
చాలా సంవత్సరాల తరువాత శ్రీహర్ష గుర్తుకొచ్చాడు. ఆ రోజు స్కూల్లో పాఠం చెప్పి, నా గదిలో కూర్చుంటున్నప్పుడు మా సైన్స్‌టీచర్ గిరి వచ్చాడు. 'సుబ్బారావ్! ఈ రోజు పేపర్లో మన శ్రీహర్ష గురించి ఓ వార్త వచ్చింది. అతని పేరు నోబుల్ అవార్డ్‌కి నామినేట్ చేశారట!' అంటూ ఆ పేపరు ఇచ్చి వెళ్ళిపోయాడు.
నేను ఈ స్కూలుకి హెడ్మాష్టర్ని... అయినా 'సుబ్బారావ్!' అని ఓ మాస్టారు పిలవడం ఏంటనీ మీరు ఆశ్చర్యపోతున్నారా? పోతారులెండి.. హెడ్మాష్టరంటే కొన్ని స్కూళ్ళలో టీచర్లకు వణుకు పుడుతుంటుంది. కానీ ఈ గిరి, నేను చిన్నప్పట్నుంచీ ఒకే ఊళ్లో, ఇంకా చెప్పాలంటే ఒకే వీధిలో పక్క పక్క ఇళ్లల్లో పెరిగాము. కలిసే చదువుకున్నాం. కాబట్టే ఆ చనువు. అందరిలో మాత్రం 'గారు' పెట్టే పిలుస్తాడు. అది సరేగానీ ఈ శ్రీహర్ష ఎవడనే కదా! మీ డౌటు? ఉండండి... అది కూడా చెబుతాను.. వాడూ నా చిన్ననాటి స్నేహితుడే. ఎప్పుడో ఇరవై సంవత్సరాల కిందట మాతో చదివినవాడికి 'నోబెల్' బహుమతంటే నాకు ఆశ్చర్యంతో పాటు మానవ సహజమైన ఈర్ష్యా కలుగుతోంది. చిన్నప్పుడు శ్రీహర్షని చూస్తే వాడు జీవితంలో స్థిరపడతాడనీ ఎవ్వరూ అనుకునేవారు కాదు. ఎవరిదాకా ఎందుకూ వాళ్ళ నాన్నగారే అనుకునేవాడు కాదు. అతనో పేద పురోహితుడు. ఊర్లో శివాలయానికి పూజారి.
సర్లెండి.. ఇంతకీ పేపర్లో ఏముందోనని ఆత్రంగా చదివాను. అందులో 'తెలుగు తేజానికి నోబుల్?' అంటూ ప్రశ్నార్థకం పెట్టి, పక్కనే వాడి ఫోటోని వేశారు. కొద్దిగా ముఖంలో మార్పు తప్పా..! నేను ఇరవై ఏళ్ళ క్రితం చూసిన శ్రీహర్షలాగే ఉన్నాడు. వైరస్‌లలో జన్యు మార్పిడి, మ్యుటేషన్స్, వ్యాక్సిన్ తయారీలో ఇబ్బందుల మీద ప్రయోగాలు చేసి, ఈ మధ్యన ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్‌కి వ్యాక్సిన్ కనుగొన్న ఇద్దరు శాస్త్రవేత్తలలో 'శ్రీహర్ష' ఒకరు. వైద్యశాస్త్రంలో ప్రతీ సంవత్సరం ఇచ్చే నోబుల్ అవార్డుకి శ్రీహర్షను అమెరికన్ ప్రభుత్వం నామినేట్ చేసినట్లు అమెరికాలోని టెక్సాస్ ప్రభుత్వం ప్రకటించిందని అందులో రాసి ఉంది.
