మి కావాలి. చిన్నకాడ తుంచి నాటితే చాలు గబగబా ఎదిగిపోయి, చకచకా పువ్వులు పూసేస్తాయి. ఇవి నాటిన కొన్నాళ్ళకే పెద్ద పూలవనమైపోతుంది. శీతల ప్రాంతాల్లో అయితే ఎక్కువ పూలు విచ్చుకుంటాయి. కాడ ఇట్టే విరిగిపోవడంతో వీటిని గ్రామీణ ప్రాంతాల్లో 'పిరికి పూలు' అని కూడా అంటారు. గడ్డిపూలు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! 

నిర్వహణే అందం..
మొక్క నుంచి కాడలను తుంచి పడేసినా.. వాటికవే వేళ్లూనుకుని మొక్కలుగా నిలదొక్కుకుంటాయి ఈ గడ్డి గులాబీలు. ఇవి పిచ్చి మొక్కల్లో తుప్ప మొక్కలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ వీటిని కుండీల్లో వేసి, కాస్త నిర్వహణ చేస్తే అంతులేని శోభతో ఆహ్లాదాన్ని పంచుతాయి. నేల కుండీల్లోనూ, వేలాడే కుండీల్లోనూ, నేలమీదా, బోర్డర్‌గాను, లాండ్‌స్కేపింగ్‌ డిజైన్లలో అందంగా పెరిగి, కనువిందు చేస్తాయి. ఎప్పటికప్పుడు వీటి ఎదుగుదలను నియంత్రిస్తూ కత్తిరిస్తే అందమైన రూపంతో ఇవి ఉండే ప్రదేశానికే ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తాయి.

శ్వేతపూల సోయగం..
గడ్డిపువ్వులో అరుదైనవి, అపురూపమైనవి తెల్లగులాబీ మొక్కలు. శ్వేత సోయగాలతో విరబూసిన ఈ పువ్వులు ఎంతో అందంగా ఉంటాయి. పువ్వు పరిమాణం కాస్త పెద్దదిగా ఉండి, కొట్టచ్చినట్లు కనిపిస్తాయి. గడ్డి గులాబీలు వాసన రావు. ఒక్కో పువ్వు ఒక్కోరోజు మాత్రమే ఉంటుంది. మరునాడు కొత్త పువ్వులు పుట్టుకొస్తాయి. గడ్డి గులాబీలు

పలు రకాలు..
పూల రంగులు, ఆకారాన్ని బట్టి గడ్డి గులాబీలు చాలా రకాలు ఉన్నాయి. కానీ వీటిలో ముఖ్యంగా రెండు జాతులున్నాయి. ఒకటి ఆకులు సన్నగా ఉండే గడ్డి గులాబీ. దీన్నే నాచు గులాబీ అంటుంటారు. రెండోరకం గడ్డి పూలమొక్క ఆకులు వెడల్పుగా ఉంటాయి. దీన్ని గంగపాయల గులాబీ అంటారు. రెండూ ఒకే కుటుంబానికి చెందినవి. ఇవి ముద్ద, రేఖ పువ్వులు పూస్తాయి.

వారానికే ఎదుగుదల..
నాచు మొక్కలు కుండీల్లో బాగా పెరుగుతాయి. తెలుపు, ఎరుపు, గులాబీ, పసుపు, పింకు ఇలా రంగురంగుల నాచుపూల కాడల్ని కుండీల్లో గుచ్చిన వారానికే చక్కగా ఎదిగి, పూలు పూస్తాయి. ఇవి చూడ్డానికి అందమైన పూల బకేల్లా కనిపిస్తాయి. వీటికి నీటిని చాలా తక్కువగా వాడతారు. అయినా చాలా అందమైన పూలను పూస్తాయి.
పూల హరివిల్లు..
ఇంటి ముంగిట ప్రహరీని ఆనుకుని, ఈ రంగురంగుల పూల మొక్కలను నాటితే ఆకాశంలో ఉండాల్సిన హరివిల్లు నేలపైకి వచ్చినట్లు అనిపిస్తుంది. వర్ణ శోభితమైన ఈ పూలు చూపరులను కట్టిపడేస్తాయి అంటే అతిశయోక్తి కాదేమో! వీటిలో పెరిగే కలుపు గడ్డి ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. లేకపోతే గడ్డి పెరిగి, నాచు మొక్కల ఉనికిని దెబ్బతీస్తుంది. గడ్డి గులాబీలు

వేలాడే కుండీల్లో..
గడ్డిపూల అసలు హోయలు వేలాడే కుండీల్లోనే కనిపిస్తుంది. నాచుపూలు, గంగ పాయలు రెండు రకాలూ వేలాడే కుండీల్లో చక్కగా పెరిగి, పూలను విరబూస్తాయి. కిందికి వేలాడుతూ పువ్వులు గాలికి అటూ ఇటూ ఊగుతూ వర్ణ వయ్యారాలను ఒలకబోస్తూంటే ఊహకందని సుందర దృశ్యమేదో కళ్ళముందు కదలాడుతుంది.

విభిన్న వర్ణాల్లో..
గడ్డిపూలలో గంగ పాయల రకంలో మల్టీకలర్‌ రకం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇది ఒకే పువ్వులో విభిన్న రంగుల డిజైన్లతో కొలువుదీరి, ఆకట్టుకునేలా ఉండే లేటెస్ట్‌ ఫ్యాన్సీ పువ్వు.గడ్డి గులాబీలు
డబుల్‌ బ్లేడ్‌ ఫ్లవర్‌..
ఒక పువ్వులో మరోపువ్వు ఒదిగి ఉన్నట్లు ఉండే నాచుపూల మొక్క డబుల్‌ బ్లేడ్‌ ఫ్లవర్‌. పువ్వు కిందిభాగం ఒక రంగు రేఖలు, పైభాగము మరో రంగు రేఖలు ఉండడం దీని ప్రత్యేకత. ఇది ఇటీవలే మార్కెట్లోకి వస్తోంది.

వాల్‌ కీపింగ్‌ ఫ్లవర్స్‌
గోడను అంటుకుని గుబ్బగా పెరిగి, గుంపుగా పువ్వులు పూసే గడ్డిపూల మొక్క ఇది. రంగురంగుల పూలు పూస్తాయి. ఈ మొక్క ఎక్కువగా ఇతర దేశాల్లో ఉంటుంది. శీతాకాలంలో మాత్రమే ఇవి పూలు పూస్తాయి.

గాంధీ మెచ్చిన గంగవాయిల..గడ్డి గులాబీలు
గడ్డి గులాబీ పూల మొక్కలలో ఒకటైన గంగ పాయలను గ్రామాల్లో గంగవాయిల అని పిలుస్తుంటారు. చక్కటి పూలను పూయడమే కాదు. ఎన్నో పోషకాలను కలిగిన ఆకుకూర. దీనిలో ఏ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అనేక వ్యాధులకు గంగవాయల ఆకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కంటిచూపుని ఎంతో మెరుగుపరుస్తుంది. గంగవాయిల ఆకును కూర, పచ్చడి, జ్యూసు, పప్పుకూర, ప్రై, సూప్‌గా తయారుచేసుకోవచ్చు. జాతిపిత గాంధీజీకి గంగవాయిల ఆకు అంటే ఎంతో ప్రియం. ఆయన వారానికి ఒకరోజు అయినా ఈ కూర తినేవారంట!.

- చిలుకూరి శ్రీనివాసరావు,
89859 45506