ప్రజాశక్తి-భట్టిప్రోలు(కొల్లూరు): కొల్లూరు మండలం గాజుల్లంక గ్రామంలో గల బ్రిటిష్ కాలంనాటి స్వాతంత్య్రోద్యమ సమయంలో కాంగ్రెస్ గూండాల చేతిలో 1947 ఏప్రిల్10న తూటాలకు బలైన అమరవీరుల స్థూపం వద్ద సోమవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నాయకులు నివాళులర్పించారు. అమరులైన బావిరెడ్డి వియమ్మ, సనకా సుబ్బారావు, బావిరెడ్డి వెంకటేశ్వర్లు, మత్తె సుబ్బారావు స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్ మాట్లాడుతూ చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం పేదలను ఐక్యపర్చి ప్రతి పేద వానికి భూమి కావాలని, కూలి రేట్లు పెంచాలని పోరాటం చేసిన మహౌన్నత వ్యక్తి బావిరెడ్డి వియమ్మ అన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు సిపిఎం, సిపిఐ చేపట్టిన జాతాలు, నిరసన కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపర్చి ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు. ముఖ్యంగా బిజెపి పాలనలో పెట్టుబడి దారులైన ఆదానీ, అంబానీలకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయటం వంటి విధానాలను ప్రజలలోకి తీసుకువెళ్లి బిజెపిని గద్దె దించే దిశగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తొలుత సిపిఎం నాయకులు బావిరెడ్డి సుబ్బారావు స్థూపం వద్ద పూలు చల్లి నివాళులర్పించగా, మాజీ ఎంపిపి అమృతలూరి కృపానందం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వి వెంకట్రామయ్య, బోనిగల సుబ్బారావు, నాగేశ్వరరావు, బుల్లెబ్బాయి తదితరులు పాల్గొన్నారు.










