Aug 05,2023 22:20

గాలి మేడలు... నీటిమూటలు

    నేటి కార్పొరేటీకరణ వ్యవస్థలో ప్రజల జీవనోపాధి, ఉపాధి కల్పనా అభివృద్ధి ప్రణాళికలు మటుమాయమయ్యాయి. ప్రజల దృష్టి కోణంలో కాకుండా రాజకీయ దృష్టితో కార్పొరేట్‌శక్తులు ప్రత్యక్షంగా పరిపాలించే రోజులు వచ్చేశాయి. నేతలు గాలిలో మేడలు కడతాం, నీటిమూటలు అందిస్తామని ఆచరణలో చెప్పకనే చూపించే పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే నిన్నటి చంద్రబాబు పాలన, నేటి జగన్‌ పాలనను బేరీజు వేసుకుని చూస్తే దొందూదొందే అన్న చందంగానే రెండు ప్రభుత్వాలు పనిచేశాయి, చేస్తున్నాయన్నది జిల్లాలో కానరాని ప్రగతికి అద్దం పడుతోంది. చంద్రబాబు నాయుడు నేడు ప్రాజెక్టుల బాటతో ఎన్నికల యాత్రను ప్రారంభించారు. జిల్లాకు కూడా రానున్నారు. ఆయన ఐదేళ్ల పాలనలో జిల్లాలో గాలిలో మేడలు కట్టి ప్రజలకు అందని స్థాయిలో శుష్క వాగ్ధానాలు చేయడం చరిత్ర చెప్తోంది. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో చట్టాలను తుంగలో తొక్కి మానవత్వం లేని పాలన సాగింది. నిర్వాసితుల పునరావాసం, పరిహారం పూర్తి చేయకుండానే బుల్డోజర్లను పెట్టి ఇళ్లను ధ్వంసం చేయడం, పంట పొలాలను నాశనం చేయడం చూశాం. నేరడి బ్యారేజీని నిర్మించి ఇచ్ఛాపురం వరకు నీటిని తీసుకెళ్తామని ప్రగల్భాలు పలికిన నేతను చూశాం. ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి నిధులివ్వడం మానేశారు. కాంట్రాక్టర్‌ బిల్లుల బకాయిల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ గడ్డాలను పెంచడం, మౌన దీక్షలు పాటించడం చరిత్రలో చెరిగిపోదు. నారాయణపురం కాలువలు ఆధునీకరణ చేస్తామని చెప్పి పనులు చేపట్టారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో అర్ధాంతరంగా పనులను నిలిపివేసి వెళ్లిపోయిన చరిత్ర ఉంది. వంశధార, నాగావళి అనుసంధానం నినాదంగానే ఆయన పాలనలో మిగిలిపోయింది. అంతకుముందు పాలనలో పిల్ల కాలువల నిర్మాణానికి ఇంకా 800 ఎకరాల భూసేకరణ మిగిలి ఉండగానే జాతికి అంకితం అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం చూశాం. జిల్లాలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందించే సుజల స్రవంతి అతీగతి లేకుండా పోయింది. గత పాలనలో ప్రాజెక్టు పనులన్నీ ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి చందంగానే ఉన్నాయి. జిల్లాల అభివృద్ధి ప్రణాళికలను శాసనసభలోనే ఆర్భాటంగా ప్రకటించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీకి కనీసం శంకుస్థాపననైనా చేయని అభివృద్ధి నిరోధక పాలన చూశాం. జిల్లా అభివృద్ధికి గాలిలో మేడలు కట్టి ప్రజలను వంచించడం చూశాం. చివరకు ఆ పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టిన నీరు-చెట్టు పనులకు రూ.300 కోట్లు చెల్లించకపోవడం చూశాం.
ఇప్పుడు జగనన్న పాలన ముగింపు దశకు వచ్చేసింది. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న చందంగా ప్రాజెక్టు పనులన్నింటినీ పూర్తిగా పడకేసి, బటన్‌ నొక్కే పాలనకు పరిమితం కావడం చూస్తున్నాం. ఏడాది కిందట జిల్లాకు వచ్చి సిఎం హామీలను గుప్పించారు. సుమారు రూ.1500 కోట్లు ఇవ్వనున్నట్లు ఆర్భాటంగా ప్రకటించినా, నేటికీ రూపాయి అయినా జిల్లాకు రాలేదు. జగన్‌ చెప్పేవన్నీ కాసుల మూటలు కాదు, నీటిమూటలై పోయాయన్నది అనుభవం. నేరడి బ్యారేజీ నిర్మాణంపై ట్రిబ్యుల్‌ తీర్పు ఇచ్చిన వెంటనే, దాని చరిత్ర తెలియక జిల్లాకు వచ్చి శంకుస్థాపన చేస్తానని ప్రకటించడం చూశాం. ఆ తర్వాత భువనేశ్వర్‌ వెళ్లి ఒడిశా ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన తర్వాత నీరుగారిపోవడం చూశాం. ఇది అయ్యే పనికాదని ఎత్తిపోతల పథకంతో సోంపేట వరకు నీటిని తీసుకుపోతామని ఆర్భాటంగా ప్రకటించడం చూశాం. వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి రూ.189 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకు రూ.855 కోట్లతో రివైజ్డ్‌ చేసి యుద్ధప్రాతిపదికన పనుల అంచనాలు వేసి నిధులు మంజూరు చేపడతామని ముఖ్యమంత్రి మాటల్లో యుద్ధం, ఆచరణలో శాంతిని అమలు చేయడం చూశాం. ముఖ్యమంత్రి రాజకీయ ప్రవేశంతో మాట తప్పను, మడమ తిప్పను అన్న నినాదాన్ని వినిపించారు. ఆ నినాదం రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదని అనుభవంలో తేలిపోయింది. చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో, కాంట్రాక్టర్లు న్యాయస్థానాలను ఆశ్రయించిన చరిత్ర కొత్తగా ఆవిర్భవించింది. అందుకే కొత్తగా టెండర్లు పిలిచినప్పుడు బిల్లుల కోసం కోర్టును ఆశ్రయించబోమని ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుందని నిబంధనల్లో షరతు విధించడం ఈ ప్రభుత్వ ప్రత్యేకత. నిర్బంధాలు, ఉద్యమాల అణచివేత నియంతృత్వ ధోరణులు చంద్రబాబు పాలనతో సరిసమానంగా ఉన్నాయి.
- సత్తారు భాస్కరరావు