ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం భారీగా ఈదురు గాలులు సంభవించి ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో అల్లాడిన ప్రజలకు వర్షం రావడంతో చల్లటి ఆహ్లాదకరమైన వాతావ రణం ఏర్పడింది. ఈదురు గాలులకు రెండు జిల్లాల పరిధిలో విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు నేలకొరిగాయి. వివిధ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచింది. గుంటూరు జిల్లాలో ఈదురు గాలులకు పలుచోట్ల స్తంభా లు పడిపోయినట్టు అధికారులు తెలిపారు.
గుంటూరు నగరంలో పలు ప్రాంతాల్లో ఆరు గంటలపాటు విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. నల్లచెరువు, పాత గుంటూరు, సీతానగరం, మణిపురం రోడ్డు, గుంటూరు ప్రభుత్వ వైద్య శాల, కొత్తపేట, ఆర్‌టిసి కాలనీ, బొంగరాల బీడు, ఆర్‌టిసి బస్టాండ్ పరిసర ప్రాంతాలు, పొత్తూరు వారితోట, గుంటూరు వారితోట, ఆర్‌టిసి కాలనీ, షాపు ఎంప్లాయీస్ కాలనీలో చెట్లు, స్తంభాలు పడిపోవడం వల్ల విద్యుత్ సరఫరా నిలిచింది. గుంటూరు వన్‌టౌన్ పరిధిలో 33 కెవి లైన్లకు సంబం ధించి మూడు స్తంభాలు పడిపోయాయని అధికారులు తెలిపారు. ఇందువల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. చెట్లు పడిపోవడం వల్ల ఉద్యాన పంటలకు చెందిన కాయలు నేలరాలాయి.
వినుకొండలో గాలి దుమారంతో వడగళ్ల వాన కురిసింది. చెట్లు పడిపోవడంతో అద్దంకి వినుకొండ రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షంతో ఈదురు గాలుల ధాటికి సతైనపల్లి, నర్సారావుపేట రోడ్డు వెంబడి ఉన్న భారీ వక్షాలు నెలకొరిగాయి. రేకుల ఇళ్లపై కప్పులు లేచిపోయాయి. కరెంట్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బెల్లంకొండ నుండి వెంకటాయపాలెం దారిలో మాచాయపాలెం వద్ద చెట్టు విరిగిపోవడం వలన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. చండ్రాజుపాలెంలో దాసరి లక్ష్మీ పద్మారావు, వెంకట్రావమ్మ నిర్మించుకున్న కోళ్ల షెడ్డుపై చెట్టు ఇరిగిపడి వందలాది కోళ్లు చనిపోయాయి. నకరికల్లు మండలం గుండ్ల పల్లిలో పిడుగుపడి కొబ్బరిచెట్టు దగ్ధమైంది.










