ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిస్థితి ఘోరం
చిన్నపాటి కేసులు సైతం విజయవాడ, గుంటూరుకు రిఫర్
గత్యంతరం లేక ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగులు
సీనియర్ వైద్యుల బదిలీతో వైద్య సేవలకు తీవ్ర ఆటంకం
ఆసుపత్రి పర్యవేక్షణను పూర్తిగా గాలికొదిలేసిన బాధ్యులు
తాజా ఘటనతో మరోసారి సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలపై చర్చ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
'కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది' అనే చందంగా ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యసేవలు తయారయ్యాయి. జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు ఎంతోమంది రోగులకు రక్షణగా నిలిచిన ఆసుపత్రిలో నేడు వైద్యసేవలు పూర్తిగా గాడి తప్పిన పరిస్థితి నెలకొంది. ఏలూరులోని జిల్లా ఆసుపత్రిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా మార్పు చేశారు. ఈ ఏడాది 150 మంది వైద్య విద్యార్ధులు సైతం ఇక్కడ బోధనా ఆసుపత్రిలో వైద్య విద్య అభ్యసించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బోధనా ఆసుపత్రిగా మారితే మరిన్ని వైద్య సదుపాయాలు, స్పెషలిస్ట్ వైద్యులు, సాంకేతికత అందుబాటులోకి వస్తాయని అంతా ఆశించారు. అయితే పరిస్థితి అందుకు విరుద్ధంగా తయారైంది. బోధనా ఆసుపత్రిగా మారడంతో సీనియర్ వైద్యులను వేరే ప్రాంతాలకు బదిలీ చేశారు. దీంతో వైద్య సేవలు పూర్తిగా పడకేశాయి. జిల్లా ఆసుపత్రిగా ఉండగా రోజుకు 1200 నుంచి 1500 మంది అవుట్ పేషెంట్లు ఆసుపత్రికి వచ్చి వైద్యసేవలు పొందేవారు. సరైన వైద్యులు లేకపోవడంతో ప్రస్తుతం 600 నుంచి 800 మంది రోగులు మాత్రమే ఒపి సేవలు పొందుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అధికారుల పర్యవేక్షణ కొరవడటమేనని చెప్పొచ్చు. గతంలో సూపరింటెండెంట్‌గా పని చేసిన అధికారులు ఆసుపత్రిలో చిన్నపాటి సమస్య వచ్చినా వెంటనే స్పందించడం, తగు చర్యలు తీసుకోవడం వంటివి చేసేవారు. సర్వజన ఆసుపత్రిగా మారిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన పర్యవేక్షణాధికారులు జనాలకు దూరంగా ఉంటున్న పరిస్థితి ఉంది. ఎవరితోనూ మాట్లాడే పరిస్థితి లేదనే చర్చ నడుస్తోంది. ఇష్టం లేకుండా ఇక్కడకు వచ్చినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. రోగుల గురించి పెద్దగా పట్టించుకోని పరిస్థితి ఉంది. గతంలో ఏలూరుతోపాటు పరిసర ప్రాంతాల్లో తలతిరిగి పడిపోయిన వ్యాధితో దాదాపు 600 మందికిపైగా ఆసుపత్రిలో చేరారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించి అందరినీ కోలుకునే విధంగా చేసి రాష్ట్రస్థాయిలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రత్యేక ఖ్యాతి గడించింది. పురుగుల మందు తాగిన రోగులను ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికే తరలించేవారు. మెరుగైన వైద్యం అందించి పంపించేవారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు మచ్చుకైనా కానరావడం లేదు. చిన్నపాటి కేసులను కూడా విజయవాడ, గుంటూరుకు రిఫర్ చేస్తున్నారు. తమకు ఏమీ సంబంధం లేదన్నట్లు వదిలించుకుంటున్నారు. అటువంటప్పుడు బోధనా ఆసుపత్రిగా మార్పు చేసి ప్రయోజనం ఏమిటని జనం ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పే నాథుడే లేకుండాపోయాడు. సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలపై జనం నుంచి తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి.
తాజా ఘటనతో వైఫల్యాలు బట్టబయలు
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేరిన గర్భిణికి ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో ఫోర్‌సెప్స్ వదిలేసిన తాజా ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనను బయటకు రాకుండా చేయాలని ఆసుపత్రి అధికారులు తీవ్ర ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల ఎనిమిదో తేదీన కడుపునొప్పితో బాధిత మహిళ ఆసుపత్రిలో చేరినప్పటికీ 16వ తేదీ వరకూ బయటి ప్రపంచానికి తెలియకుండా చేశారు. విజయవాడ ఆసుపత్రికి రిఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. ఇదేవిధంగా సరైన వైద్యసేవలు అందక రోగులు పడుతున్న ఇబ్బందులు బయటికిరాని పరిస్థితి నెలకొంది. వైద్యసేవలపై అధికారులు దృష్టి సారించకపోవడమే దీనికి ప్రధాన కారణమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రిఫరల్ కేసులపైన, సర్వజన ఆసుపత్రిలో వైద్యసేవలపైనా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఎక్స్‌రే, స్కానింగ్ వంటి రిపోర్టులు ఒకరోజు తర్వాత ఇస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు రెండు, మూడు రోజులు ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తోంది. పరీక్షలు చేసిన తర్వాత రిపోర్టులు త్వరితగతిన ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.