ఆ పేపరు చదివిన తరువాత నా మనసంతా అలజడికి లోనుకాసాగింది. ఎక్కడి శ్రీహర్ష? ఇప్పుడు ఏకంగా నోబుల్ అవార్డ్ అందుకోబోతున్నాడు. భారత్‌దేశంలో ఆంధ్రాలో ఓ చిన్నపల్లెలో పుట్టినవాడు ఇంత స్థాయికి ఎదగడం అంటే సామాన్యమైన విషయం కాదు. నా ఆలోచనలు వెనక్కి పరిగెడుతున్నాయి. 25 సంవత్సరాలు వెనక్కి.. కాలచక్రం ముందుకి కాదు... వెనక్కి...
***
మాది అగ్రహారం అనే ఓ చిన్నపల్లె. మూడు వందల కుటుంబాలుండేవి. అక్కడే ఉన్న చిన్న స్కూల్లో మేం చదువుకునేవాళ్లం. మానాన్న రైతు.. పదెకరాల పొలం ఉండేది మాకు. శ్రీహర్ష వాళ్ల ఇల్లు మా ఇంటికెదురుగా ఉండేది. వాళ్లింట్లో మడి, ఆచారాలెక్కువ. వాళ్లింటికెళితే శ్రీహర్ష వాళ్ల అమ్మ ఎన్నో షరతులు పెట్టేది. అయినా వెళుతూనే ఉండేవాళ్లం.
చిన్నప్పట్నుండీ శ్రీహర్షది ఓ వింత మనస్తత్వం. పాత చింతకాయ పచ్చడిలాంటి ఆలోచనలంటే వాడికి నచ్చదు. ఏది చెప్పినా ఓ పట్టాన నమ్మేవాడు కాదు. చదువులోనూ ముందుండే వాడు. మేము రెండు రోజులు చదివేది తను అరగంటలోనే నేర్చుకునేవాడు.
నాకు బాగా గుర్తుంది. మూడో తరగతిలో మేమందరం ఎక్కాలు బట్టీ పెడుతుంటే వాడు పెట్టేవాడు కాదు. మాస్టారు కోపంతో అడిగినపుడు 'బట్టి పెట్టడం దేనికి? గుణింతాలు వచ్చుకదా..! వాటితో ఏ ఎక్కం కావాలంటే అది వస్తుంది' అని మాస్టారు అడిగిన ఎక్కాలను తడుముకోకుండా చెబుతుంటే మేమంతా నోరెళ్ల బెట్టి చూస్తుండి పోయేవాళ్లం.
వాడిది అందరిలా సాధారణ మనస్తత్వంకాదు. ఏదీ గుడ్డిగా నమ్మకూడదు అన్నది వాడి సిద్ధాంతం. కట్టుకధలు, పుక్కిట పురాణాలనూ నమ్మేవాడు కాదు.
అలా పదవతరగతికి వచ్చేసరికి మాస్టార్లకి, ఊళ్లో వాళ్ళకి, మరీముఖ్యంగా వాళ్ల నాన్నకి ఓ కొరకరాని కొయ్యలా తయారయ్యాడు.
పదో తరగతిలో నాకు ఫస్ట్‌క్లాస్ వస్తే శ్రీహర్షకి సెకెండ్‌క్లాస్ వచ్చింది. వాడికి సెకెండ్‌క్లాస్ అనే సరికి హెడ్ మాస్టారు ఆశ్చర్యపోయి 'ఎందుకు తగ్గాయి మార్కులు' అని అడిగాడు. నేను అందరిలా టెక్ట్స్‌బుక్‌ని మక్కీకి మక్కీ బట్టీపట్టి రాయలేదు. సబ్జెక్ట్ రాశాను. కానీ దిద్దిన వాళ్ళు మార్కులు వెయ్యలేదు' అన్న వాడి సమాధానంతో మేమంతా చాలా బాధపడ్డాము.
ఇంటర్లో నేను ఆర్ట్స్ గ్రూపు తీసుకున్నాను. వాడు ఎమ్‌పిసి తీసుకున్నాడు. ''సైన్స్ కష్టంకదరా..! అంటే కష్టందే చదవాలి. సైన్స్, ఇంజనీరింగ్‌లు చదివి ప్రపంచానికి, సమాజానికి ఏదైనా చెయ్యాలి... లేకపోతే మన చదువులు వృథా!'' అన్నాడు.
