
సాయంత్రపు నీలాకాశం.
సూర్యుడు మబ్బుల్లో నుంచి అప్పుడప్పుడు తొంగి చూస్తున్నాడు. చల్లగా చెట్ల గాలి వీస్తోంది.
పిల్లలందరూ గుంపులు గుంపులుగా తిరుపతి నెహ్రూ మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారు. టెన్త్ చదివే నాగరాజు శేషాచలం కొండల వైపుగా తన ఫ్రెండ్స్‌తో కలిసి, గాలిపటం వదులుతున్నాడు.
రోడ్డు పక్కనే ఉన్న తోపుడు బండ్ల మీద ఉడకబెట్టిన మొక్కజొన్నలు, శనక్కాయలు అమ్ముతున్నారు. సైకిళ్ళ పైన వేడివేడి మసాలా బొరుగులు పొగలు కక్కుతున్నాయి.
నాగరాజు చెడ్డీ మిత్రుడు గాలివాటంగాడు పాత సినిమా 'అభిమానం'లోని పాట
'పద పదవె వయ్యారి గాలిపటమా
పద పదవె వయ్యారి గాలిపటమా...' పాడుతున్నాడు.
పాము తలలాగా తోక ఊపుకుంటూ గాలిపటాలు ఆకాశంలో ఎగురుతున్నాయి. రంగురంగుల గాలిపటాలు రయ్యి రయ్యిమని గాలిని తోసుకుంటూ వెళ్తున్నాయి. రెక్కలొక్కటే తక్కువ అన్నట్లుగా చూపులకందకుండా కొన్ని సర్రున వెళ్లిపోతున్నాయి.
గాలివాటంగాడు వేడివేడి మసాలా బొరుగులు పది రూపాయలకు కట్టి ఇమ్మన్నాడు. బొరుగులమ్మే ఆయన సినిమా పత్రిక కాగితంలో పొట్లం కట్టి తెచ్చాడు. 'అన్నా ఏందన్నా ఇంత పని చేసినావు? మా హీరోయిన్ బొమ్మ ఉండే కాగితంలో పొట్లం కట్టినావు. హీరోయిన్ ముఖం కాలిపోదా?' అని బాధగా అంటూ పొట్లం విప్పి, వేరే న్యూస్ పేపర్‌లో పోశాడు.
అందరూ పడీపడీ నవ్వారు. తలా ఒక చేయి వేశారు. నిమిషంలో ఖాళీ చేశారు.
బొరుగులు అయిపోయాయని గాలివాటంగాడు శనక్కాయల కోసం లక్‌లక్‌మని ఎగురుకుంటూ వెళ్లాడు. శనక్కాయలమ్మే ఆయన 'మీ గాలిపటానికి చిన్న తోక పెట్టినారేమి?' అని అడిగాడు.
'పొట్టి గట్టి, పొడుగు లొడుగు' అనే సామెత చెప్పి ఎవ్వరూ నవ్వకపోయినా వాడికి వాడే పకపకా నవ్వాడు. పది రూపాయలకు ఉడకబెట్టిన శనక్కాయలు తీసుకున్నాడు.
కానుగ చెట్టు మీద కోతులు శనక్కాయల వైపే చూడసాగాయి. వాటికి పెట్టకపోతే అవి పెరుక్కుపోతాయని కొన్నికాయలు నేలపైన విసిరాడు. గబుక్కున దూకిన కోతులు అటూఇటూ చూస్తూ నేలపైనవన్నీ ఏరుకుని, మళ్ళీ శనక్కాయల వైపు చూశాయి. 'పోపో' అని అదిలిస్తే కాయలు నోట్లో వేసుకుని నములుతూ, ఉరిమి చూస్తూ వెళ్లిపోయాయి.
ఆలస్యం చేస్తే కోతులెక్కడ దాడి చేస్తాయోనని అందరూ గబగబా తినేశారు.
నాగరాజు జోరుగా హుషారుగా దారం వదులుతున్నాడు. మిగిలిన మిత్రులందరి గాలిపటాల కన్నా తనది తారాజువ్వలా ఆకాశంలోకి దూసుకుపోతోంది. కొంచెంసేపు కుడివైపు, కొంచెంసేపు ఎడమవైపు అటూఇటూ టెక్నిక్‌గా తిప్పుతున్నాడు. పక్కనున్నవారు 'భలే భలే' అని అరుస్తున్నారు.
