ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని గాయత్రి ఆస్పత్రిలో కొక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలను బుధవారం జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. బుధవారం ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటి సారిగా గాయత్రి హాస్పిటల్‌లో కొక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచకిత్స నిర్వహించిన డాక్టర్ కృష్ణ కిషోర్, డాక్టర్ బి.వెంకట్, డాక్టర్ సునీల్,డాక్టర్ మనోహర్‌లను ఆయన అభినందించారు. సుమారు రూ.8 లక్షలు విలువ చేసే ఆపరేషన్లను ఉచితంగా ఆరోగ్య శ్రీ లో చేయించుకునే అవకాశాన్ని విజయ నగరం, శ్రీకాకుళం ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. పుట్టుకతో వచ్చే చెవిటి మూగ పిల్లలు సంప్రదాయ వినికిడి మిషన్ తో ప్రయోజనం పొందలేకపోతే ఈ శస్త్రచిత్స ద్వారా వినికిడి తో పాటు స్పష్టంగా మాట్లాడే అవకాశం కూడా కలుగుతుందని చీఫ్ మెంటర్ సర్జన్ డాక్టర్ కృష్ణ కిషోర్ తెలిపారు. మూడేళ్లలోపు పిల్లలకు ఇద్దరికీ గాయత్రి హాస్పిటల్ లో శస్త్రికిత్స చేశామని, వీరికి నెల రోజుల తరువాత ఇంప్లాంట్ స్విచ్ ఆన్ చేస్తామని తెలిపారు. ఏడాది పాటు ఆడియో వెర్బల్ తెలిపి (ఎవిటి) ద్వారా అందరి పిల్లలు మాదిరి రెగ్యులర్‌గా స్కూలుకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ వినికిడి లోపం ఎంత తక్కువ వయసు లో గుర్తించి సర్జరీ చేయించుకుంటే అంత మంచి ఫలితం ఉంటుందని తెలిపారు. గాయత్రి హాస్పిటల్‌లో ఎడిఐపి, ఆరోగ్య శ్రీ ద్వారా సర్జరీ, సంవత్సరం పాటు ఆడియో వెర్బల్ థెరపీ పూర్తిగా ఉచితంగా చేస్తామని తెలిపారు.