'మానాన్నగారు ఇంటర్ అయిపోగానే టీచర్ ట్రైనింగ్ చెయ్యమంటున్నారు. టీచరు అయితే హాయిగా ఊర్లో స్కూల్లోనే పనిచేయొచ్చు' అని అందరూ అంటున్నారు. నిజమే కదారా!' అన్నాను. 'ఏంటి నిజంరా.. ఈ పెద్దలంతా నూతిలో కప్పల్లాంటివారు. వాళ్ళు జీవితంలో ఈ ఊరుదాటి ఎక్కడికీ వెళ్లాలి అనుకోరు' అంటున్న వాడి మాటల్లో ఉద్వేగం, కోపం కనిపించాయి నాకు.
మన ఊరిలో కూడా చాలా గొప్పవారు పుట్టారటకదరా..! మహాభారతాన్ని నాలుగు రోజుల్లో కంఠోపాఠం చేసిన అవధానిగారు ఇక్కడే పుట్టారు. రెండు రోజుల ఉపవాసంతో వర్షాలను కురిపించిన శాస్త్రిగారిది కూడా మన ఊరేకదా...! వాళ్ళు గొప్పవారు కాదంటావా?''
''ఏమిట్రా బోడిగొప్ప... 1000 సంవత్సరాల కిందట నుంచి ఓ పదిగ్రంధాలు వ్రాసిన వాళ్ళు తప్ప సైన్స్‌లో ఎవరికైనా నోబుల్ బహుమతులు వచ్చాయా? ఏదైనా మనవాళ్లు కనిపెట్టారా?
''అంటే నీ ఉద్దేశ్యం''
''నా ఉద్దేశ్యమా? 1498లో ఒక కర్ర పడవసాయంతో మనదేశాన్ని కనిపెట్టిన వాస్కోడిగామా, వంద వస్తువులు కనిపెట్టిన థామస్ ఎడిసన్, గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని కనుగొన్న న్యూటన్, సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొన్న ఐనెస్టీన్, చికెన్‌పాక్స్‌కి మందుకనుగొన్న లూయిపాశ్చర్, స్టీమ్ ఇంజన్ని కనుగొన్న వాట్, విమానాలను, రేడియోలను, కంప్యూటర్స్, టి.వీ.. ఇలా ఒకటేమిటి.. ఇవన్ని యూరోపియన్స్ కనుగొన్నారు. ఒక్కటి కూడా మనవాళ్లు ఎందుకు కనుక్కోలేకపోయారు?'' వాడి ప్రశ్నలకు నాదగ్గర సమాధానం ఉండేది కాదు.
''మరి వేదాలు ఇక్కడేపుట్టాయనీ మాస్టారు గారు చెప్పారు. చాణుక్యుడు, యుగంధర్, శాతకర్ణి, ప్రతాపరుద్రుడు, టిప్పుసుల్తాన్, రవీంద్రనాధ్ ఠాగూర్, సీవీరామన్'' వీళ్లంతా గొప్పవారు కారా?
''మనవాళ్లది ఆధ్యాత్మిక వాదం.. మూఢ విశ్వాసాలను ఎక్కువగా నమ్ముతారు. ఇంకా మనం ఎదగాలి. అలాగనీ నాకు మనదేశం అన్నా.. మన ఊరు అన్నా.. గౌరవం లేదనుకోకు. నాకు మనదేశం బాగుండాలనీ, ప్రపంచంలో అందరికన్నా మనం ముందుండాలనీ, మనవాళ్లు మిగతా వారికంటే తెలివైనవాళ్ళు అనిపించుకోవాలనీ నా కోరిక'' అని వాడు చెబుతుంటే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగేవి. వాడివన్నీ గొప్పభావాలు.
