నాడు గాంధీజీని హత్య చేసినవారి వారసులే నేడు దేశ స్వాతంత్య్రాన్నీ విదేశీ కార్పొరేట్లకు సమర్పించడానికి తొందరపడుతున్నారు. అందుకు ముందరి మెట్టుగా కాంట్రాక్టు వ్యవసాయం పేరిట మన దేశంలో, మన భూముల్లో ఏయే పంటలు ఏ విధంగా పండించాలో ఎవరికి, ఏ రేటుకు అమ్ముకోవాలో, ఏ ధాన్యాలు, పప్పులు దిగుమతి చేసుకోవాలో నిర్ణయించే హక్కును విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టే చట్టాలను చేశారు. గాంధీజీ కన్న కలలను సాకారం చేయాలని నేడు రైతాంగం పోరాడుతోంది. రైతులు కేంద్ర స్థానంలో ఉండే వ్యవసాయాన్ని రక్షించుకుంటూ దేశ ఆహార భద్రతను కూడా పరిరక్షించడం కోసం వారు పోరాడుతున్నారు.
నేడు మహాత్ముని 73వ వర్ధంతి. గాంధీజీ బలిదానం చేసిన రోజును అమరవీరుల దినంగా పాటిస్తూ దేశవ్యాప్తంగా ఒకరోజు ఉపవాస దీక్ష చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఈ పిలుపు ద్వారా తమ ఉద్యమం పూర్తిగా అహింసాయుతంగా జరుగుతున్న వాస్తవాన్ని మరో మారు ఆచరణ ద్వారా రైతు ఉద్యమం పునరుద్ఘాటించింది. దేశ రాజధానిలో గత 65 రోజులుగా అత్యంత క్రమశిక్షణతో, పట్టుదలతో, శాంతియుతంగా, సమైక్యంగా సాగుతున్న రైతు ఉద్యమం మీద బిజెపి, గోడీ మీడియా అంతులేని దుష్ప్రచారాన్ని సాగిస్తూనే వుంది. ఒకటో, రెండో రాష్ట్రాల్లోని కొద్దిమంది రైతులు మాత్రమే చేస్తున్న ఆందోళన అని సాగిన ప్రచారం ఎంత బూటకమో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రిపబ్లిక్‌డే నాడు రైతాంగం పాటించిన నిరసన కార్యక్రమాలు ప్రపంచానికి తెలియజెప్పాయి. ఆ రోజున ఢిల్లీలో మోడీ అనుకూల శక్తులు ఢిల్లీ పోలీసులతో కుమ్మక్కై సాగించిన అరాచకం లోగుట్టును సాక్ష్యాలతో సహా సోషల్ మీడియా బహిర్గతం చేసింది. ఉద్యమంలోకి వేరుపురుగులాగా ప్రవేశించిన దీప్‌సింగ్ నాటకం బట్టబయలైంది. ఈ రోజు దొంగ లాగా కనిపించకుండా పారిపోవలసిన పరిస్థితి అతగాడికి ఎదురైంది.
73 సంవత్సరాల క్రితం పట్టపగలు అతి కిరాతకంగా అహింసామూర్తి గాంధీజీని కాల్చి చంపిన గాడ్సే వారసులే, హింస, విద్వేషం మూర్తీభవించిన ఆ పరివారమే నేడు శాంతియుతంగా సాగుతున్న రైతు ఉద్యమాన్ని హింసతో, దౌర్జన్యంతో అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆనాడు ఏ స్ఫూర్తితో గాంధీజీ పిలుపునందుకుని ప్రజలు బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాన్ని, హింసను ఎదుర్కొని సత్యాగ్రహ ఉద్యమాన్ని జయప్రదంగా సాగించారో, ఈనాడు అదే స్ఫూర్తితో మన రైతన్నలు, అమ్మలు...నల్ల వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఉద్యమిస్తున్నారు. వీరికన్నా ఆ మహాత్మునికి గొప్ప వారసులు ఇంకెవరుంటారు? ఇంతకన్నా గొప్పగా గాంధీజీకి నివాళులు ఎవరు అర్పించగలరు?
