Oct 20,2021 06:14

సావర్కర్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లకు మహాత్మా గాంధీ అనుమతి ఉన్నదని చెప్పడం ద్వారా ఆయన న్యాయంగానే వ్యవహరించారని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇద్దరికీ మధ్య సన్నిహిత సంబంధం ఉన్నదని చెప్పడం ద్వారా వారి మధ్య ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేదన్న వాస్తవాన్ని కప్పిపుచ్చ దలుచుకున్నారు. హిందూత్వ సిద్ధాంతవేత్త, హిందూ మహాసభ నాయకుడైన సావర్కర్‌ గాంధీజీని తీవ్రంగా విమర్శించేవారు. ముఖ్యంగా గాంధీజీ ప్రవచించిన అహింస, ముస్లింలను కలుపుకు పోవాలన్న అభిప్రాయాలను సావర్కర్‌ తిరస్కరించారు. భారత దేశం ఎవరికి చెందుతుంది అనే విషయంలో వారి మధ్య తీవ్రమైన బేధాభిప్రాయాలున్నాయి.

(నిన్నటి తరువాయి)
     1948 జనవరిలో గాంధీ హత్య జరిగినప్పుడు హత్య వెనుక కుట్రకు ప్రధాన సూత్రధారి సావర్కరేనని ఆయనను అరెస్టు చేశారు. ఆనాడు హోం మంత్రిగా ఉన్న సర్దార్‌ పటేల్‌ ఈ మొత్తం కేసును పర్యవేక్షించారు. ఆయన మంచి న్యాయవాది కూడా. సావర్కరే దోషి అని పటేల్‌ నిర్ధారణకు వచ్చారు. లేకుంటే ఆయన సావర్కర్‌పై విచారణ జరిపించి ఉండేవాడు కాదు. ''సావర్కర్‌ నేరుగా పర్యవేక్షిస్తున్న హిందూ మహాసభ యొక్క మతోన్మాద విభాగం ఈ కుట్ర పన్నింది, దాన్ని అమలు చేసింది'' అని పటేల్‌ నాటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూతో విస్పష్టంగా చెప్పారు. (దుర్గా దాస్‌: సర్దార్‌ పటేల్‌ ఉత్తరప్రత్యుత్తరాలు, 1945-50, వాల్యూమ్‌ 6, పేజీ 56)
       మేమే పాపం ఎరుగం అని హిందూ మహాసభ బుకాయించడంతో నాటి హిందూ మహాసభ నాయకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీకి 1948 మే 6న పటేల్‌ కింది విధంగా రాశారు: ''....ఈ విషాద వార్త (గాంధీ హత్య) విన్నంతనే అనేక మంది (హిందూ) మహాసభ సభ్యులు ఆనందోత్సాహాలతో మిఠాయిలు పంచుకున్న వాస్తవాన్ని చూడకుండా మేం కళ్లు మూసుకోలేదు.... అంతే కాకుండా కొద్ది మాసాల క్రితం వరకు మహంత్‌ దిగ్బిజొరు నాథ్‌, ప్రొఫెసర్‌ రామ్‌ సింగ్‌, దేశ్‌ పాండే వంటి వారు ప్రవచించిన తీవ్రవాద మతతత్వం, ప్రజల భద్రతకు ప్రమాదకరం అన్న దాంట్లో సందేహం లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ కు కూడా ఇదే వర్తిస్తుంది. ఈ సంస్థ రహస్యంగా సైనిక, పాక్షిక సైనిక పద్ధతుల్లో నిర్మించబడడం మరింత ప్రమాదకరం.'' (సర్దార్‌ పటేల్‌ ఉత్తర ప్రత్యుత్తరాలు, వాల్యూమ్‌ 6, పేజీ 66)
      శ్మామ్‌ ప్రసాద్‌ ముఖర్జీతో పటేల్‌ ఇంకా ఇలా అన్నారు: ''ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలు ఈ దేశ ప్రభుత్వం, రాజ్యం మనుగడకు ప్రమాదకరమైనవి''. (1948 జులై 18, సర్దార్‌ పటేల్‌ ఉత్తర ప్రత్యుత్తరాలు, వాల్యూమ్‌ 6, పేజీ 323)
      నాటి బొంబాయి ముఖ్యమంత్రి బి.జి. ఖెర్‌ మహారాష్ట్ర లోని రాజకీయ పరిస్థితి గురించి పటేల్‌కు ఈ విధంగా వివరించారు: ''కాంగ్రెస్‌కు, మహాత్మాకు వ్యతిరేకంగా ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు హిందూ మహాసభ సృష్టించిన వాతావరణమే గాంధీ మహాత్ముని కొద్ది మంది మహారాష్ట్రీయులు హత్య చేయడానికి దారితీసింది.'' (పటేల్‌కు బి.కె ఖెర్‌ రాసిన ఉత్తరం, 1948 మే 26, పైన పేర్కొన్న రచన వాల్యూమ్‌ 6, పేజీలు 77-78)
     క్రిమినల్‌ చట్టంలో 'అప్రూవర్‌ ఇచ్చిన వాంగ్మూలంతో స్వతంత్ర ఆధారాలు సరిపోలడం లేదు' అన్న సాంకేతిక పాయింటు వల్ల చివరికి సావర్కర్‌ గాంధీ హత్య కేసులో శిక్ష నుండి తప్పుకున్నారు.