ఆ తరువాత ఇంటర్లో కాలేజీలో చేరాము. ప్రతిరోజూ పట్నానికి వెళ్లాలంటే మా ఊరి దగ్గర ఏరుదాటి పడవలో వెళ్లాల్సి వచ్చేది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన మన ఊరి ఏటికి ఓవంతెన కట్టలేకపోయాయి ప్రభుత్వాలు. ఇంతకన్నా వెనకబడిన తనం ఉందా చెప్పు? అని శ్రీహర్ష రోజూ ప్రశ్నిస్తూండేవాడు. అతి కష్టంమీద ఇంటర్ పూర్తిచేశాం.
''హర్షా! నువ్వూ టీచర్ ట్రైనింగ్‌లో చేరకూడదట్రా! హాయిగా మన ఊళ్లోనే టీచరుగా చేరవచ్చు. అపుడు మీనాన్నగారికి సహాయంగా ఉండొచ్చుకదా?'' అనేవాడిని. అప్పుడు వాడు ''ఒరేరు... నీవి కూపస్త మండూకపు ఆలోచనలు, మనలాంటి యువకుల్ని బంధించి ఎక్కడికి వెళ్లకుండా చేసి హాయిగా జీవితాన్ని ముగించాలన్నది ఇక్కడి పెద్దల ఆలోచన. గానుగెద్దుల్లాగా మనల్ని తయారుచేస్తున్నారు. ఇక్కడే ఉంటే మన ఆలోచనలు పెరగవు. మన మనసులు విస్తృతమవవు. నాకు అటువంటి జీవితం ఇష్టం ఉండదు. ఈ ప్రపంచానికి ఏదైనాచెయ్యాలి' అంటూ ఒకరోజు ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు హర్ష.
అలా వెళ్లిపోయినవాడి ఆచూకీ చాలా రోజుల దాకా తెలియలేదు. ఐదారేళ్ల తరువాత వాడు సివిల్ సర్వీసెస్‌కి సెలక్టౖెెనట్లు కొందరి స్నేహితులు ద్వారా తెలిసింది. కానీ అది ఎంతవరకు నిజమో తెలియలేదు.
ఈలోగా నేను టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకొనీ టీచరుగా ఎంపికై మా ఊరిస్కూల్లో చేరాను. హాయిగా కడుపులో చల్ల కదలకుండా గడిచిపోతోంది జీవితం.
సులోచనతో పెళ్లి, ఇద్దరు పిల్లలు.. ఇంతకన్నా ఇంకేం కావాలి.. అప్పుడప్పుడు పట్నం వెళ్లి సినిమాలు చూసివస్తున్నాం...''
ఇలా నిస్సారంగా గడిచిపోతున్న సమయంలో శ్రీహర్షని నోబుల్ బహుమతికి నామినేట్ చేసినట్లు తెలిసి చాలా సంతోషించాను.
***
ఇది జరిగిన ఒక వారం తరువాతనుకుంటాను ఒకరోజు రాత్రి శ్రీహర్ష నుంచి ఫోన్ వచ్చింది. ''ఏరా నేను గుర్తున్నానా? శ్రీహర్షని'' అని చెప్పాడు. ''నిన్ను మరిచిపోతే కదా! ప్రతిరోజూ నిన్ను గుర్తు చేసుకుంటాను'' అన్నాను.
''నేను నీపేరిట 200 కోట్ల రూపాయలు పంపిస్తున్నాను. నువ్విన్నది నిజమే..! అక్షరాల 200 కోట్ల రూపాయలు. ఆ డీడీని నువ్వు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కలెక్ట్ చేసుకొని మన జిల్లా కలెక్టర్‌కు చేర్చాలి. వాళ్ళు నీకు ఎకనాలెడ్జిమెంటు ఇస్తారు. ఆ డబ్బుతో వాళ్ళు మన ఊరికి కావాల్సిన వసతులు కల్పిస్తారు. నేను కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వానికి ఇది వరకే ఉత్తరాలు రాసి అన్ని అనుమతులు తీసుకున్నాను'' అని చెప్పాడు.
