Sep 27,2023 23:27

బాధిత బాలిక

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : చేతిలో ఉన్న గాజు ముక్కలు తీయకుండా వైద్య సిబ్బంది కుట్లు వేసిన ఘటన పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో బుధవారం వెలుగు చూసింది. స్థానిక 20 వార్డులో నివాసం ఉంటున్న గుండా సాంబశివరావు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె కీర్తి ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. ఆగస్టు 15న బాలిక గాజులు వేసుకుటుండగా అవి పగిలి చేతికి తీవ్ర గాయమైంది. బాలికను తల్లిదండ్రులు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. గాయాన్ని శుభ్రం చేసిన సిబ్బంది కుట్లు వేశారు. అయితే కొద్దిరోజులకు బాలిక చేతికి వాపు రావడం, నొప్పి కూడా పెరగడంతో ట్యాబ్లెట్లు వాడుతున్నారు. అయినా తరచూ నొప్పి రావడం, వాపు తగ్గకపోవడంతో బుధవారం స్థానికంగా ఉన్న ముళ్లు తీసే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వారు గాయంలో గాజు ముక్కలు ఉండటాన్ని గమనించి వాటిని తొలగించి మళ్లీ కుట్లు వేశారు. దీనిపై ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు వాపోతున్నారు.