     అయితే, 1965లో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జివాన్‌ లాల్‌ కపూర్‌ నాయకత్వంలో ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిషన్‌ చాలా పెద్ద ఎత్తున సాక్ష్యాధారాలు సేకరించింది. ఈ సాక్ష్యాలు విచారణ జరిపిన న్యాయమూర్తికి అందలేదు. సావర్కర్‌ సన్నిహిత సహచరులైన ఇద్దరు వ్యక్తులు ఎ.పి కాసర్‌, జి.వి దామ్లె లు న్యాయమూర్తి ముందు సాక్ష్యం చెప్పకపోయినా కపూర్‌ కమిషన్‌ ముందు అన్ని విషయాలు చెప్పారు. అయితే అప్పటికే సావర్కర్‌ చనిపోయారు. వారు ఇచ్చిన వాంగ్మూలాలు స్వతంత్ర ఆధారాలతో సరిపోలాయి. వీరు గనుక విచారణ సందర్భంగా న్యాయస్థానంలో ఈ వాంగ్మూలం ఇచ్చి ఉంటే సావర్కర్‌ దోషి అని తేలిపోయేది. నిజానికి కపూర్‌ కమిషన్‌ పటేల్‌ వచ్చిన లాంటి నిర్ధారణలకే వచ్చింది: ''సావర్కర్‌, ఆయన బృందం కలిసి ఈ హత్యకు కుట్ర పన్నారని ఈ ఆధారాలన్నిటినీ ఒకచోట చేరిస్తే అర్ధమవుతుంది'' అని ఆయన పేర్కొన్నారు. (మహాత్మా గాంధీ హత్యపై వేసిన దర్యాప్తు కమిషన్‌ నివేదిక, 1970, పేజీ 303)
      గాంధీ హత్య జరిగిన వెంటనే సర్దార్‌ పటేల్‌ ఉప ప్రధానిగా, హోం మంత్రిగా ఉన్న భారత ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ ను నిషేధించింది. 25,000 మంది ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులను జైలులో పెట్టింది. నిషేధం వేటు పడగానే హిందూ మహాసభ తనను తాను రద్దు చేసుకుంది. గాంధీజీ హత్య కళంకం అంటుకోవడంతో హిందూ మహాసభ వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గింది. దాని ప్రధాన నాయకుడైన శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ 1951లో భారతీయ జనసంఫ్‌ును స్థాపించారు. అప్పటి నుండి హిందూ మతోన్మాద రాజకీయాలను ముందుకు తీసుకుపోడానికి జనసంఫ్‌ు ఒక సాధనంగా, దాని రాజకీయ విభాగంగా తయారైంది. ఎమర్జెన్సీ కాలంలో జనసంఫ్‌ు జనతా పార్టీలో విలీనమైంది, తరువాత బిజెపి అవతారం ఎత్తింది.
