Aug 02,2023 21:44

ప్రభుత్వ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

ప్రజాశక్తి-పాచిపెంట : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సిఎం రాజన్నదొర.. ఎంపిడిఒ జి.పార్వతికి సిఫార్సు చేశారు. పాచిపెంట మండల కేంద్రంలో మూడో రోజు బుధవారం కొనసాగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఉదయం తొమ్మిది గంటలకు డిప్యూటీ సిఎం హాజరయ్యారు. 10 గంటల వరకు ఈ కార్యక్రమానికి హాజరుకాని అధికారులపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఒకరోజు వేతనం నిలిపివేయాలని ఎంపిడిఒను ఆదేశంచారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏయే సంక్షేమ పథకాల ద్వారా ఎంత మొత్తంలో లబ్ధి చేకూరిందో లబ్ధిదారులకు తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే సిఎం లక్ష్యమని అన్నారు.
కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పథకాలు అందిస్తామని చెప్పారు. ఎవరూ అసంతృప్తి చెందవద్దన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల ప్రధానకార్యదర్శి డోల బాబ్జి, టి.గౌరీశ్వరరావు, వైస్‌ ఎంపిపి మీసాల నారాయణ, కె.పార్వతి, పి.శ్రీనివాసరావు, ఎం.మధుసూదనరావు, తదితరులు పాల్గొన్నారు.