కొంచెంసేపు వాడు చెప్పిన మాటలు నాకు అర్ధంకాలేదు. 200 కోట్లు రూపాయలు ఊరికోసం ఇవ్వడమా? కలలో కూడా నేనూహించనిది. పెద్ద పెద్ద టాటాలు, అంబానీలే ఇటువంటి పనులు చెయ్యటం లేదు. అటువంటిది ఒక సామాన్యుడు, పురోహితుడి కొడుకు ఇంత పెద్ద మొత్తం సాయం చెయ్యడం అంటే వింతే...
నిజానికి ఈ ఊళ్లో ప్రస్తుతం వాళ్ల వాళ్లెవ్వరూలేరు. ఐదేళ్ల కిందట విశాఖలో ఓపెద్ద ఇల్లు కట్టి వాళ్ల అమ్మనాన్నల్ని అక్కడికి మార్చేశాడు. ఎప్పుడో గిరి ఆ విషయం చెప్పాడు. అయినా ఈ ఊరికి ఇంత మొత్తంలో సహాయం చేస్తున్నాడంటే చాలా గొప్ప విషయం అనుకున్నా.
''హర్షా! ఇప్పుడెక్కడున్నావు? ఏంచేస్తున్నావు? ఇంత డబ్బు ఎక్కడిది? మొన్ననే నీపేరు నోబుల్ బహుమతికి నామినేట్ అయ్యిందని తెలిసి చాలా సంతోషించాను..'' అసలు ఈ ఊరునుంచి 20 ఏళ్ల కింద వెళ్లిపోయిన నువ్వు ఏంచేస్తున్నావో చెప్పరా?'' అన్నాను ఆత్రంగా...
''చాలా కష్టాలు పడ్డానురా, హైదరాబాదు వెళ్లి అక్కడ కొన్నాళ్లు ఓ హోటల్లో పనిచేశాను. రాత్రిపూట కాలేజీలో బీయస్సీ చదివాను. ఆ తరువాత సివిల్స్ రాస్తే 100లోపు ర్యాంకు వచ్చింది. కానీ నాకెందుకో సంతృప్తి కలగలేదు. అవినీతి ఎక్కువైన మనదేశంలో ఐఏఎస్ అయినా పేదవాళ్లకు ఏ సహాయం చెయ్యలేము అనిపించింది. ఒక కంపెనీ సహకారంతో అమెరికా వెళ్లాను. అక్కడ స్కాలర్‌షిప్పుతో కెమిస్ట్రీలో ఎమ్మెస్ చేసాను. ఆ తరువాత ఓ కంపెనీలో కొన్నాళ్లు సైంటిస్ట్‌గా చేరాను. కొన్నాళ్లకు సొంతంగా ఓ లేబరేటరీ పెట్టాను. మూడేళ్లలో 50 రకాల కొత్తమందుల్ని కనుగొన్నాను. దాంతో మా లేబరేటరీ బాగా అభివృద్ధి చెందింది. ఇపుడు దాని విలువ ఇరవై వేల కోట్లరూపాయలు. ఒకప్పుడు తిండానికి తిండిలేక ఇంట్లోంచి వెళ్లిపోయిన నేను ఇంత ఆస్తికి వారసుడినయ్యానంటే నాకే ఆశ్చర్యం కలిగింది. ఇపుడు నా దగ్గర వెయ్యిమంది పనిచేస్తున్నారు. అయినా నాకు సంతృప్తి కలగలేదు. ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాను. మొన్ననే నేను కనుగొన్న ఔషధ ప్రయోగానికి నోబెల్ బహుమతి నామినేషన్ దక్కింది' అని చెప్పుకొచ్చాడు.
