Oct 19,2023 08:39
  • దేశ వ్యాప్తంగా వివిధ హైకోర్టులకు 17 మంది న్యాయమూర్తులను, అదనపు న్యాయమూర్తులు నియమకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. వారిలో నలుగురు ఎపి హైకోర్టుకు నియమితులైన వారున్నారు. దేశ వ్యాప్తంగా 16 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయగా, వీరిలో ఇద్దరు ఎపి హైకోర్టు, మరో ఇద్దరు తెలంగాణ హైకోర్టు నుంచి ఉన్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నరేంద్రజీ ