ప్రజాశక్తి - ఆరిలోవ,మధురవాడ : ఆరిలోవ హెల్త్‌సిటీ అపోలో ఆసుపత్రి, ఒజిఎస్‌వి సంయుక్త ఆధ్వర్యాన ఆదివారం సాగరతీరంలోని ర్యాడిసన్ హోటల్ సమావేశ మందిరంలో గైనాకాలజీలో రోబొటిక్స్ సర్జరీపై కార్యశాల నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి సారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 150 మంది ప్రతినిధులు, గైనాకాలజిస్టులు హాజరయ్యారు. సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శశిప్రభ కార్యశాలను ప్రారంభించారు. హైదరాబాద్, జూబ్లీహిల్‌లో గల అపోలో ఆసుపత్రికి చెందిన డాక్టర్ రూమా, విశాఖపట్నం అపోలో ఆసుపత్రి గైనాకాలజిస్ట్‌లు, లాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జన్ల బృందంతో కలిసి డాక్టర్ కిరణ్మయి గొట్టాపు, డాక్టర్ శ్రీదేవి మట్టా, డాక్టర్ విద్యా కొండూరిలు రోబోటిక్ హిస్టెరెక్టమీ వంటి లైవ్ సర్జరీలను ప్రదర్శించారు. ఈ రంగంలో తమ అపారమైన అనుభవాన్ని ప్రతినిధులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిఇఒ, సిఒఒ వై.సుబ్రహ్మణ్యం, శ్రీరామచంద్ర మాట్లాడుతూ, రోగులకు అధునాతన చికిత్సలు అందించడంలో అపోలో హాస్పిటల్స్ ముందుంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటి సారిగా బినైన్ గైనకాలజీలో రోబోటిక్ సర్జరీని విశాఖలోని అపోలో ఆసుపత్రిలో డాక్టర్ కిరణ్మయి ఆధ్వర్యాన వైద్యులు విజయవంతంగా నిర్వహించారని తెలిపారు.