వెనకటికి ఒక పరమ దుర్మార్గుడు తన కన్న తల్లిదండ్రులనే హతమార్చాడు. ఆ తర్వాత కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబడి ''అయ్యా, జడ్జి గారూ, నన్ను కనికరించండి. నన్ను శిక్షించకండి. ఎందుకంటే నేను తల్లీ, తండ్రీ లేని అనాథను'' అని వేడుకున్నాడట. ఇప్పుడు మోడీ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆ విధంగానే ఉంది. రైతుల చేతుల్లోంచి వ్యవసాయాన్ని ఊడలాక్కుని వారిని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల ముంగిట కట్టుబానిసలుగా నిలబెట్టే అత్యంత దుర్మార్గమైన చట్టాలను ఏకపక్షంగా రుద్ది, ఇప్పుడు తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే ఇదంతా చేసిందని సిగ్గూ, ఎగ్గూ లేకుండా చెప్పుకుంటున్నారు. తలకాయలను తాకట్టు పెట్టేసిన కొందరు మేధావులచేత అదే విషయాన్ని రోత పుట్టించేలా వాగిస్తున్నారు.
భారతీయత గురించి తెగ వాగుతూండే సంఘపరివారానికి ఆ భారతీయత గురించి ఓనమాలు కూడా తెలియవని రైతు ఉద్యమం చాటిచెప్పింది. ''భారతదేశం ఆత్మ గ్రామసీమల్లో, మన రైతుల దగ్గర ఉంది'' అన్న గాంధీజీ మాటలు మహాత్ముడికి ఈ దేశం గురించి ఎంత గొప్ప అవగాహన ఉందో తెలియజేస్తాయి. ఆ మహాత్ముడినే పొట్టన పెట్టుకున్న నీచులకు భారతీయత గురించి ఏం తెలుస్తుంది? గాడిదకేం తెలుసు గంధపు వాసన? (గాడిదలు క్షమించాలి. అవి మనకు గొప్పగా చాకిరీ చేస్తాయి. కార్పొరేట్లకు మాత్రమే చాకిరీ చేసేవాళ్ళతో గాడిదలను పోల్చడం అంటే గాడిదలకు అవమానమే).
గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం దేశానికే వెన్నెముకగా పని చేస్తుంది. గ్రామంలో రైతులదే ప్రధాన భూమిక. ఆ రైతులు సుభిక్షంగా ఉంటూ, గ్రామాభ్యుదయానికి కూడా చోదకశక్తిగా పని చేస్తారు. గ్రామీణ కుటీర పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు తోడ్పడతాయి. సహకార స్ఫూర్తితో తమ వనరులను కలబోసుకుని గ్రామీణ ప్రజలు గ్రామ స్వపరిపాలనను నిర్వహిస్తారు.
పెట్టుబడిదారీ అభివృద్ధిక్రమం ఇందుకు పూర్తి విరుద్ధం. చిన్న రైతుల్ని, చేతివృత్తుల్ని, సహకార వ్యవస్థని, గ్రామ స్థాయి ప్రజాస్వామ్యాన్ని అది తన క్రూరమైన లాభాపేక్షతో అణచివేస్తుంది. వారందరినీ తన ఫ్యాక్టరీల్లో అత్యంత చౌకగా పని చేసేందుకు పట్టణాలకు తరుముతుంది. అప్పటికే అక్కడ కునారిల్లుతున్న పట్టణ పేదలకు వీరిని పోటీగా నిలబెడుతుంది. తమకు అవసరం లేదనుకుంటే అత్యంత నిర్దాక్షిణ్యంగా వారిని ఆ పట్టణాల నుండే తరిమివేస్తుంది, ఇటీవల కరోనా లాక్‌డౌన్ సమయంలో పదుల లక్షల సంఖ్యలో వలసకూలీలు ఎటువంటి దయనీయ స్ధితిలో తమ స్వగ్రామాలకు చేరుకున్నారో ఆ వ్యధార్ధ గాధల చిత్రాలు ఇంకా మన కళ్ళ ముందు కదలాడుతూనే వున్నాయి.
గాంధీజీ కన్న కలలను సాకారం చేయాలని నేడు రైతాంగం పోరాడుతోంది. రైతులు కేంద్ర స్థానంలో ఉండే వ్యవసాయాన్ని రక్షించుకుంటూ దేశ ఆహార భద్రతను కూడా పరిరక్షించడం కోసం వారు పోరాడుతున్నారు. దేశ ఆహార భద్రతను గనుక కోల్పోతే మనం దేశ స్వాతంత్య్రాన్ని సైతం కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తుంది. దేశంలోని రైతాంగం, కార్మికులు, కష్టజీవులు పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం కోసం నేడు రైతులు పోరాడుతున్నారు. అనేక తరగతుల ప్రజలు, కార్మికులు వారికి అండగా నిలబడుతున్నారు.