అప్పుడే సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికి నాగరాజు క్లాస్‌మేట్ అయిన బేరి వీధి బుజ్జి గ్రౌండ్‌లోకి వచ్చింది. ఆ అమ్మిని చూసి నాగరాజు రెండుమూడు సినిమా హీరో ఫోజులు పెట్టాడు. ఆ అమ్మికి కోపం వచ్చింది. 'కా, పోరా' అంది. 'నీతో నేనెప్పుడూ పండు కాదే, ఏమో స్టయిలుగా ''కా'' చెప్తా ఉండావే' అన్నాడు.
ఉరిమి చూస్తా సైకిల్ తొక్కుకుంటూ ఇంకో దిక్కుకి పోయింది బుజ్జి.
ఇంతలో - ఎక్కడి నుంచి వచ్చిందో ఓ నలభైఏళ్ల స్త్రీ పరుగులు తీస్తా వచ్చింది. చింపిరి తల, చిరిగిన గుడ్డలు, మాసిన ఒళ్లు, ఉబ్బిన కళ్లు.. అదో రకంగా ముఖంపెట్టి, పళ్లు పటపటా కొరుకుతూ 'వద్దంటే వినరా! వద్దంటే వినరా!' అంటూ నాగరాజు చేతిలోని దారాన్ని పెరుక్కుని, పరుగులు తీసింది. ఊహించని సంఘటనకి అదిరిపడ్డాడు నాగరాజు. బాగా ఎగురుతున్న తన గాలిపటాన్ని తన్నుకుపోతున్న ఆమె వెనకే పరుగులెత్తాడు.
భయంతో ఆమె మరింత వేగం పెంచింది. చిన్న గులకరాయి తీసి ఆమె పైకి విసిరాడు. రాయి ఆమె శరీరానికి తగలకుండా వెంట్రుకవాసిలో దూసుకెళ్లింది.
'కొట్టండిరా ఆ పిచ్చిదాన్ని! పట్టుకుని చెట్టుకు కట్టేయండిరా ఆ పిచ్చిదాన్ని!' అని గాలివాటంగాడు గట్టిగట్టిగా అరుస్తున్నాడు.
ఏదో జరుగుతోందని మిగిలినవారు కంగారుపడ్డారు. చకచకా గాలిపటాలను కిందికి లాగేసి, పొలోమని నాగరాజు వెనుక పరుగులు తీశారు.
నాగరాజు గాలిపటం వేపచెట్టుకు తగులుకుంది.
రెండో రాయి చేతికి తీసుకున్నాడు. గురి చూసి విసిరాడు. ఎడమ మోకాలి వెనుక రాసుకుంటూ పోయింది. చర్మం కొంచెం చీరుకుపోయింది. 'అమ్మా!' అంటూ కూలబడింది. అయినా నాగరాజు కోపం తగ్గలేదు. కసికసిగా ఉన్నాడు. పెద్ద రాయి తీసుకుని 'ఎంత పొగరు నీకు? రెక్కలు విప్పిన విమానంలా ఎగురుతున్న నా గాలిపటాన్ని లాక్కొంటావా?' అంటూ ఆమె మీద వేయబోయాడు. ఎవరో గట్టిగా తన కాళ్లు చుట్టేసుకున్నట్లుగా అనిపించింది. తల దించి చూశాడు. 'వద్దు నాగరాజూ నీకు దండం పెడతా!' అని ఏడుస్తూ ఉంది బుజ్జి.
వెక్కి వెక్కి ఏడుస్తూ 'ఆమె మా పిన్నమ్మ.. అసలు ఏమి జరిగిందంటే..!' అని చెప్పడం ప్రారంభించింది..
''తిరుపతికి అయిదు మైళ్ళ దూరంలో ఉన్న చెర్లోపల్లి గ్రామం.
'అమ్మా, ఈ రోజు బడికి సెలవు. అమ్మమ్మ ఇంటికెళ్లి ఆడుకుని వస్తా!' అని అమ్మని అడిగాడు ఆదిశేషు.
పెద్ద పెనుము మీద దోసెలు పోసేది ఆపేసి, గబగబా వీధిలోకి వచ్చిన పార్వతక్క 'అమ్మమ్మ ఇల్లు పక్కవీధిలో ఉన్నట్లు చెబుతావే.... రెండు మైళ్ళ దూరం ఉంది కదరా!' అంది.
నార మంచం పైన కూర్చుని, చిన్న గొర్రెపిల్లను ఒడిలో పెట్టుకుని దాని ఒళ్ళంతా నిమురుతున్న నరసింహన్నతో 'ఏమయ్యా! బిడ్డను బండిలో తీసుకొనిపోయి మా అమ్మ వాళ్ళింటికాడ వదలకూడదా?' అని అడిగింది. నరసింహన్న ఉలకలేదు, పలకలేదు.
ఏడేళ్ల ఆదిశేషు గబగబా తండ్రి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అర నిక్కరేసి, ఆముదం పెట్టిన తల వెంట్రుకలు నున్నగా దువ్వి, ముద్దుముద్దుగా ఉన్నాడు.
'నాయనా.....నాయానా, నన్ను నీ బండిలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ దింపకూడదా? అమ్మమ్మ వాళ్ళ కయ్యిలో సెనిక్కాయలు పెరకతా ఉండారంట. పచ్చి సెనిక్కాయలు పెరికినవి పెరికినట్లు తింటా ఉంటే భలే ఉంటాయి. సాయంకాలం వచ్చేటప్పుడు కొన్ని కాయలు తెస్తాను. ఉడకబెట్టుకుని తిందాము' అన్నాడు.
ఏమనుకున్నాడో ఏమో నరసింహన్న లేచి నిలబడి కొడుకు బుగ్గ మీద చిటిక వేసి, 'పది నిమిషాలుంటే తీసుకునిపోతా' అని చెప్పాడు. తడిగుడ్డ తీసుకుని టీవీఎస్ 50 బండిని శుభ్రంగా తుడిచాడు. పలచటి మజ్జిగ తాగి, బండి స్టార్ట్ చేసి కొడుకును వెనుక కూర్చోబెట్టుకున్నాడు.
చంద్రగిరి రోడ్డులో బండి సర్రునపోతోంది. వెనుక కూర్చున్న ఆదిశేషు గుర్రం పైన స్వారీ చేస్తున్నట్లుగా సంబర పడిపోయాడు.
రోడ్డు పక్కనే కొందరు పిల్లలు గాలిపటాలు ఎగరేస్తున్నారు. అందులోని తెగిపడిన ఒక గాలిపటం దారం (మాంజా) వెనుక కూర్చున్న ఆదిశేషు మెడకు చుట్టుకుంది. బండి వేగంగా వెళ్తుండడంతో గాలిపటం దారం ఆదిశేషు మెడకు యమపాశమయ్యింది. బండి తోలుతున్న నరసింహన్నకు వెనుక జరుగుతున్న ఆపద తెలియలేదు. తన ఆలోచనలలో తను ఉన్నాడు. బండి వేగంగా వెళ్తుండ డం వల్ల దారం మెడకు గట్టిగా బిగుసుకుని కోసుకు పోయింది. పెద్ద గొంతుతో 'నాన్నా!' అని అరిచాడు. కొడుకు గట్టిగా అరవడంతో బండి పక్కకి ఆపాడు. కొడుకు మెడ మీద ధారగా కారుతున్న రక్తాన్ని చూసి బెంబేలెత్తాడు. మెడకు తగులుకుని ఉన్న దారాన్ని జాగ్రత్తగా తీశాడు. అయితే రక్తం రావడం ఆగలేదు. దారిలో వెళుతున్నవారు గుమికూడారు. నీళ్లతో రక్తం తుడిచారు. అంబులెన్సుకు ఫోన్ చేశారు. హాస్పిటల్‌కి తీసుకుపోదామని ప్రయత్నాలు చేశారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో ఆదిశేషు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
విషయం తెలిసి పార్వతక్క గుండె బాదుకుంటూ పరుగులు తీస్తూ వచ్చింది. అప్పటికే ఆదిశేషు విగతజీవిగా పడి ఉన్నాడు. అది చూసి పొర్లిపొర్లి ఏడ్చింది.
ఆ హృదయవిదారక దృశ్యం చూసిన అందరికీ కన్నీళ్లు ఆగలేదు. ఒక్కగానొక్క కొడుకు కండ్ల ముందరే ప్రాణాలు పోగొట్టుకున్న ఆమె తల్లిదండ్రుల ఘోష చూసిన జనం తల్లడిల్లిపోయారు. 'పండగ కాదు, విశేషమేమీ లేదు, ఎప్పుడంటే అప్పుడు గాలిపటాలు ఎగురవేయడం ఎందుకు? ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకు?' అని అక్కడకు చేరిన అమ్మలక్కలు పిల్లల్ని తిట్టిపోశారు.
