Jan 03,2021 12:56

     పడుకొన్నాడన్న మాటేగానీ ఎంతకూ నిద్రపట్టలేదు సోముగాడికి. అమ్మకు ఒంట్లో బాగాలేదన్న చెల్లి మాటలు అతడికి పదేపదే గుర్తుకొస్తున్నాయి. మనసెందుకో చాలా గుబులుగా ఉంది. ఇప్పటికిప్పుడే ఊరెళ్ళిపోయి అమ్మను చూడాలని ఉంది. ఆమెకు మంచి వైద్యం చేయించాలని ఉంది. కానీ పరిగెట్టుకొని ఊరెళ్ళడానికి వాడున్నది పక్కూరిలో కాదు. పరాయి రాష్ట్రంలో. మామూలుగానైతే రాత్రి బస్సెక్కితే తెల్లారికంతా ఊరు చేరేవాడు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా బస్సులు, రైళ్ళు బంద్‌ చేశారు. వందల మైళ్ళు కాలినడకన పోవాలంటే వారం రోజులకు తక్కువగాదు. సోముగాడు వలస కూలి. అమ్మ సరోజమ్మను, చెల్లి గౌరిని విడిచి పెట్టి, మూడ్నెల్ల కిందటే రాష్ట్రంగాని రాష్ట్రంలో క్వారీ పనిలో చేరినాడు.
                                                                     

                                                                   ***


     'ఊర్లోనే ఉంటానమ్మ. ఈడనే కూలో, నాలో చేస్తాను. నిన్ను, చెల్లిని వదిలిపెట్టి అంత దూరం పోవడం నాకు ఇట్టం లేదు!' ఒకటికి పదిసార్లు చెప్పాడు అమ్మతో.
'అట్టాగంటే ఎట్టా బిడ్డా? ఈడనే ఉంటే ఎట్లా జరుగుద్ది? ఊర్ని పట్టుకొని వేలాడనీకు మనకేమన్నా ఆస్తులున్నయా, పాస్తులున్నయా? ఒకరోజు పని దొరికితే, రెండు రోజులు ఖాళీగుండాలి. ఒక పూట తింటే రెండు పూటలు పస్తులుండాలి. కయ్యిలు, కాలువలు ఉండేటోల్లే సంపాదన కోసం ఊరు ఇడిచి, పట్నాలకు వలసపోతుండారు. అట్టాంటిది మనమెంత? గాలివాటం బతుకులు మనవి. గాలివాటాన్ని బట్టి పోతుండాలి. ఈడనే ఉంటానని గిరిగీసుకొని కూకోకూడదు. ఆ కాంట్రాక్టరు రెండు పూటలా అన్నం పెట్టి, నెలకు పదివేలు జీతమిస్తడంట. నువ్వు పనిలో చేరినావంటే నెమ్మదిగానైనా మన కట్టాలు ఒక్కొక్కటీ తీరుతా వస్తయి' అని చెప్పి సోముగాడ్ని బతిమాలి, పనికి పంపింది సరోజమ్మ.
ఊరొదిలేది ఇష్టం లేకున్నా, తల్లి మాట కాదనలేక ఒప్పుకొన్నాడు సోముగాడు. కష్టపడి డబ్బులు సంపాదించి, పైసా పైసా కూడబెట్టి, చెల్లి పెళ్లి మంచిగా చెయ్యాలనుకొన్నాడు. చిన్నదో, పెద్దదో ఒక ఇల్లు కట్టుకొని, అమ్మను చల్లగా చూసుకోవాలని అనుకున్నాడు.
                                                                     

                                                                       ***

 

    సోముకి ఐదేండ్ల వయసప్పుడే వాడి తండ్రి చచ్చిపోయాడు. ఒళ్ళు తెలీకుండా మందుకొట్టి, తాగిన మత్తులో కాలుజారి బాయిలోపడి ప్రాణాలు విడిచాడు. అప్పటినుండీ సోముని, గౌరిని కష్టపడి చూసుకుంది సరోజమ్మ. ఊర్లో ఎవరేపని చెప్పినా చేసేది. వాళ్ళు ఎంతిస్తే అంత పుచ్చుకొనేది. బిడ్డకు కడుపు నిండితే చాలనుకొనేది. సోము పదిదాకా చదువుకొన్నాడు. అంతంత మాత్రంగా అబ్బే చదువును నమ్ముకొంటే లాభం లేదని నిర్ధారించుకొన్నాడు. కూలిపనులకు పోతూ తల్లికి చేదోడు వాదోడుగా మెలిగేటోడు. రోజులు గడిచేకొద్దీ సరోజమ్మకు అనారోగ్యం చేసింది. డాక్టర్లకు చూపిస్తే, జబ్బేమీ లేదని, ఒంట్లో శక్తి సన్నగిల్లిందని, మంచి ఆహారం తినాలని చెప్పారు. టానిక్కులు, టాబ్లెట్లు రాసిచ్చారు. ఎంతకీ సరోజమ్మ ఆరోగ్యం బాగుపడలేదు. దాంతో సరోజమ్మను ఇంట్లోనే ఉండమని చెప్పి, సోము ఒక్కడే పనికిపోయేవాడు. ఎండాకాలంలో పల్లెటూర్లో పనులుండవన్న కారణంతో సరోజమ్మ కోరికమేరకూ అంతదూరం వెళ్ళి, క్వారీ పనిలో చేరాడు.