నాడు గాంధీజీని హత్య చేసినవారి వారసులే నేడు దేశ స్వాతంత్య్రాన్నీ విదేశీ కార్పొరేట్లకు సమర్పించడానికి తొందరపడుతున్నారు. అందుకు ముందరి మెట్టుగా కాంట్రాక్టు వ్యవసాయం పేరిట మన దేశంలో మన భూముల్లో ఏయే పంటలు ఏ విధంగా పండించాలో ఎవరికి, ఏరేటుకు అమ్ముకోవాలో, ఏ ధాన్యాలు, పప్పులు దిగుమతి చేసుకోవాలో నిర్ణయించే హక్కును విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టే చట్టాలను చేశారు. స్వతంత్ర భారతదేశం హరిత విప్లవం ద్వారా సాధించుకున్న ఆహార భద్రతను- అది ఎంత పరిమితం అయినా సరే- సమాధి చేసి తమకన్నా దేశభక్తులు ఇంకెవరున్నారంటూ రంకెలు వేస్తున్నారు.
ప్రముఖ మార్క్సిస్టు నేత, సిద్ధాంతవేత్త కామ్రేడ్ ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ ''మహాత్ముడు-ఆయన సిద్ధాంతాలు'' అన్న ఒక గొప్ప ప్రామాణిక రచన చేశారు. నేటికి ఒక శతాబ్దం క్రితం భారతదేశంలో వచ్చిన రైతాంగ ఉద్యమ వెల్లువ గురించి ప్రస్తావిస్తూ ఈ విధంగా రాశారు. ''మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం భారత దేశంలోనూ, యావత్ ప్రపంచంలోనూ జరుగుతున్న చారిత్రాత్మక పరిణామాల ఫలితంగా ప్రజలలో బ్రహ్మాండమైన చైతన్యపు వెల్లువ వచ్చింది. భారతీయ రైతాంగం యొక్క ఆర్థిక పరిస్థితులు క్రమక్రమంగా దిగజారుతున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనూ, దాని తర్వాతనూ అవి మరీ అధ్వాన్నమైనాయి. భారత జాతీయోద్యమంలో అతివాదులు బలపడ్డారు. కొన్ని ప్రదేశాలలో వారు రైతాంగంలోని కొన్ని తరగతుల వారితో సంబంధాలు పెట్టుకున్నారు కూడా. టర్కీలోనూ, చైనాలోనూ వచ్చిన విప్లవాలు, ముఖ్యంగా రష్యా విప్లవం మొదలైన అంతర్జాతీయ పరిణామాలు ఆసియా ప్రజల మనస్సులకు బాగా పట్టాయి. భారతీయ రైతాంగంలో చైతన్యం వృద్ధి పొందించిన కారణాలలో ఇవి కొన్ని మాత్రమే.
అయితే భారతీయ రైతాంగంలో వచ్చిన చైతన్యానికి ఒక నిర్దిష్టమైన రూపం ఇవ్వడంలో గాంధీజీ వ్యక్తిత్వానికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఈ నూతన చైతన్యం స్వాతంత్య్రం, ప్రజాతంత్రం కొరకు సాగుతున్న రాజకీయోద్యమంతో లంకెపడి నడవడానికి గాంధీజీ వ్యక్తిత్వం చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. పల్లె ప్రజాసామాన్యాన్ని జాతీయ ప్రజాతంత్రోద్యమంలోకి ఆకర్షించి దానిని బలపరచడంలో గాంధీజీ చేసిన సేవను విస్మరించలేం.''
ఆనాడు రైతాంగం ఉద్యమాలలోకి రావడానికి దోహదం చేసిన ఆర్థిక దుర్భర పరిస్థితులు తిరిగి యథాతథంగా కాకపోయినా, వ్యవసాయ రంగంలో నెలకొన్నాయి. జాతీయ స్వాతంత్య్రమూ పెనుముప్పును ఎదుర్కుంటోంది. ఈ పరిస్థితుల్లో రైతులు నేడు సాగిస్తున్న ఉద్యమం విజయవంతం కావడం కేవలం రైతుల ప్రయోజనాల కోసమో, వ్యవసాయరంగ పరిరక్షణ కోసమో మాత్రమే కాదని, విశాల దేశ ప్రయోజనాల కోసం కూడా అని, ముఖ్యంగా కష్టజీవులందరి ప్రయోజనాల కోసమని గ్రహించాలి. రైతుల ఉద్యమాన్ని గెలిపించడం కోసం కృషి చేయడం కన్నా మించిన గొప్ప దేశభక్తి వేరే ఏదీ ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. దేశం పేరు చెప్పి కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్న మోడీ విధానాలను తిప్పి కొట్టడం కన్నా ముఖ్యమైన కర్తవ్యం మరోటి లేదు.
ఎం.వి.ఎస్. శర్మ










