
మన దేశాన్ని 20వ శతాబ్దంలో బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి చేసేందుకు ముందుండి నడిపించిన నాయకుల్లో గాంధీజీది ప్రధానపాత్ర. చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలను శుభ్రం చేసి, అన్ని మతాలు, కులాలు ఒక్కటే అని చాటి చెప్పారు గాంధీ. సత్యం, అహింస అనేవి తన ఆయుధాలని చెప్పి.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. బ్రిటిష్ పాలకుల చేతుల్లోంచి.. దేశానికి విముక్తి కలిగించిన మహోన్నతుడు గాంధీ. మనమంతా చెప్పుకున్నట్లుగానే గాంధీజీ జీవితం భారతావనికి ఒక అపురూప చరిత్ర. భారతదేశంపై చెరగని ముద్రవేసిన మహనీయుడు గాంధీజీ.. 1948, జనవరి 30న ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ప్రార్ధనా మందిరానికి వెళ్తుండగా.. ఆయన్ని నాథూరామ్ వినాయక గాడ్సే కాల్చి చంపాడు. స్వాతంత్య్రోద్యమంలో చిరునామా లేని ఈ గాడ్సే వారసులే అమృతోత్సవాల పేరుతో నేడు నిస్సిగ్గుగా ఆడంబరాలు చేస్తున్నారు. నేడు స్వదేశం కోసం ఎదురు నిలిచి పోరాడిన గాంధీ 74వ వర్థంతి సందర్భంగా ఈ ప్రత్యేక కథనం..
గాంధీజీ అసలు పేరు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ. గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో 1869, అక్టోబర్ 2న కరంచంద్ గాంధీ, పుత్లీబాయి దంపతులకు ఆయన జన్మించారు. గాంధీజీ తండ్రి పోరుబందర్ సంస్థానంలో ఒక దివాన్‌గా పనిచేసేవారు. తల్లిదండ్రుల సంరక్షణలోనే గాంధీజీ బాల్యం గడిచింది. కొందరు విద్యార్థుల మాదిరిగానే తరగతిగదిలో గాంధీ అంత చురుకైనవాడు కాదు. తన జీవితంలో ఎదురైన అనుభవాలన్నీ గాంధీ తన ఆత్మకథ 'సత్యంతో నా ప్రయోగం (మై ఎక్స్‌పిరిమెంట్ విత్ ట్రూత్)' లో స్వయంగా రాసుకున్నారు. 13 ఏళ్ల వయసుకే గాంధీకి వివాహమైంది. భార్య కస్తూరిబాయి. గాంధీపైనా నాటి పురుషాధిక్యత, పెత్తందారీ వర్గ స్వభావం ఉండేవి. భార్య పట్ల అనేక సందర్భాల్లో ఆ భావజాలంతోనే ప్రవర్తించారు. అయితే, తన తప్పుల్ని తర్వాత తెలుసుకున్నట్లు ఆత్మకథలో నిర్భయంగా ప్రస్తావించారు గాంధీ.
యుక్త వయస్సు.. ప్రభావాలు..

యువ మోహన్‌దాస్‌పై ఆ యుగ ప్రభావం పడింది. మాంసాహారాన్ని బలపరిచే వాదనలలో ఆయనను బాగా ఆకర్షించింది ఇదట.. 'పొట్టిగా వున్న భారతీయుల్ని పరిపాలించే ఇంగ్లీషువాడిని చూడండి. మాంసం తిని ఐదు మూరలు పొడుగెదిగాడు' - అనే వాక్యం ఆ రోజుల్లో పిల్లల్లో చాలా ప్రచారంలో ఉండేదట. అది విని 'మాంసం తింటే మనమూ ఇంగ్లీషువాడిని జయించగలం' అనుకొన్నాడట మన మోహన్‌దాస్. ఈ ఒక్కమారు తప్ప మహాత్ముడు తాను జీవించిన ఎనభయ్యేళ్లూ శాకాహారిగానే జీవించాడనుకోండి.
మతం అంటరానితనాన్ని అంగీకరించదని ఆయన చిన్నతనం నుంచీ తల్లితో వాదిస్తుండేవాడు. చదువుకోడానికి విదేశాలకు వెళ్లినందుకు ఆయన కులం వాళ్ల వెలికి గురయ్యాడు. ఆయన కులస్థులంతా సమావేశమై - 'ఈ రోజు నుంచీ ఇతడిని బహిష్కరించాలి. ఇతనికెవరన్నా సాయం చేసినా, ఓడ దగ్గరకు సాగనంపబోయినా రూపాయి పావలా జరిమానా విధించబడుతుంది!' - అని తీర్మానించారు.
బ్రాడ్లీ బ్రిటన్‌లోని నిరీశ్వరవాదుల్లో ప్రముఖుడు. ఆయన తల్లి అంతిమ సంస్కారాలకు గాంధీజీ హాజరయ్యారు. 'ఇతరులకు దేవుడెంత ఆరాధ్యుడో, బ్రాడ్లీ వంటి నిరీశ్వరవాదులకు 'సత్యమనేది అంత ఆరాధ్యం!' అని గాంధీ తన అభిప్రాయం అని వెల్లడించారు.
విదేశాల్లో విద్య...
గాంధీ ఉన్నత విద్య కోసం ఇంగ్లాండు వెళ్లి, అక్కడ 'బార్ ఎట్ లా' చదివారు. 1891లో దేశానికి గాంధీ తిరిగొచ్చినప్పుడు 22 ఏళ్లు. కథియావార్‌లోని రాజ్‌కోటలో ప్రాక్టీస్ ప్రారంభించారు. కానీ, అదేమీ సవ్యంగా సాగలేదు. ఏం చేయాలో తెలియని స్థితిలో దక్షిణాఫ్రికా కంపెనీ తరఫున ఒక అవకాశం వచ్చింది. ఆ కంపెనీ అబ్దుల్లా సేట్‌ది. దాని తరఫున వాదించే అవకాశంతో గాంధీ అక్కడి డర్బన్ పట్టణానికి 1893లో వెళ్లారు. ఇదే గాంధీ జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. ఆ కేసు గురించి 1893, జూన్ 7న డర్బన్ నుంచి ప్రిటోరియా పట్టణానికి రైల్లో బయలుదేరారు. ఆ సందర్భాన్ని వివరిస్తూ గాంధీ ఇలా రాశారు..
'డర్బన్‌లో మొదటి తరగతి రైలు టిక్కెట్ తీసుకున్నా. దుప్పట్లు కావాలంటే మరో ఐదు షిల్లింగులు చెల్లించాలి. కానీ డబ్బు పొదుపు చేద్దామని తీసుకోలేదు. అప్పటికీ అబ్దుల్లా సేట్ 'ఇక్కడి వాతావరణం భిన్నంగా ఉంటుంది, దుప్పట్లు తీసుకో'మని మరీ మరీ హెచ్చరించారు. ఏం కాదులే అని నేను సర్దిచెప్పా. రాత్రి తొమ్మిది గంటల సమయంలో నతాల్ రాజధాని మారిట్జ్‌బర్గ్ స్టేషన్‌కి రైలు చేరుకుంది. ఓ తెల్లజాతీయుడు బోగీలోకి వచ్చి, నన్ను చూసి దిగిపోయాడు. కారణం.. నేను నల్లవాడిని కావడమే! చాలా బాధ కలిగింది. కొద్దిసేపటికి అతను కొందరు అధికారులతో వచ్చాడు. ఓ అధికారి 'నాతో రా, నువ్వు సాధారణ బోగీలో ఎక్కాలి..' అన్నాడు. 'ఎందుకు? నేను మొదటి తరగతి టిక్కెట్ తీసుకున్నా?' అన్నా. 'అదంతా తెలియదు. ముందు నువ్వు దిగి, సాధారణ బోగీ ఎక్కు!' అంటూ గద్దించాడు. 'ఈ బోగీలోనే ప్రయాణిస్తా!' అని స్పష్టం చేశాను. 'అలా కుదరదు.. దిగిపోతావా? పోలీసులతో గెంటించమంటావా?' అంటూ అరిచాడు. 'మీరు చేయాల్సింది చేసుకోండి. నేను మాత్రం దిగను' అన్నాను. దాంతో నా రెక్క పట్టుకుని, బయటకు లాగేసి, నా సామాను కూడా విసిరేశాడు. నేను మరో బోగీకి మారడానికి ఒప్పుకోలేదు. నన్ను అక్కడే వదిలి, రైలు వెళ్లిపోయింది'.. ఈ విషయం గాంధీని తీవ్రంగా కలచివేసింది. మనిషి పట్ల మనిషి.. జాతి పట్ల మరో జాతి ఇలా ప్రవర్తించడం ఏమిటి? దీన్ని ప్రతిఘటించాలని అనుకున్నాడు. 22 ఏళ్ల పాటు అక్కడే ఉండి, అందరినీ కూడగట్టి ఉద్యమం చేసి, విజయం సాధించారు.
