May 20,2023 22:50

గాలివానకు లేచిపోయిన ఇంటి పైకప్పు రేకులు
వేళ్లతో సహా కూలిపోయిన పురాతన భారీ వృక్షం
వేళ్లతో సహా కూలిపోయిన పురాతన భారీ వృక్షం

గాలివాన బీభత్సం
- పదుల సంఖ్యలో కూలిన చెట్లు
- భానుముక్కలలో ఇండ్లపై పడిన పురాతన భారీ వృక్షం
- తప్పిన పెను ప్రమాదం
- పాణ్యంలో తడిచిపోయిన వరి, మొక్కజొన్నధాన్యం
ప్రజాశక్తి - పాములపాడు

        పాములపాడు మండలంలోని భానుముక్కల, ఎర్రగుడూరు, బానకచెర్ల గ్రామాలలో శనివారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో కురిసిన గాలి వర్షం బీభత్సం సృష్టించింది. గాలికి రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. పదుల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లకు అడ్డంగా చెట్లు విరిగి పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. భానుముక్కల గ్రామంలో 300 సంవత్సరాల క్రితం నుండి ఉన్న రావి చెట్టు గాలివానకు వేర్లతో సహా లేచి గడ్డం దేవ సహాయం, గడ్డం బాలమ్మ ఇండ్లపై పడింది. దేవ సహాయం రేకుల షెడ్డు కూలిపోయింది. బాలమ్మ ఇంటి గోడ కూలిపోయి నష్టం వాటిల్లింది. అదే సమయంలో గడ్డం దేవ సహాయం ఇంటి రేకులు గాలికి లేచిపోతుండడంతో మరొక చోటికి వెళ్లిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణాష్టం జరగలేదు. ఆస్తి నష్టం జరగడంతో భోరున విలపించారు. సంఘటన స్థలానికి భానుముక్కల వీఆర్వో హుస్సేన్‌ చేరుకొని పరిశీలించారు. వీఆర్వోకు బాధితులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అలాగే భానుముక్కలలోని ఎంపియుపి స్కూల్లో చెట్టు కూలి ప్రహరీ గోడపై పడటంతో పడిపోయింది. బానుముక్కల టర్నింగ్‌ వద్ద వేంపెంట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై చెట్లు కూలి పడడంతో సంఘటన స్థలానికి ఎస్సై అశోక్‌ ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌ యాగంటి, టవేశ్వర్‌లు చేరుకుని చెట్లను తొలగించారు. రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించారు. ఎర్ర గూడూరు, భానుముక్కల టర్నింగ్‌ మధ్యలో ప్రధాన రహదారిపై కూడా చెట్లు కూలి విరిగిపడ్డాయి. బానకచర్ల, టర్నింగ్‌ మధ్య విద్యుత్‌ స్తంభాలు కూలి విరిగిపడ్డాయి. పాణ్యం : పాణ్యం మేజర్‌ గ్రామ పంచాయతీలో శనివారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఈదురు గాలులతో కూడిన బారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా వాతావరణం చల్లబడింది. రహదారిపై రైతులు అరబోసుకున్న వరి, మొక్కజొన్నలు వర్షానికి తడిచిపోయాయి. బస్టాండ్‌, బిసి కాలనీ, ఏఆర్‌ కాలనీ ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో మురుగునీరు రహదారుల వెంట ప్రవహిచింది. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.