                                                                      ***

     నిద్రలో జారుకొన్నాడో లేక ఆలోచనల్లో జారుకొన్నాడోగానీ, ఫోను మోగంగానే ఉలిక్కిపడి లేచాడు. తెల్లారిపోయినట్టుంది. కళ్ళు నులుముకొని ఫోనెత్తాడు. 'అన్నా! అమ్మకు అస్సలు బాగాలేదు. జరము కాస్తా ఉంది. కళ్ళు తేలేసింది. మనకు దక్కతాదో, లేదోనని నాకు చానా భయంగా ఉంది!' అంటూ ఫోనులోనే ఏడ్చింది గౌరి.
ఫోనులో చెల్లి మాటలు వింటాంటే సోముకి కూడా ఏడుపొచ్చేసింది. ఎలాగోలా నిభాయించుకొని, చెల్లికి ధైర్యము చెప్పాడు. ఊర్లోనే ఉండే తన సావాసగాడైన గోపీకి ఫోను చేశాడు. అమ్మకు బాగా లేదని, డాక్టరుకు చూపించమని బతిమలాడాడు. బండిలో తీసికెళ్లి పక్కూరి ఆర్‌ఎంపీ డాక్టరును తీసుకొచ్చి తల్లికి వైద్యం చేయిస్తానని సోమూకి మాటిచ్చాడు గోపి.
సోమూకి మనసు మనసులో లేదు. అమ్మకు తనకు అన్యాయం జేసి, వెళ్లిపోతుందేమోనని భయపడుతున్నాడు. ఎట్లాగైనా అమ్మను చూడాలని నిర్ణయించుకొన్నాడు. కాంట్రాక్టరుకు తన గోడంతా చెప్పుకొని, కాళ్ళు పట్టుకొన్నాడు. అతి కష్టం మీద కాంట్రాక్టరు కనికరించాడు. ఊరెళ్ళి రావడానికి ఒప్పుకొన్నాడు. పాత స్కూటర్‌ కూడా ఇచ్చాడు. సోముకి కొండంత సంతోషం కలిగింది. ఇప్పుడు బయలుదేరితే.. దారిలో పోలీసులెవ్వరూ అడ్డుపడకుంటే.. రేపు తెల్లారికల్లా అమ్మను చూడొచ్చు. ఆసుపత్రిలో చేర్పించి, అమ్మను కాపాడుకోవచ్చు అనుకొన్నాడు. అంతలోనే ఫోను మోగింది. గోపిగాడు వీడియో కాలు చేశాడు.
'ఎట్టా ఉందిరా అమ్మకు?' ఫోనెత్తి అడిగినాడు సోముగాడు.
'ఇంకేడ అమ్మరా! ఈ లోకం ఇడిచిపోయింది. డాక్టరును తీసుకొచ్చేలోపే అమ్మ మనల్ని వదలి వెళ్లిపోయిందిరా!' ఏడుస్తూనే చెప్పాడు గోపి.
ఆ మాట వినగానే సోమూకి గుండె పగిలిపోయింది. ఫోనులో గౌరి ఏడుపు కూడా వినిపిస్తుంది.
సోము గుండె దిటవు చేసుకొన్నాడు. 'ఒరేరు! నేను ఇప్పుడే బయలుదేరాతా ఉండాను. తెల్లారికంతా వచ్చేస్తాను. చెల్లికి ధైర్నము చెప్పండి. దాన్ని భద్రంగా చూసుకోండి!' ఒక్కోమాట కూడదీసుకొని చెప్పినాడు.
'తెల్లరికొచ్చినా లాభం లేదురా! కరోనా కారణంగా శవాన్ని తెల్లారిదాకా ఇంటికాడ పెట్టుకోకూడదనీ, ఇప్పటికిప్పుడే పూడ్చి పెట్టాలనీ పోలీసాఫీసరు, హెల్తు ఆఫీసరు చెప్పి పోయారు. అట్టా చేయకపోతే వాళ్ళే వచ్చి, శవాన్ని పట్టుకొనిపోయి పూడ్చి పెడతారంట' చెప్పాడు గోపి.
'అమ్మను చివరిచూపు చూసే భాగ్యం కూడా లేకపోయింది గదరా!' తలగొట్టుకొని ఏడ్చాడు సోము.
'నువ్వట్టా ఏడవమాకు. మనసు రాయి చేసుకో. ఇదిగో! ఈ వీడియో కాల్‌లో అమ్మను ఆఖరిసారి చూడు!' అంటూ ఫోను తిప్పినాడు గోపి.
తనను నవ మాసాలు మోసి, ఇరవై ఏళ్లపాటు కంటికి రెప్పలా కాపుగాసి, ఇప్పుడు నిర్జీవంగా పడున్న తల్లిని, పక్కనే పడి పడి ఏడుస్తున్న చెల్లిని చూసి కూలబడిపోయాడు సోము.

- పేట యుగంధర్‌
9492571731