గాంధీజం..

బ్రిటీషు వారితో చేసిన పోరాటం సామరస్యపూర్వక చర్చల నేపథ్యంలో వ్యవహరించడం ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. అప్పటికే ఎదిగిన భారతీయ పెట్టుబడిదారులకు స్నేహశీలిగా ఉండటం ఒక కారణం. అయితే ఈ తీరు సామాన్యులు, శ్రామికులు తమ హక్కులు సాధించుకోవడానికి ఆటంకమైందన్నదీ అంతే నిజం. అందుకే కొందరు ఈయన నాయకత్వాన్ని అంగీకరించలేకపోయారు. కానీ, ఈ పరిమితుల్లోనే మత సామరస్యం విషయంలో గాంధీ ప్రదర్శించిన తీరు అభినందనీయం. నేడు మన దేశంలోని హిందూత్వ వాదనల నేపథ్యంలో దాని గురించి గాంధీ ఆనాడే స్పష్టంగా చెప్పాడు. అదే గాడ్సేలకు మింగుడుపడలేదు. ముస్లింలపై దాడి జరిగితే వచ్చి కాపాడాడుగానీ, హిందువులు పారిపోతున్నప్పుడు ఏం చేశాడనే వాదనలు చేస్తూ, గాంధీని ద్వేషించారు.
మనం 'గాంధీజం' అని పిలిచే తాత్విక సిద్ధాంతాలు, వాని ఆచరణ రూపాలూ దక్షిణాఫ్రికా ఉద్యమంలోనే సూచనప్రాయంగా కనిపిస్తాయి. అందుకే రెండు దశాబ్దాలు సాగిన ఆ ఉద్యమంలోని ప్రత్యేక లక్షణాలను పరిశీలించడం అవసరం.
మొదటిది : దక్షిణాఫ్రికా భారతీయోద్యమం కూడా అన్నివర్గాల వారూ కలిసి పాల్గొన్న ఉద్యమం. యూరోపియన్లతో సమానహక్కులు ఉండాలనేది అన్ని వర్గాల, మతాల భారతీయుల సమస్య. భారతీయుల ఓటు హక్కు తీసెయ్యాలని పెట్టిన బిల్లు వాయిదా వెయ్యాలని గాంధీజీ తయారుచేసిన అర్జీ ఘటన.. 'అంతకుముందెన్నడూ ప్రజాసేవలో పాల్గొని వుండని యువకులు అనేకమంది కార్యరంగంలోకి దుమికారు. అనేకమంది క్రైస్తవ యువకులు తొలిసారి సమకూర్చబడ్డారు. అర్జీ నకళ్లను తయారు చేయడం కోసం ఇంగ్లీషు వచ్చిన వలంటీర్లూ, తదితరులు రాత్రంతా పనిచేశారు. వలంటీర్లుగా చేరిన వ్యాపారస్థులు తమ సొంత బళ్లతో దూర ప్రాంతాలకంటా వెళ్లి, సంతకాలు చేయించి తెచ్చారు.'
1896లో గాంధీ ఇండియా వచ్చిప్పుడు దక్షిణాఫ్రికా భారతీయుల ఉద్యమ ఆశయాలను ప్రచారం చేశాడు. అప్పుడు పత్రికలన్నీ దాన్ని బలపర్చాయి. ఈ ఉద్యమం బలపడుతున్న కొద్దీ తాతా వంటి ధనికవర్గాల నుండి ఆయనకు సహాయం లభించింది.
రెండోది : ధనికవర్గాల ఆశీస్సులు పొందినా.. శక్తియుక్తులు, పోరాటపటిమ, త్యాగనిరతి శ్రమజీవులవే. కాంట్రాక్టు కూలీల జీవితాలతో గాంధీజీ ప్రథమ పరిచయం.. 'ఒక తమిళుడు చింపిరి దుస్తులతో, ముందు రెండు పళ్లూ ఊడిపోయి, నోటివెంట రక్తం ధారగా కారుతూ గాంధీ ముందు నిలబడ్డాడు. ఆ దృశ్యం చూసి చలించిపోతూ.. తలగుడ్డ ధరించి తనతో సమానుడిగా ఉండమని కోరాడు. ఆ నిరుపేద బానిసకు అదో కొత్త అనుభూతి. అతని పేరు బాలసుందరం. డర్బన్‌లోని ప్రసిద్ధ యూరోపియన్ ఇంట్లో కాంట్రాక్టు కూలీ. అతన్ని యజమాని రక్తం కారేలా కొట్టాడు. గాంధీ అతన్ని సర్టిఫికెట్లు తెచ్చుకోమని డాక్టర్ వద్దకు పంపాడు. అతన్ని మెజిస్ట్రేటు వద్దకు తీసికెళ్లి, యజమానిని శిక్షింపజేయడం ఆయన కోరిక కాదు, అతని ఆధీనంలోని ఇతన్ని తప్పించాలనేదే గాంధీ ఉద్దేశం. కాంట్రాక్టు కూలీ బానిసలాగే యజమాని సొత్తుగా పరిగణింపబడేవాడు. గాంధీ ఇతన్ని మరొక యజమాని వద్దకు మార్పించగలిగాడు. ఈ కథ మద్రాసులో కాంట్రాక్టు కూలీలకు చేరింది. వారంతా గాంధీని ఆప్తమిత్రుడిగా పరిగణించసాగారు!'