'మరి పెళ్లీ పిల్లలు'
'అదీ జరిగింది. మన తెలుగమ్మాయినే పెళ్లాడాను. ఇద్దరు పిల్లలు.. త్వరలో వస్తానులే' ఉంటాను. మన వాళ్లందర్నీ అడిగాననీ చెప్పు' అంటూ ఫోన్ పెట్టేశాడు.
***
అనుకున్నట్లే సంవత్సరంలో వాడు చెప్పిన పనులన్నింటినీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఇపుడు మా ఊరు ఏరుదాటక్కరలేదు. అందమైన వంతెన నిర్మించబడింది. ప్రతి ఇంటికి కుళాయిలు, పెద్ద వాటర్ టాంక్, రోడ్లన్నీ కాంక్రీటు, పొలాలకు కాలవల ద్వారా నీళ్ళు.. ఇవన్నీ వాడిచలవే.
ఈ మధ్యనే గుడి పూర్తైంది. దాని ధ్వజారోహణం, విగ్రహ ప్రతిష్టనాడు శ్రీహర్ష వస్తున్నాడనీ కబురొచ్చింది.
ఊళ్లో పెద్ద బహిరంగసభ జరిగింది. ఆ సభకు జిల్లా మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ మిగతా అధికారులందరూ వచ్చారు. వాళ్లంతా శ్రీహర్షని వేనోళ్ల పొగడుతుంటే నాకళ్లు చెమ్మగిల్లాయి. కానీ ఆ సభకి ఎందుకో శ్రీహర్ష రాలేదు. వాడు రాకుండానే ఆ సభ ముగిసింది.
ఆ రాత్రి పదిగంటల ప్రాంతంలో మా ఇంటి ముందర ఓ కారు ఆగింది. అప్పటికే ఊరంతా సద్దుమణిగింది. అందులోంచి శ్రీహర్ష, వాడి భార్య, పిల్లలు దిగారు.
''ఎంతపని చేసావురా.. రెండు గంటల ముందువస్తే ఊరంతా నిన్ను చూసేవారు కదా! నువ్వు చేసిన గొప్ప పనికి ఈచుట్టు పక్కల వాళ్ళు ఉప్పొంగిపోతున్నారు'' అన్నాను ఆవేశంగా.
''కావాలనే రాలేదురా... పొగడ్తలు నాకు నచ్చవు! పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒకటి చేయాలనుకున్నా.. నేను బాగా డబ్బు సంపాదించాను కాబట్టి చెయ్యగలిగాను. కాకపోతే ఈ ఊరిని ఒక్కసారి చూడాలన్న కోరిక బాగా పెరిగి ఇలా వచ్చాను. ఇప్పుడైతే ఎవ్వరికీ తెలియదు. నా భార్యా, పిల్లలకు మన ఊర్ని చూపించినట్లువుతుంది'' అంటూ కాసేపు మాట్లాడి భోజనాలు చేసి మళ్లీ వెళ్ళిపోయాడు.
నాకంతా కలలా ఉంది...
నిజమేనా అన్న భ్రమలో ఉన్నాను.
శ్రీహర్ష ఇంత గొప్పోడు అవడానికి కారణం ఏమిటి? నాలో ఎన్నో ఆలోచనలు.. నేనెందుకు అలా కాలేకపోయాను?
''కడుపులో చల్ల కదలకుండా హాయిగా జీవితాన్ని గడపటం వల్ల నేను ఏమి సాధించలేకపోయాను''.
''గానుగెద్దులెపుడు ముందుకెళ్లవు.. అవి అక్కడే తిరుగుతుంటాయి. వాటితో ముందుకెళ్ళలేము'' శ్రీహర్ష మాటలు ఇపుడు నాకు గుర్తుకొస్తున్నాయి.
అవును.. నేను గానుగెద్దునే..... వాడి మాటలు అక్షర సత్యం... గానుగెద్దులు ఏమీ సాధించలేవు..
* గన్నవరపు నరసింహమూర్తి