ప్రజాశక్తి-నిజాంపట్నం: పశుపోషకులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తప్పక వేయించాలని నిజాంపట్నం పశువైద్యాధికారి డాక్టర్ జి శివకుమారి తెలియజేశారు. శుక్రవారం మండలంలోని పల్లపట్ల గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో 4 నెలలు పైబడిన 54 దూడలకు, 96 గేదలకు, 13 ఆవులకు మొత్తం 163 పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు తెలిపారు. పశువులకు గాలి కుంటు వ్యాధి సోకడం వలన పాల సామర్థ్యం తగ్గడంతో పాటు చూడి కట్టడం తగ్గుతుందని చెప్పారు. చూడి గేదలకు ఈ వ్యాధి సోకితే ఈసుకుపోతాయని, ఎద్దులకైతే బండి లాగే సామర్థ్యం తగ్గుతుందని చెప్పారు. అందుకనే ముందు జాగ్రత్తగా ప్రభుత్వమే ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ అవకాశాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకొని తమ పశువులను వ్యాధుల నుంచి రక్షించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో లైవ్ స్టాక్ అసిస్టెంట్ షేక్ కరిష్మాబీ, గోపాల మిత్రలు పి శ్రీనివాసరెడ్డి, డి రమేష్ రైతులు పాల్గొన్నారు.