గాంధీ ఆ తర్వాత జరిగిన సమ్మెలో మహిళల త్యాగనిరతికీ చలించిపోయాడు. అందుకే ఆ తర్వాత అతనికిచ్చిన సన్మాన పత్రంలో పొగడ్తలకు తానర్హుడిని కానని సమాధానం ఇచ్చాడు.
మోహన్‌దాస్ మహాత్ముడెలా అయ్యాడు ?
సామాన్య రైతుకి, కూలీకి, మధ్యతరగతి ప్రజలకి జాతీయోద్యమ స్ఫూర్తి, ఆత్మగౌరవం విలువ గురించి చెప్పి కదిలించగలగడం. అందరూ స్వచ్ఛందంగా పాల్గొనేలా ఉద్యమ రూపాలను, నినాదాలను రూపొందించడం. ఆచరణలో తాను ముందుండి అందరినీ నడిపించడం. దేశమంతటికీ అర్థమయ్యేలా ఉత్తేజపరచగలగడం. అందరిలోనూ ఐక్యతా స్ఫూర్తిని నింపగలగడం. ఇవన్నీ మోహన్‌దాస్‌ను మహాత్ముడిని చేశాయి.
గాడ్సేల అవకాశవాదం..
భారతీయత గురించి డప్పాలు కొట్టే సంఘపరివారానికి దాని ఓనమాలు కూడా తెలియవని రైతు ఉద్యమం చాటిచెప్పింది. 'భారతదేశం ఆత్మ గ్రామసీమల్లో, మన రైతుల దగ్గర ఉంది' అన్న గాంధీజీ మాటలు మహాత్ముడికి ఈ దేశం గురించి ఎంత గొప్ప అవగాహన ఉందో తెలియజేస్తాయి. ఆ మహాత్ముడినే పొట్టన పెట్టుకున్న నీచులకు భారతీయత గురించి ఏం తెలుసు? గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యంలో గ్రామీణ ఆర్థికవ్యవస్థ మొత్తం దేశానికే వెన్నెముక. గ్రామంలో రైతులదే ప్రధాన భూమిక. ఆ రైతులు సుభిక్షంగా ఉంటూ, గ్రామాభ్యుదయానికీ చోదకశక్తిగా పనిచేస్తారు. గ్రామీణ కుటీర పరిశ్రమలు పెద్దఎత్తున ఉపాధి కల్పనకు తోడ్పడతాయి. సహకార స్ఫూర్తితో తమ వనరులను కలబోసుకుని, గ్రామీణ ప్రజలు గ్రామ స్వపరిపాలనను నిర్వహిస్తారు.
పెట్టుబడిదారీ అభివృద్ధిక్రమం ఇందుకు పూర్తి విరుద్ధం. చిన్న రైతుల్ని, చేతివృత్తుల్ని, సహకార వ్యవస్థని, గ్రామస్థాయి ప్రజాస్వామ్యాన్నీ అది తన క్రూరమైన లాభాపేక్షతో అణచివేస్తుంది. వారందరినీ తన ఫ్యాక్టరీల్లో అత్యంత చౌకగా పనిచేసేందుకు పట్టణాలకు తరుముతుంది. అప్పటికే అక్కడ కునారిల్లుతున్న పట్టణ పేదలకు వీరిని పోటీగా నిలబెడుతుంది. తమకు అవసరం లేదనుకుంటే అత్యంత నిర్దాక్షిణ్యంగా వారిని ఆ పట్టణాల నుండే తరిమేస్తుంది. ఇటీవల కరోనా లాక్‌డౌన్ సమయంలో లక్షల సంఖ్యలో వలసకూలీలు ఎలాంటి దుస్థితిలో తమ స్వగ్రామాలకు చేరుకున్నారో ఆ దయనీయ దృశ్యాలు ఇంకా మన కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. నాడు గాంధీజీని హత్య చేసినవారి వారసులే నేడు దేశ స్వాతంత్య్రాన్నీ విదేశీ కార్పొరేట్లకు సమర్పించడానికి తొందరపడుతున్నారు.
ఎందుకీ విద్వేషపు కుట్ర ?
దేశ స్వాతంత్య్రానికీ స్వావలంబనకూ చేటుతెచ్చే విధానాలను, విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెట్టే విధానాలను అమలుచేస్తున్నారు. వీటిని ప్రజలందరూ ప్రతిఘటించేందుకు ఐక్యం కాకుండా ఉండేందుకు మతతత్వ, మనువాద రాజకీయాలు ముందుకొచ్చాయి. వాటిని సమర్ధించుకోవడానికే నిజమైన జాతీయోద్యమానికి, దాని నాయకులకు మసిపూసి, చరిత్రను వక్రీకరించి, గాడ్సేలను హీరోలుగా చిత్రీకరిస్తున్నారు. తమ దేశద్రోహాన్ని బూటకపు హిందూత్వ జాతీయవాదంతో కప్పిపుచ్చుకుంటున్నారు.
ఉన్మాదులే బలిగొన్నారు..
మతం వేరు.. మతోన్మాదం వేరు. అది ఇస్లాం అయినా.. హిందూత్వం అయినా.. ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ మతోన్మాదమే ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తోంది.. నాడు గాంధీని పొట్టనబెట్టుకుంది. మతసామరస్యం గురించి గాంధీ తన జీవితాంతం చెబుతూనే ఉన్నారు. అది కొందరికి నచ్చని విషయం. హిందూత్వ ఉగ్రవాదం అప్పటికే తలెత్తి ఉంది. పాక్ విడిపోవడానికి కారణమైన మహ్మద్ ఆలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. భారతీయులంతా ఒకే జాతి కాదని, హిందువులు, ముస్లింలు వేర్వేరు అని అతడి వాదన. జిన్నాను, పాకిస్థాన్‌ను శత్రువులుగా అనునిత్యం చిత్రీకరించే ఆర్‌ఎస్‌ఎస్ కూడా అదే వైఖరిని తీసుకొంది. దాని నాయకుడు సావర్కర్ ఆ వాదనే ప్రచారం చేశాడు. గాంధీ చెబుతున్న సామరస్యం దేశానికి ప్రమాదమని తన అనుయాయూలకు నూరిపోశాడు. అలాంటి ప్రచారం తలకెక్కినవాడే నాధూరాం వినాయక గాడ్సే. సావర్కర్ ఆదేశాలకు అనుగుణంగానే ఒక ముఠాని తయారుచేసుకొని, గాంధీ హత్యకు తెగబడ్డాడు. మూడుసార్లు వరుస హత్యాయత్నం చేశాడు. పోలీసులూ వారిని పట్టుకోలేకపోయారు. చివరికి 1948, జనవరి 30న ఆ ఉన్మాది గాంధీని బలిగొన్నాడు. ఆ ముందురోజు గాంధీ ఆరోగ్యం బాగోలేదు. సహాయకురాలు మను 'మీకు ఇలా అయితే ఎలా మహాత్మా?' అంటే.. గాంధీ 'కంగారుపడొద్దు.. ప్రాణం ఎప్పటికైనా పోవాల్సిందే..! వారం క్రితం మాదిరిగా బాంబు పేలితేనో, ఎవరైనా నన్ను కాలిస్తేనో.. నేను గుండె ఎదురొడ్డి.. ఎలాంటి విచారం లేకుండా రామనామం జపిస్తూ .. నవ్వుతూ మరణిస్తే.. అప్పుడు నన్ను మీరు నిజమైన మహాత్ముడని అనొచ్చు..' అన్నారు. అన్నట్టుగానే ఉన్మాది గాడ్సే కర్కశంగా తుపాకి గుళ్లు పేల్చినప్పుడు గాంధీ నేలకొరిగాడు. దేశం తల్లడిల్లిపోయింది.
సామరస్యం.. లౌకికతత్వమే మార్గం..

మన జాతిపితను బలిగొన్న మతోన్మాదం దేశంలో ఇప్పుడింకా పేట్రేగిపోతోంది. ఒకవైపు గాంధీని స్మరిస్తూ.. మరోవైపు గాడ్సేని కీర్తిస్తూ.. సావర్కర్‌ను హీరోగా ఆరాధిస్తూ.. దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు పరివార్‌లు. గాంధీ చెప్పిన మాటలన్నీ గాల్లో కలిసిపోయాయి. విభజించి పాలించడంతోనూ... గుజరాత్ ప్రయోగాలు దేశమంతా విస్తరిస్తూ.. యోగుల పాలనతో దేశాన్ని మరింత ఉన్మాదంలోకి నెడుతున్నారు. గాంధీకి ఉత్సవాలు చేస్తూ.. ప్రసంగాల్లో పొగుడుతూ.. ఆయన ఆశయాలకూ, జ్ఞాపకాలకూ సమాధులు కట్టే కుతంత్రాలు చేస్తున్నారు. 74వ గాంధీ వర్థంతి సమయంలో మరోసారి ఈ మతోన్మాదుల నిజస్వరూపాన్ని బట్టబయలు చేయాలి. గాడ్సేలకు గుడి కట్టే, సావర్కర్‌ను మహోన్నతుడిని చేసే దారుణ పరిస్థితుల్లో ఉన్నామనేది అందరం అవగాహన చేసుకోవాలి. ఈ ఉన్మాదుల ఆగడాలను అడ్డుకోవాలి. దేశంలో సామరస్యాన్ని నెలకొల్పే బాధ్యత ప్రజలందరిదీ. మతోన్మాదాన్ని, అసమానతలను ఎదిరించి.. ఐక్యతను చాటిచెప్పే చారిత్రక సందర్భాలను మార్గదర్శనం చేసుకుంటూ.. కులమత విద్వేషాల్ని రెచ్చగొట్టి, మనల్ని విడదీసే కుతంత్రాలను సమైక్యంగా తిప్పికొట్టాలి. తగినరీతిలో ఈ మతోన్మాదుల పాలకుల పీచమణచాలి. అదే గాంధీకి మనమిచ్చే ఘన నివాళి. రాష్ట్రంలోనూ గాడ్సేల కుట్రలు నిత్యకృత్యమయ్యాయి. దేవాలయాల మీద దాడుల పేరుతో విద్వేషం, జాతీయోద్యమ చిహ్నాం జిన్నాటవర్ పేరు వివాదం.. ఇలా ప్రతిదీ వాళ్లు వివాదాస్పదం చేయడం, ప్రధానపార్టీలు మెతకగా స్పందించడం మరో ప్రమాదం. లౌకిక, ప్రజాతంత్రశక్తుల ఐక్యత, అప్రమత్తత ఇప్పుడు ఎంతో ముఖ్యం.
అమృతోత్సవ్ ఓ ప్రహసనం..

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చరిత్రను చెరిపేసే కుతంత్రాలే పన్నుతోంది.75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఏడాది పొడుగునా జరిపే 'ఆజాదీ కా అమృతోత్సవ్'లో భాగంగా భారత చారిత్రక పరిశోధనా మండలి పోస్టర్‌లో నెహ్రూ చిత్రాన్ని తొలగించారు. ఇది చరిత్రను వక్రీకరించడమే. లేని చరిత్రను సృష్టించడం కోసం బిజెపి/ఆరెస్సెస్‌లు ఐసిహెచ్‌ఆర్‌ను నిర్లజ్జగా దుర్వినియోగపరుస్తున్నాయి. నకిలీ నాణేలను ముద్రించి, చరిత్రను తప్పుదోవ పట్టించేందుకు మోడీ ప్రభుత్వం ఇంతకుముందు ఒకసారి ప్రయత్నించింది. ఇప్పుడు ఏకంగా జాతీయోద్యమ ప్రముఖులు, దేశ తొలి ప్రధాని నెహ్రూను పోస్టర్ నుంచి తొలగించడం పరివార్ విద్వేషపూరిత రాజకీయాలకు పరాకాష్ట. రాజ్యాంగసంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్ జొరబడి, వాటి స్వతంత్రతను దెబ్బతీసేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఈ సంస్థ తీసుకున్న దుశ్చర్యను రాజకీయ పార్టీలు, చరిత్రకారులు, మేధావులు, ప్రజాతంత్రవాదులు తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ మాదిరిగానే భారత్‌ను మత రాజ్యంగా ఏర్పాటు చేయాలని ఈ శక్తులు కుట్రపన్నాయి. నెహ్రూ దీనిని గట్టిగా వ్యతిరేకించాడు. భారత్ మరో పాకిస్తాన్‌లా మారకూడదని వాదించాడు. విభిన్న జాతులు, మతాలు, సంస్కృతులతో కూడిన భారత్‌ను