కడప అర్బన్ : స్వాతంత్య్ర పోరాటంలో జాతిని ఏకం చేసి పోరాడిన మహాత్మా గాంధీ స్పూర్తితో కడప ఉక్కును సాధించుకుందాం, మత సామరస్యాన్ని కాపాడుకుందాం, విభజన హామీల అమలుకై పోరు సాగిద్దాం అని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్, ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీల రాష్ట్ర కో - కన్వీనర్ ఎం. ఆర్.నాయక్ తెలిపారు. అక్టోబర్ 2 గాంధీజీ జయంతి పురస్కరించుకొని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ విద్యార్థి, యువజన సంఘాల అధ్వర్యంలో కడపలో స్థానిక వెంకట సాయి కొచింగ్ సెంటర్‌లో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. గాంధీజీ మత సామరస్యాన్ని పాటిస్తూ వచ్చాడు అన్నారు. బిజెపి దానిని పూర్తిగా విస్మరించిందన్నారు. దేశాన్ని అంబానీ, ఆదానిలకు తాకట్టు పెట్టిందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నదన్నారు. ప్రధానంగా విభజన హామీలలో కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడంలో కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ప్రత్యేక హోదా ,రాయలసీమకు ప్యాకేజీ వంటివి ఇవ్వలేదన్నారు. లక్షల మంది యువకుల కల కడప ఉక్కు పరిశ్రమ అన్నారు. రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులు కడప ఉక్కుకు మూడు విలాఫలకాలు వేశారని చెప్పారు. .రాష్ట్రంలోని అధికార,ప్రతిపక్ష పార్టీలు కేంద్రం పై ఒత్తిడి తీసుకురావడం లేదని చెప్పారు. గాంధీజీ కన్న కలలకు బిజెపి పాలనకు పూర్తి విరుద్ధమన్నారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఉదాహరణ మధ్యప్రదేశ్ ,ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో మహిళల పై జరిగిన అత్యాచారాలే అన్నారు. కడప ఉక్కు కోసం, విభజన హామీల అమలు కోసం, జాతి సమైక్యత కోసం, మత సామరస్యము కోసం ప్రతి ఒక్కరం పాటు పడదాం అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ డివైఎఫ్‌ఐ నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు










