పార్వతీపురం: గాంధీజీ స్ఫూర్తిగా కొత్త సంకల్పం తీసుకోవాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలాలంకరణ చేసి ఘన నివాళులు అర్పించారు. అంతనం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలకు అహింసా మార్గంలో రూపకల్పన చేసి గొప్ప మార్గదర్శకత్వం గాంధీ వహించారని కొనియాడారు. ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిలిచారని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సైతం పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు వంటి మహానుభావులు శిష్యులుగా చేరారని వివరించారు. మహాత్మా గాంధీజీ మార్గం అనుసరణీయం, ఆచరణీయం అని పేర్కొంటూ కొత్త సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి గొప్ప పరిపాలనా దక్షులని అన్నారు. నైతిక విలువలకు మారు పేరుగా నిలిచారని చెప్పారు. జై జవాన్, జై కిసాన్ అంటూ పిలుపునిచ్చి గొప్ప ప్రేరణ కల్పించారని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోవింద రావు మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ అహింసావాదంతో మానవాళికి నూతన పంథాను చూపించారని అన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ జె.వెంకటరావు, పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పార్వతీపురం ఐటిడిఎలో...
స్థానిక ఐటిడిఎ గిరిమిత్ర సమావేశ మందిరంలో నిర్వహించిన మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలలో ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ బాటలో నడవాలని పిలుపునిచ్చారు.
ఎస్పీ కార్యాలయంలో...
పార్వతీపురంరూరల్ :స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి డిఎస్పీ మురళీధర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నేటితరం యువతీ యువకులు గాంధీ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని ముందుకు అడుగులు వేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌బి ఇన్స్పెక్టర్ సిహెచ్.లక్ష్మణరావు, ఆర్‌ఐ శ్రీనివాసరావు, జిల్లా ఆర్మడ్, స్పెషల్ బ్రాంచ్, డిసిఆర్‌బి అధికారులు, సిబ్బంది గాంధీ చిత్రపటానికి పూలమాలలు, పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన
గరుగుబిల్లి : పార్వతీపురం బార్ అసోసియేషన్‌లో రెండో అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి అహింస అన్నటువంటి విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. శాంతియుతంగా సమాజం ఉండేలాగా ప్రతి వ్యక్తి నడుచుకోవాలని తెలిపారు. అలాగే స్థానిక సబ్ జైలును సందర్శించి మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన ఉప్పు సత్యాగ్రహాన్ని, అహింస సిద్ధాంతాలను ఖైదీలకు వివరించారు. సత్ప్రవర్తన కలిగి, తప్పుడు మార్గాలకు దూరంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎ. రమేష్, బార్ వైస్ ప్రెసిడెంట్ కేతిరెడ్డి కూర్మినాయుడు, సెక్రటరీ పివి కృష్ణారావు, సీనియర్ అడ్వకేట్ టి.జోగారావు, ఎపిజి బొంగు సత్యనారాయణ, ఎపిపి గొర్లి వెంకట్రావు, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఐటిడిఎ కార్యాలయంలో...
సీతంపేట : స్థానిక ఐటిడిఎ ఎపిఒ వై.రోసిరెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో ఐటిడిఎ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీతంపేట బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎ.లిల్లీరాణి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాత పనుకువలస సమీపంలో ఉన్న ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్త అధిపతి పి.సీతారాం గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎంపిడిఒ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి ఎంపిడిఒ కొండపల్లి సత్యం పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిపిఒ సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు.