ఆధునిక, లౌకిక, ప్రజాతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దాలని సంకల్పించాడు. దేశ సమైక్యత, సార్వభౌమత్వ పరిరక్షణకు పూనుకున్నాడు. బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా జాతీయోద్యమంలో పాల్గొని, తొమ్మిదేళ్లు జైలు జీవితం అనుభవించాడు. అందుకే ఫాసిస్టు పరివార్ ఆధునిక భారతదేశ నిర్మాత నెహ్రూ పట్ల తన విద్వేషాన్నీ ఏనాడూ దాచుకోలేదు. దేశానికి పదిహేడేళ్ల పాటు ప్రధానిగా సేవలందించిన మహోన్నత వ్యక్తిని కించపరిచేందుకు యత్నించడం అత్యంత గర్హనీయం. జాతీయోద్యమ నేతను అవమానించేవారు కేంద్రంలో అధికారం చలాయించడం ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం. అంతకన్నా దౌర్భాగ్యమేమిటంటే భారత స్వాతంత్య్రోద్యమానికి ద్రోహం చేసి, బ్రిటిష్ వారిని క్షమాభిక్ష ప్రసాదించమని దేబిరించిన హిందూ మహాసభ నాయకుడు వి.డి సావర్కర్ ఫొటోను గాంధీ ఫొటోలతో పాటు ప్రదర్శించడం. పిరికిపంద సావర్కర్‌కు 'వీర్' అని బిరుదు తగిలించి, ఆకాశానికెత్తడం. గాంధీజీ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన సావర్కర్‌ను జాతీయోద్యమ నేతగా చిత్రించడం దారుణం. స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి పాత్ర లేని పరివార్‌కు ఉన్న చరిత్రంతా ఒక్కటే. కీలకమైన సందర్భాల్లో బ్రిటిష్‌వారికి ఏజెంట్లుగా వ్యవహరించడమే ఆ చరిత్ర. ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలు. అందుకే చరిత్రను చెరిపేయాలనీ.. అదీ సాధ్యం కాకపోతే వక్రీకరించాలనీ మోడీ ప్రభుత్వం యత్నిస్తోంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి, అలాగే ఉన్నత స్థానాల్లో వారు నియమించిన పెత్తందారులకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున సాగిన మలబార్ ఉద్యమానికి మతం రంగు పులిమేందుకు బిజెపి యత్నించడం జుగుప్స కలిగిస్తోంది. స్వాతంత్య్రోద్యమంలో భాగంగా ఉన్న మలబార్ పోరాటాన్ని మతతత్వ శక్తుల తిరుగుబాటుగా చిత్రీకరించేందుకు బిజెపి యత్నించడం దుర్మార్గం.
వారసులు ఎవరు ?

సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతీయులు భీషణ పోరాటాలు చేశారు. ప్రజలు లక్షల సంఖ్యలో పాల్గొన్నారు. ఆ పోరాటాలను విజయవంతం చేయడంలో వేలాదిమంది తమ ప్రాణాల్ని బలిదానం చేశారు. లక్షలాది కుటుంబాలు వీధినపడ్డాయి. పాశవికమైన దమనకాండను ప్రజలు వీరోచితంగా ఎదిరించారు. వారి ధైర్యసాహసాలు, దృఢనిశ్చయం, నిర్మాణ దక్షతే బ్రిటీషు సామ్రాజ్యవాదాన్ని దేశాన్నుంచి నెట్టివేశాయి. ఈ కార్యాచరణకంతకూ మహాత్మాగాంధీయే సేనాని. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒకవైపు భీషణ పోరాటం జరుగుతుంటే.. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్.. దాని పరివారం దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టారు. బ్రిటీషు వారికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టాల్సిన తుపాకులను మతసామరస్యం కోసం పోరాడుతున్న మహాత్మునిపై ఎక్కుపెట్టారు. పోరాటంలో పాల్గొనకుండానే దాని ఫలితాల్లో భాగం కోసం, వారసత్వం కోసం వెంపర్లాడుతున్నారు.
