- పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
ప్రజాశక్తి - వజ్రపుకొత్తూరు: పలాస నియోజకవర్గానికి గౌతు కుటుంబం చేసిన అభివృద్ధి ఏమిటని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. మండలంలోని పల్లిసారథిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతు కుటుంబ పాలనలో నియోజకవర్గాన్ని గాలికొదిలేసి, ఇప్పుడు అభివృద్ధి చేస్తామని చెప్పే ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలోనే నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించిందని చెప్పారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం పలాసలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, తాగునీటి కోసం రూ.700 కోట్లతో శుద్ధజల ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. కులం, మతం, జెండాలు చూడకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ సిఎం జగన్ సంక్షేమ రథసారధిగా నిలుస్తున్నారని కొనియాడారు. సంక్షేమ ఫలాలు అందిస్తున్న సిఎంను, వాటిని మీ దరికి చేరుస్తున్న వాలంటీర్లను దూషిస్తున్న వారికి వచ్చే ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్న సంగతి ఎవరూ మరిచిపోలేదన్నారు. కార్యక్రమంలో ఎంపిపి ఉప్పరవల్లి నీలవేణి, ప్రతినిధి ఉప్పరపల్లి ఉదరు కుమార్, జెడ్‌పి వైస్ చైర్‌పర్సన్ ప్రతినిధి పి.శ్రీనివాసరావు, సర్పంచ్ పోతనపల్లి కుసుమ, మాజీ సర్పంచ్ పోతనపల్లి ధర్మారావు, సర్పంచ్ ప్రతినిధి పోతనపల్లి హేమంత్, తామాడ ఈశ్వరరావు, వైసిపి మండల అధ్యక్షులు పి.గురయ్యనాయుడు, పిఎసిఎస్ చైర్మన్ దువ్వాడ మధుకేశవరావు, సచివాలయ కోఆర్డినేటర్ వడ్డి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.










