నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపం.. పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి-గొలుగొండ : మండలంలోని మేజర్ పంచాయతీ ఎఎల్‌పురంలో చేపడుతున్న నాడు నేడు పనులకు ప్రభుత్వం సరఫరా చేసిన వివిధ కంపెనీల సిమెంట్ బస్తాలు వందల సంఖ్యలో గడ్డలు కట్టుకుపోయాయి. పాడైన ఈ సిమెంట్‌తోనే పనులు కొనసాగిస్తున్నారు. ఈ పనులలో నాణ్యత లోపం దర్శనమిస్తుంది. అంతేకాకుండా పనులు దగ్గరుండి పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎఎల్‌పురం హైస్కూల్, ఎంపిపి స్కూల్, జూనియర్ కళాశాల పనులలో ఈ సిమెంట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే ఏఎల్‌పురం ఎంపిపి స్కూల్లో 281 బస్తాలు గత ఆగస్టులో ఇవ్వగా, 193 బస్తాలు ఉపయోగించి, 88 బస్తాలు నిరుపయోగంగా గడ్డలు కడుతున్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నాణ్యమైన సిమెంట్‌ను తెచ్చి నిర్మాణాలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. తగు చర్యలు చేపట్టకపోతే జిల్లా కలెక్టర్‌కుఫిర్యాదు చేస్తామని తెలిపారు.










