
ప్రజాశక్తి - భట్టిప్రోలు
వ్యవసాయం తర్వాత చేనేత రంగం పరిరక్షించేందుకు మహాత్మా గాంధీ ఎన్నో కలలు కన్నారని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. నేడు పాలకుల విధానాల కారణంగా చేనేత సంక్షోభంలో చిక్కుకుందన్నారు. గాంధీ జయంతి సందర్భంగా భట్టిప్రోలులో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక రథం సెంటర్లో గాంధీజీ విగ్రహానికి నులు దండ వేసి నివాళులర్పించారు. స్వతంత్ర ఉద్యమంలో చేనేత రంగం కీలక పాత్ర పోషించిందని అన్నారు. బ్రిటిష్ వస్త్రాలను బహిష్కరించాలని, స్వదేశీ వస్త్రాలను వినియోగించాలని గాంధీజీ ఇచ్చిన పిలుపు చేనేతకు జీవం పోసిందన్నారు. గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ పాలనలో చేనేత రంగానికి పెద్దపీట వేశారని, నేటి పాలకులు చేనేతను విస్మరించి సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిల్లు వస్త్రాలను ప్రోత్సహిస్తూ చేనేతరంగాన్ని నిర్వీర్యం చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని పెంచి కార్మికుల రాయితీలను పూర్తిగా ఎత్తివేసిందని అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షలకుపైగా చేనేత కార్మికులు పనిచేస్తుంటే కేవలం 80వేల మగ్గాలకు మాత్రమే నేతన్న నేస్తం అమలు చేస్తూ గొప్పలు చెప్పుకుంటుందని ఆరోపించారు. చేనేత రంగంలో పని చేసే కార్మికులు అందరికీ నేతన్న నేస్తం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 11రకాల రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. చేనేతపై జిఎస్టిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. సంక్షోభంతో కార్మికులు అర్దాకలతో బ్రతుకుతున్నారని అన్నారు. చేనేతను అడ్డంపెట్టుకుని జేబులు నింపుకునే నాయకులను కార్మికులు గమనించాలని కోరారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు మురుగుడు సత్యనారాయణ, గొట్టుముక్కల బాలాజీ, బట్టు నాగమల్లేశ్వరరావు, దీపాల సత్యనారాయణ, దొంతు కోటేశ్వరరావు, బట్టు రాము, శ్రీనివాసరావు పాల్గొన్నారు.