ప్రజాశక్తి - వన్‌టౌన్ : చంద్ర గ్రహణాన్ని విజయవాడ వాసులు ప్రత్యక్షం చూశారు. ఇందుకుగాను మంగళవారం సాయంత్రం 5 నుండి 6:30 గంటల వరకు నగరంలోని గాంధీ హిల్‌పైన ఏర్పాట్లు చేశారు. డాక్టర్ రాధాకష్ణ, ఇంగ్లాండ్ నుండి వచ్చిన సైంటిస్ట్ స్వాన్, పద్మ, ఉమా తదితరులు నాలుగు టెలిస్కోప్‌ల ద్వారా ప్రజలు వీక్షించే అవకాశాన్ని కల్పించారు. అప్‌కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఢిల్లేశ్వరరావు, జిల్లా సైన్స్ కో-ఆర్డినేటర్ మైనం హుస్సేన్, అప్‌కాస్ట్ ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం సిబ్బంది సహకారం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గాంధీ హిల్ ఫౌండేషన్, స్టార్ గేజర్స్ విజయవాడ వారి సహకారంతో ఈ ఏర్పాట్లు చేశారు. విజయవాడ చుట్టుపక్కల ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో వచ్చి చంద్రగ్రహణాన్ని వీక్షించారు. అయితే గ్రహణం మాత్రం సాయంత్రం 6 గంటల నుండి మాత్రమే కనిపించింది. ఎందుకంటే అంతకుముందు ఆకాశం పూర్తిగా మేఘావతమై ఉండడంతో 5 గంటల నుండి రావాల్సిన గ్రహణం 6 గంటల నుండి కనిపించింది. గ్రహణాన్ని వీక్షించిన వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సంవత్సరంలో చివరి గ్రహణం కావడంతో ప్రజలు ఆసక్తి కనబరిచారు. టెలిస్కోపుల ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేసిన డాక్టర్ రాధాకృష్ణ, స్వాన్, పత్మ, ఉమాలకు భవానీపురంలోని రీజనల్ సైన్స్ సెంటర్ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
దుర్గగుడి మూసివేత
పాక్షిక చంద్ర గ్రహణం కారణంగా విజయవాడ కనక దుర్గమ్మ ఆలయాన్ని మంగళవారం ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో ఇఒ డి.భ్రమరాంబ మూసివేశారు. ఉదయం 8 నుంచి ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాలను మూసివేశారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు ఆలయాలను శుద్ధిచేసి దేవతా విగ్రహాలకు స్నపనాభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చన, మహానివేదన, హారతి ఇచ్చి మరోసారి ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాలను మూసివేశారు. ఉదయం 8 గంటలలోపు ఉన్న సుప్రభాత సేవ, ఖడ్గమాలార్చన, గణపతి హోమం, నవగ్రహ శాంత్రి హోమం, రుద్రహోమాలకు మాత్రమే అధికారులు అనుమతించారు. తర్వాత ప్రారంభమయ్యే లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణం, శ్రీ చక్ర నవావరణార్చన, చండీహోమం, పంచ హారతులు, పల్లకీ సేవ తదితర సేవలను రద్దు చేశారు. బుధవారం ఉదయం యధావిధిగా అన్ని దర్శనాలు, ఆర్జిత సేవలు పునః ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు తెలిపారు.










