Aug 17,2023 20:27

మానవహారం చేపట్టిన దృశ్యం

ప్రజాశక్తి-నెల్లూరు :గత ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి మున్సిపల్‌ కార్మికులకు చేసిన హామీ మేరకు వారిని ఫర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాంధీబోమ్మ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా కార్యదర్శి కె.పెంచలనరసయ్య మాట్లాడారు. మునిసిపల్‌ కార్మికులను ఫర్మినెంట్‌ చేయాలని, సిఎం ఇచ్చిన వాగ్ధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 24న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్మికులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్‌ కార్మికులందరినీ ఫర్మినెంట్‌ చేస్తానని వాగ్ధానం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా కార్మికులందరిని మోసం చేశారన్నారు. కరోనాకాలంలో వారియర్స్‌గా పని చేసిన మున్సిపల్‌ కార్మికులను తక్షణమే ఫర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులను ఫర్మినెంట్‌ చేయకపోగా అసత్య ప్రచారాలతో, అవాస్తవ ప్రకటనలతో కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం దిగిరాని పక్షంలో నిరవధిక సమ్మెకు సైతం వెనకాడబోమని హెచ్చరించారు సిఐటియు నగర రూరల్‌ కార్యదర్శి జి. నాగేశ్వరరావు,కిన్నెర కుమార్‌, నాయకులు పి. సూర్యనారాయణ, బీపీ నరసింహ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎం అశోక్‌,ఆర్‌ ఎం సునీల్‌, సుజాతమ్మ,వజ్రమ్మ,కామాక్షమ్మ కొండమ్మ, భాగ్యమ్మ,షబ్బీర్‌, కష్ణ, సుబ్బు,శ్రీనివాసులు ఉన్నారు.