పార్వతక్క ఏడుపును ఆపడానికి ఎవ్వరి తరమూ కాలేదు. ఆ రోజు సాయంత్రం నుంచీ శూన్యంలోకి చూస్తూ తనలో తాను మాట్లాడుకోవడం ప్రారంభించింది. ఎవరన్నా పలకరిస్తే సంబంధం లేని మాటలు మాట్లాడేది. ఎవ్వరూ చూడని సమయంలో ఎక్కడికో వెళ్ళిపోయేది.
మేమందరమూ వెతకని వీధి లేదు, ప్రయత్నించని ఊరు లేదు. ఎక్కడా ఆమె ఆచూకీ కానరాలేదు. మూడు వారాల ముందు వెళ్లిన మనిషి ఈ రోజు ఇక్కడ ప్రత్యక్షమయ్యింది'' అని ముగించింది.
అంతా విన్న నాగరాజు కన్నీళ్లు పెట్టుకుంటూ గాలివాటంగాడిని ఆటో పిలవమన్నాడు. అందరూ చేరి ఆమెను గట్టిగా పట్టుకుని, ఆటోలో కూర్చోబెట్టారు. ఆటో రుయా ఆసుపత్రిలోని సైక్రియాట్రీ విభాగం వైపు నడిచింది. పిల్లలందరూ సైకిళ్లు తీసుకుని వెనుకనే వెళ్లారు. ఆమె పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తోందని చెప్పారు.
డాక్టర్లు ఆమెను పరీక్షించి, బయటికి వచ్చారు. 'ఈమె బాగోగులు మేము చూసుకుంటాము. అయితే మీరు మాకు ఒక మాటివ్వాలి' అని అడిగారు. అందరూ డాక్టర్ల వైపు ఆశ్చర్యంగా చూశారు.
'గాలిపటం మాంజా చుట్టుకుని ప్రాణాలు పోగొట్టుకున్న పార్వతక్క కొడుకు గురించి తెలుసుకున్నారు కదా!. తల్లడిల్లిన తల్లి హృదయం మనసు చెడి, వీధులెమ్మట తిరగడం కళ్లారా చూశారు కదా! గాలిపటాలు జాగ్రత్తగా ఎగరేయండి. సరదాగా ఎగరేయాలి తప్పితే ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. ఎక్కడైనా చిక్కుకుంటే గట్టిగా లాగకండి. దారం తయారీలో రసాయనాలు, గాజుపొడి కలుపుతారు. దారానికి ఉన్న స్ట్రింగ్ కారణంగా చేతి వేళ్లు కోసుకు పోతాయి. వేళ్లకు తొడుగులేసుకోండి. కరెంటు లైన్లకు, స్తంభాలకు తగులుకోకుండా జాగ్రత్తపడండి. మన గాలిపటమే ఎక్కువ ఎత్తుకు వెళ్లాలని పోటీలు పడడం, డబ్బులు పెట్టి పందాలకు పోవడం, చేయకండి. మిద్దెలెక్కి ఎగురవేసేటప్పుడు పెద్దల పర్యవేక్షణలో ఎగురవేయాలి. జరగరానిది జరిగితే కన్నబిడ్డలపై కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్క క్షణం అలోచించి, గాలిపటాలు ఎగురవేయండి' అని మంచి మాటలు చెప్పారు.
అలాగేనని పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. బుజ్జి చిన్నగా నాగరాజు దగ్గరికి వచ్చి, రెండు వేళ్లతో 'పండు రా!' అంది. 'నేనెప్పుడూ నీతో పండు బుజ్జీ!, అప్పుడప్పుడు ఏడిపించేదానికి 'కా' చెబుతుంటాను, ఎంతైనా నువ్వు నా క్లాస్‌మేట్‌వి కదా!' అనడంతో మిత్రులందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. అందరూ చిన్నగా హాస్పిటల్ నుంచి బయలుదేరారు.
గ్రౌండ్‌లో వేపచెట్టుకు తగులుకుని ఉన్న గాలిపటం సాయంత్రపు సూర్యకిరణాలకు మిలమిలా మెరుస్తోంది.
* ఆర్‌సి కృష్ణస్వామి రాజు, 9393662821