గద్దెనెక్కినక్క పాఠశాలల అభివృద్ధి గుర్తురాలేదా
ప్రజాశక్తి - పగిడ్యాల
ఎన్నికల ముందు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్ది విద్యను అభివృద్ధి చేస్తానని చెప్పిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత పాఠశాలల అభివృద్ధిని మరిచారని పిడిఎస్‌యు డివిజన్ కార్యదర్శి మర్రి స్వామి, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి కుమార్ మండిపడ్డారు. గురువారం మండల కేంద్రం పగిడ్యాలలోని కస్తూరిబా పాఠశాల, ఎస్సీ బాలుర వసతి గృహాన్ని, మోడల్ స్కూల్‌లను వారు సందర్శించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడారు. నాడు-నేడు పథకం కింద పాఠశాలలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కస్తూరిబా పాఠశాలలో అభివృద్ధి కోసం నిధులు మంజూరై సంవత్సరం కావస్తున్న ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడం విచారకరమన్నారు. నాడు-నేడు పథకంతో పాఠశాలలను రూపుమాపుతా మని చెప్పిన వైయస్సార్ ప్రభుత్వం ఇంతవరకు అటువైపు అడుగులేసిందే లేదన్నారు. నాడు నేడు కింద పాఠశాల గదులు నిర్మాణంలో నాణ్యతలో అలోపించడంతోపాటు పనులు నత్త నరకంగా నడుస్తున్నాయని వారు ఆరోపించారు. ఇప్పటికైనా పాఠశాలల అభివృద్ధి కోసం నాడు నేడు పథకం కింద మంజూరైన నిధులతో పాఠశాలల అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని లేనియెడల పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలను చేపడతామని వారి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు డివిజన్ ఉపాధ్యక్షులు ప్రవీణ్, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ నాయకులు వరుణ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.










