
- ఎల్‌ఐసి విజయవాడ బ్రాంచి-1 సీనియర్ మేనేజర్ రామలింగేశ్వరరావు
ప్రజాశక్తి-విజయవాడ : ప్రస్తుతం సమాజంలో అతిఖరీదైన వ్యాధిగా క్యాన్సర్ ఉందనీ, దాని నియంత్రణ కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించటం అభినందనీయమని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) విజయవాడ బ్రాంచి-1 సీనియర్ మేనేజర్ రామలింగేశ్వరరావు అన్నారు. ఓపెన్ హార్ట్ సోషల్ ఆర్గనైజేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, ఎల్‌ఐసి సిబి-1 విజయవాడ, మణిపాల్ ఆసుపత్రి (తాడేపల్లి) సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ నియంత్రణలో భాగంగా శుక్రవారంనాడు మహిళలకు మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపును రిబ్బన్ కట్‌చేసి రామలింగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. ఎల్‌ఐసి సిబ్బంది ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారుల సంక్షేమం కోసం, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం క్యాన్సర్ వ్యాధి నివారణకు గాను ప్రత్యేకంగా మెగా మెడికల్ క్యాంపు నిర్వహించటం అభినందనీయమన్నారు. ఓపెన్ హార్ట్ సోషల్ ఆర్గనైజేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమాజంలో నిరాదరణకు గురైన పేదలు, వృద్ధులు, వీధిబాలలు, అనాధలకు అనేక రూపాల్లో సహాయ సహకారాలు అందించటం ముదావహమన్నారు. మణిపాల్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం డాక్టర్ పి.నాగమణి మాట్లాడుతూ క్యాన్సర్ జన్యుపరమైన వ్యాధి అనీ, మన బాడీలోని జీన్స్ నియంత్రణ కోల్పోతే కేన్సర్ కణాలు ఇష్టానుసారంగా పెరిగిపోతాయన్నారు. జన్యుపరమైన మార్పులు, కొన్నిరకాల ఎన్విరాన్ మెంట్లకు మన శరీరంలోని టిష్యూలోని డిఎన్‌ఎ దెబ్బతింటుందన్నారు. పొగ తాగడం, అల్ట్రావైలట్ రేస్, ఎక్సర్ సైజ్ లేకపోవడం, ఆల్కహాల్ అతిగా తాగడం, ఒబేసిటీ వల్ల కూడా కేన్సర్ వస్తుందన్నారు. ఏదైనా కెమికల్స్ తీసుకోవడం వల్ల కూడా వస్తుందన్నారు. వంశపారంపర్యంగా కూడా వస్తుందన్నారు. కేన్సర్‌లో 100 పైగా రకాలున్నాయని వివరించారు. మనకు ఎక్కువగా వినిపించేది కార్సినోమా కేన్సర్. ఎపితేలియల్ సెల్స్ బాడీ అంతటా ఉంటాయన్నారు. ఇవి శరీరానికి బయట, లోపల కవర్ చేస్తాయని వివరించారు. బ్రెస్ట్ కేన్సర్, పెద్దపేగు కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్లు కూడా ఉన్నాయన్నారు. ఓపెన్ హార్ట్ సోషల్ ఆర్గనైజేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ ట్రస్టీ ఆర్.నందకిశోర్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా గత 14 సంవత్సరాలుగా పేదలు, పిల్లలు, వృద్ధులు, మహిళలు, వితంతువులు, వికలాంగులు, విద్యార్థులు ఇలా వివిధ తరగతుల ప్రజానీకానికి ఆర్ధిక సహాయం చేస్తూ ఆదుకుంటున్నామన్నారు. వృత్తిశిక్షణలు, అవసరమైన పనిముట్లు, పరికరాలు, దుస్తులు, ఆహారం ప్యాకెట్లు పంపిణీ వంటివి చేస్తున్నామనానరు. ఎన్‌టిఆర్ విజయవాడ, కృష్ణాజిల్లాతోపాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు దుస్తులు, బియ్యం, వంట సామాగ్రి వంటివి అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ హార్ట్ సోషల్ ఆర్గనైజేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వాలంటీర్లు, ఎల్‌ఐసి ఉద్యోగులు, మణిపాల్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది మహిళలు వైద్యశిబిరానికి హాజరై వైద్య సేవలను పొందారు.