Oct 02,2023 21:23

గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే, డిఆర్‌ఒ, అధికారులు

రాయచోటి  మహాత్మా గాంధీ ప్రపంచంలోని ప్రతి దేశానికి అహింసా మార్గాన్ని నిర్దేశించిన మహనీయుడని ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక కలెక్టరేట్‌ ఆవరణలోని మహా త్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే, జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ, జిల్లా అధికారులు, వివిధ ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 200 ఏళ్ల పాటు మన దేశాన్ని పరిపాలించిన బ్రిటీష్‌ వారు ఇంగ్లాండు దేశ రాజధాని లండన్‌లో విన్స్టన్‌ చర్చిల్‌ పక్కనే మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, దీనికి కారణం మహాత్మా గాంధీ అనుసరించిన అహింస, సత్యం, సత్యాగ్రహమార్గాలని తెలిపారు. మహాత్మా గాంధీ చూపించిన బాటలోనే ప్రజలందరూ నడవాలని సూచించారు. మహాత్మా గాంధీ సేవలను గుర్తించి ఐక్యరాజ్యసమితి అక్టోబర్‌ 2ను అంతర్జాతీయ అహింస దినోత్సవంగా ప్రకటించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లా ఏర్పాటు తర్వాత కలెక్టర్‌ గిరీష చొరవతో కలెక్టరేట్‌ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. డిఆర్‌ఒ సత్యనారాయణ మాట్లాడుతూ సత్యం, అహింసలను ప్రపంచానికి చాటిన మహాత్ముడు జాతిపిత మహాత్మా గాంధీ అని, దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన కషి మరువలేనిదని, ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడలలో నడవాలన్నారు. గాంధీజీ చేసిన త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రమన్నారు. భారతదేశ పౌరులందరూ గాంధీజీ ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను అనుసరించి సన్మార్గంలో నడవాలన్నారు. అంతకు మునుపు డిఆరఒ సత్యనారాయణ స్థానిక కలెక్టరేట్‌లో మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫయాజ్‌చైర్మన్‌, మాజీ మార్కెట్‌ యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌, మదనమోహన్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఎఒ బాలకష్ణ, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.