      విశేషమేమంటే ఈ రోజు తాము గొప్ప జాతీయవాదులం అని బొర్ర విరుచుకుంటున్న ఈ శక్తులు ఏవీ వాస్తవంగా భారత స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొనలేదు. 1924లో జైలు నుండి విడుదలైన తరువాత సావర్కర్‌ ఏనాడూ బ్రిటిష్‌ వ్యతిరేక రాజకీయాల్లో పాల్గొనలేదు. నిజానికి హిందూత్వ సిద్ధాంత ఆవిష్కర్త ఆయనే. పితృ భూమి, పుణ్య భూమి రెండూ భారత దేశంగా గల వారు మాత్రమే భారతీయులని ఈ సిద్ధాంతం చెబుతుంది. అందువల్ల తమ పుణ్యభూమి భారత దేశం బయట గల ముస్లింలు, క్రైస్తవులను అది వేరు చేస్తుంది. 1930, 40 దశకాల్లో హిందూ మహాసభ బ్రిటిష్‌ వారికి మరింత తొత్తుగా మారిపోయింది. అంతకు ముందు నుండి తొత్తులుగా వ్యవహరించే ధోరణి ఉన్నప్పటికీ తొలి దశలో కొందరు దాని నాయకులు కొందరు కాంగ్రెస్‌ నాయకత్వం లోని ఉద్యమాల్లో పాల్గొనేవారు. కానీ 1937లో సావర్కర్‌ దాని అధ్యక్షుడుగా, తిరుగులేని నాయకుడుగా వచ్చినప్పటి నుండి వారు బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు వేసే ఎంగిలి మెతుకులు ఏరుకోవడంలో ముస్లిం లీగ్‌తో పోటీ పడడం ప్రారంభించారు. రెండో ప్రపంచ యుద్ధం రావడంతో జాతీయవాద శక్తులతో విబేధాలు బహిరంగంగా ముందుకు వచ్చాయి. భారత దేశ సమ్మతి తీసుకోకుండానే దేశాన్ని యుద్ధంలో భాగస్వామిగా చేసినందుకు నిరసనగా రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ మంత్రివర్గాలు రాజీనామాలు చేశాయి. కానీ హిందూ మహాసభ నాయకులు బ్రిటిష్‌కు సహకరిస్తామని ముందుకు వచ్చారు. భారతీయులు యుద్ధ-సన్నాహాల్లో పాల్గొనాలనీ, సైన్యంలో చేరాలనీ ప్రచారం చేశారు. హిందూ మహాసభ అధ్యక్షుడుగా సావర్కర్‌ ''బ్రిటిష్‌ ప్రభుత్వం చేస్తున్న అన్ని రకాల యుద్ధ-సన్నాహాల్లో పాల్గొనాలి'' అని, ఈ విధానాన్ని ''సామ్రాజ్యవాదులకు సహకరించడంగా'' కొందరు ''మూర్ఖులు'' చేస్తున్న ''ఖండనలను'' వినవద్దు అని హిందువులకు విజ్ఞప్తి చేశారు. (సావర్కర్‌; హిందూ రాష్ట్ర దర్శన్‌, పేజీ 203)
      హిందువులు, బ్రిటిష్‌ వాళ్లు స్నేహితులుగా ఉండాలనీ, కాంగ్రెస్‌ మంత్రివర్గాలు గనుక రాజీనామాలు చేస్తే వాటి స్థానంలో హిందూ మహాసభ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుందని 1939లో సావర్కర్‌ బ్రిటిష్‌ వైశ్రారుతో ప్రయివేటుగా చెప్పారు. (జెట్‌లాండ్‌ వైశ్రారుకి కార్యదర్శి, విదేశాంగ కార్యదర్శి లిన్‌లిత్‌గో, 1939 అక్టోబర్‌ 7, జెట్‌లాండ్‌ పత్రాలు, వాల్యూమ్‌ 18, రీల్‌ నెం.6)
హిందూ మహాసభ యొక్క ఈ బ్రిటిష్‌-అనుకూల విధానానికి అనుగుణంగానే 1942 క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీతో సహా కాగ్రెస్‌ నాయకులంతా జైళ్లలో ఉన్నప్పుడు హిందూ మహాసభ నాయకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ బెంగాల్‌ లోని ఫజ్లుల్‌ హాఖ్‌ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. సింధు, వాయవ్య సరిహద్దు రాష్ట్రాల్లో హిందూ మహాసభ, ముస్లిం లీగ్‌తో కలిసి మిశ్రమ మంత్రివర్గాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ తొత్తు వ్యవహారాలేవీ దానికి ఎన్నికల్లో విజాయాలు చేకూర్చలేదు. 1946 ఎన్నికల్లో అది ఘోరంగా ఓడిపోయింది.
      ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా ఒక సంస్థగా వలసవాద దాశ్యం నుండి విముక్తి కోసం జరిగిన ప్రధానమైన ఏ పోరాటంలోనూ పాల్గొన లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ 1925లో ప్రారంభమైంది. ఆ తరువాతి కాలంలో 1928 సైమన్‌ కమిషన్‌ బహిష్కరణ ఉద్యమం కాకుండా మరో రెండు ప్రధానమైన ఉద్యమాలు- 1930-34 సహాయ నిరాకరణోద్యమం, 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంను కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించింది. ఈ ఉద్యమాలు వేటిలోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ పాల్గొనలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడైన హెగ్డేవార్‌ 1930లో వ్యక్తిగత హోదాలో జైలుకు వెళ్లారు. అయితే ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ నూ దాని సభ్యులను సహాయ నిరాకరణోద్యమానికి దూరంగా ఉంచారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తో తనకేం భయం లేదన్న విషయంలో బ్రిటిష్‌ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది.''కాంగ్రెస్‌ గొడవలు (1942) సందర్భంగా సంఫ్‌ు నిర్వహించిన ఒక సభలో మాట్లాడిన వక్తలు కాంగ్రెస్‌ ఉద్యమానికి దూరంగా ఉండాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఆదేశాలను వారు సాధారణంగా పాటించారు'' అని ఆర్‌ఎస్‌ఎస్‌ పై నాటి హోమ్‌ శాఖ నోట్‌లో పేర్కొన్నారు.
     గాంధీజీ హత్య తరువాత సావర్కర్‌ గురించి ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్‌ు-బిజెపి శిబిరంలో నాలుగైదు దశాబ్దాలు మౌనం రాజ్యమేలింది ఎందుకన్న ప్రశ్న రావడం న్యాయమే. సావర్కర్‌ గాంధీజీని హత్య చేసిన వ్యక్తి అని ప్రజల్లో నాటుకు పోవడమే దీనికి కారణమా? ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ గనుక ఇన్నాళ్లు గడిచిన తరువాత ఇప్పుడు సావర్కర్‌ పేరును తిరిగి వెలుగు లోకి తీసుకురావచ్చునని భావిస్తున్నారా? అంతే కాకుండా 'హిందూత్వ''ను కొత్తగా ప్రజల్లో బలంగా ప్రచారం చేస్తున్నారు గనుక ఈ భావనను సృష్టించిన వ్యక్తిని మరిచిపోవడం వారికి కష్టతరంగా మారింది. దాంతోపాటు బిజెపి తనను తాను జాతీయ వాద పార్టీ అని చెప్పుకుంటున్నప్పుడు ఆ పార్టీలో ఒక్క స్వాతంత్య్ర సమరయోధుడ్ని కూడా చూపించలేకపోవడం నామోషీగా ఉంటుంది కదా! అందువల్ల జాతీయవాద నేతలు మాకూ ఉన్నారు అని చెప్పుకోవడం కోసం వారు ఇప్పుడు సావర్కర్‌ను కొత్త అవతారంలో చూపించదలచుకున్నారు.
       సావర్కర్‌ మతోన్మాదం మీద జాతీయవాద ముసుగు కప్పేందుకు వారు అతన్ని 'క్రాంతివీర్‌' అనీ, 'అండమాన్‌ విప్లవకారుడు' అనీ ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో అండమాన్‌ జైలులో ఉండగా తనకు క్షమాభిక్ష పెట్టాలని బ్రిటిష్‌ వారిని సావర్కర్‌ పదేపదే వేడుకోవడం ద్వారా విప్లవకారులు సిగ్గుతో తల వంచుకునేట్లు చేశాడన్న విషయం, ఆయన బ్రిటిష్‌ ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లే జైలు నుండి విడుదలైన తరువాత జాతీయోద్యమ కార్యకలాపాల్లో పాల్గొన లేదన్న విషయాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. 2003లో ఎన్డీఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఎంతగా నిరసన తెలిపినప్పటికీ లెక్క చేయకుండా పార్లమెంటులో సావర్కర్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. సావర్కర్‌పై ఏమాత్రం అనుమానం ఉన్నా ఈ పనిచేసి ఉండాల్సింది కాదు. ఇక ఇప్పుడు సరికొత్తగా: ఆయన పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లకు మహాత్మా గాంధీ అనుమతి ఉన్నదని చెప్పడం ద్వారా ఆయన న్యాయంగానే వ్యవహరించారని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇద్దరికీ మధ్య సన్నిహిత సంబంధం ఉన్నదని చెప్పడం ద్వారా వారి మధ్య ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేదన్న వాస్తవాన్ని కప్పిపుచ్చదలుచుకున్నారు. హిందూత్వ సిద్ధాంతవేత్త, హిందూ మహాసభ నాయకుడైన సావర్కర్‌ గాంధీజీని తీవ్రంగా విమర్శించేవారు. ముఖ్యంగా గాంధీజీ ప్రవచించిన అహింస, ముస్లింలను కలుపుకు పోవాలన్న అభిప్రాయాలను సావర్కర్‌ తిరస్కరించారు. భారత దేశం ఎవరికి చెందుతుంది అనే విషయంలో వారి మధ్య తీవ్రమైన బేధాభిప్రాయాలున్నాయి. ''భారత దేశం హిందూ భూమి, అందువల్ల అది హిందువులకు మాత్రమే రిజర్వు చేయాలి'' అని సావర్కర్‌ స్పష్టంగా చెప్పారు. ''మన స్వంత ఇల్లు 'హిందుస్థాన్‌'లో హిందువులు యజమానులుగా ఉండాలి'' అని స్పష్టంగా పేర్కొన్నారు (హిందూ రాష్ట్ర దర్శన్‌, పేజీ 92, 63). మరోవైపు గాంధీజీ 1942 ఆగస్టులో బొంబాయిలో క్విట్‌ ఇండియా పిలుపునిస్తూ చేసిన ప్రఖ్యాత ప్రసంగంలో స్పష్టంగా ఇలా ప్రకటించారు: ''కత్తిని నమ్ముకున్న డా|| ముంజె, శ్రీ సావర్కర్‌ వంటి వారు ముస్లింలను హిందూ ఆధిపత్యం కింద ఉండాలని తలపోస్తూ ఉండవచ్చు. నేను ఆ సెక్షన్‌ ఆలోచనకు ప్రతినిధిని కాదు. నేను కాంగ్రెస్‌ ప్రతినిధిని. ఏ ఒక్క బృందం, లేక సమాజిక వర్గం ఆధిపత్యాన్ని కాంగ్రెస్‌ ఆమోదించదు. అది ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది. ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, పారశీలు, యూదులు-ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకుంటుంది....ఈ దేశంలోని కోట్లాది మంది ముస్లింలు హిందువుల నుండి వచ్చారు. అందువల్ల వారి జన్మభూమి భారత దేశం కాకుండా ఇంకేమవుతుంది?''.
       సావర్కర్‌, ఆయన సహచరులకూ భగత్‌సింగ్‌ వంటి విప్లవకారులకూ మధ్య తేడాను మనం చూడకుండా ఉండలేం. వారు మరణ శిక్షతో సహా అన్ని రకాల శిక్షలనూ అనుభవించడానికే సిద్ధపడ్డారుగాని ఏనాడూ క్షమాభిక్ష అడగలేదు. నిజానికి మొదటి నుండీ కూడా భారతీయ జాతీయోద్యమ యోధులు ఒక పద్ధతిని అభివృద్ధి చేస్తూ వచ్చారు. అదేమంటే, తాము బ్రిటిష్‌-వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డామని ధైర్యంగా అంగీకరించడం, విచారణను ఎదుర్కోవడం, విచారణను కూడా తమ జాతీయోద్యమ లక్ష్యాల ప్రచారం కోసం వినియోగించుకోవడం, తరువాత జైలు శిక్షలు గానీ, ప్రవాసం గానీ చివరికి మరణ శిక్షగానీ అనుభవించడానికి సిద్ధపడడం చేసేవారు.
      కానీ దీనికి భిన్నంగా సావర్కర్‌ బ్రిటిష్‌ ప్రభుత్వానికి క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకోవడం, తనను విడుదల చేస్తే మంచిగా ప్రవర్తిస్తానని బ్రిటిష్‌ వారి ముందు మోకరిల్లడం చేసేవారు. 1924లో ఇటువంటి పిటిషన్‌తో బ్రిటిష్‌ జైలు నుండి విడుదలైన తరువాత కూడా సావర్కర్‌ ఇదే వైఖరిని అవలంభించారు. గాంధీజీ హత్య కేసులో సావర్కర్‌ను అరెస్టు చేసిన మూడు వారాల తరువాత, 1948 ఫిబ్రవరి 22న ఆయన ఆర్థర్‌ రోడ్‌ జైలు నుండి పోలీసు కమిషనర్‌కు ఒక మహజరు సమర్పించారు: అందులో ఆయన ''నన్ను గనుక ప్రభుత్వం విడుదల చేస్తే ప్రభుత్వం కోరినంత కాలం ఎటువంటి మతతత్వ, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా వాటికి దూరంగా ఉంటాను..''.అని ప్రభుత్వానికి అండర్‌ టేకింగ్‌ ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. నాస్తికుడైన సావర్కర్‌ భక్తుడైన గాంధీజీతో సమైక్యం చెందితే మినహా ఇటువంటి సలహాను గాంధీజీ ఇస్తారని ఎవరూ అనుకోరు.

మృదులా ముఖర్జీ,
ఆదిత్య ముఖర్జీ,
సుచేతా మహాజన్‌