నాడు గాంధీజీని హత్య చేసిన గాడ్సే వారసులే నేడు దేశ స్వాతంత్య్రాన్నీ విదేశీ కార్పొరేట్లకు సమర్పించడానికి తొందరపడుతున్నారు. అందులో భాగమే.. కాంట్రాక్టు వ్యవసాయం పేరిట మన దేశంలో, మన భూముల్లో ఏయే పంటలు ఏ విధంగా పండించాలో ఎవరికి, ఏ రేటుకు అమ్ముకోవాలో, ఏ ధాన్యాలు, పప్పులు దిగుమతి చేసుకోవాలో నిర్ణయించే హక్కును విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టే చట్టాలను చేయడం. దీనిపై మన రైతాంగం పోరాడి, గెలిచింది. వారి ఎత్తుల్ని చిత్తు చేసింది. రైతులు కేంద్ర స్థానంలో ఉండే వ్యవసాయాన్ని రక్షించుకుంటూ దేశ ఆహార భద్రతనూ పరిరక్షించడం కోసం పోరాడారు. గతేడాది రిపబ్లిక్‌డే సమయంలో ఢిల్లీలో మోడీ అనుకూల శక్తులు పోలీసులతో కుమ్మక్కై సాగించిన అరాచకం లోగుట్టును సాక్ష్యాలతో సహా సోషల్ మీడియా బహిర్గతం చేసింది. ఉద్యమంలోకి వేరుపురుగుల్లా ప్రవేశించిన దీప్‌సింగ్ నాటకం బట్టబయలైంది. దొంగలా అతడు పారిపోవలసిన పరిస్థితి. హింస, విద్వేషం మూర్తీభవించిన సంఘపరివారం శాంతియుతంగా సాగుతున్న రైతు ఉద్యమాన్నీ హింసతో, దౌర్జన్యంతో అణచివేయాలని ప్రయత్నించారు. ఆనాడు ఏ స్ఫూర్తితో గాంధీజీ పిలుపునందుకుని ప్రజలు సత్యాగ్రహ ఉద్యమాన్ని జయప్రదంగా సాగించారో, ఈనాడు అదే స్ఫూర్తితో మన రైతన్నలు, రైతక్కలు.. నల్ల వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఉద్యమించారు. వీరికన్నా ఆ మహాత్మునికి గొప్ప వారసులు ఇంకెవరుంటారు? ఇంతకన్నా గొప్పగా గాంధీజీకి నివాళులు ఎవరు అర్పించగలరు?
రెండు నాల్కల ధోరణి..

హిందూత్వ, దేశవిభజన విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ పరివారం రెండునాల్కల ధోరణి అవలంభిస్తోంది. స్వరాజ్యం పొందిన సంతోష సమయంలో మనం ఎదుర్కొన్న ప్రధాన సమస్య దేశవిభజన. విభజించి పాలించే నేతల కుతంత్రాల ఫలితం ఆ పరిణామం. అప్పటికి సంస్థానంగా ఉన్న కాశ్మీర్ విలీనం ఒక సమస్య. అత్యధికుల కోరిన మీదట 1947, ఆగస్టు 1న కాశ్మీర్‌ని గాంధీ సందర్శించారు. ఆ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. 'భారత్‌లో ఉండాలా? వద్దా? అనే నిర్ణయం కాశ్మీర్ ప్రజలు తీసుకోవాలి. అది నేను లేదా మహారాజా తీసుకునే నిర్ణయం కాదు. కాశ్మీర్‌లో రాజు మరణించినా, ప్రజలు అక్కడే ఉంటారు. కాశ్మీర్ భవితవ్యాన్ని నిర్ణయించేది.. నిర్ణయించుకునేది వాళ్లే!' అన్నారు. 'ఈ రాజ్యానికి నిజమైన పాలకులు ప్రజలే. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించేలా చూడాలి. వారిపై దాడిచేసి, వారి గ్రామాలను, ఇళ్లను తగలబెట్టడం ద్వారా మీరు వారి అంగీకారం పొందలేరు!' అన్నాడు. ఈ మాటలు కాశ్మీర్ విషయంలో వర్తింపజేసుకోవాల్సినవే. కానీ నేడు జరిగింది ఏమిటి? హిందూత్వ పాలకులు కాశ్మీర్‌ను మూడు ముక్కలు చేసి, భారత్‌లో విలీనం చేస్తూ విజయం సాధించామంటూ విర్రవీగుతున్నారు. బాబ్రీ మసీదు విషయంలోనూ వారి రెండునాల్కల ధోరణి వెల్లడైంది. మసీదును కూల్చడానికి నాయకత్వం వహించిన అద్వానీ, ఆర్‌ఎస్‌ఎస్, సంఘపరివార్ సేనలు తమ ఘనతగా చాటుకున్నాయి. ఆ తర్వాత కేసులు పెట్టేసరికి ఎవరికి వారు తోకలు ముడుచుకుని, తాము కాదంటే తాము కాదని బుకాయించిన పరిస్థితి.
నవ్య సింధు
8333818985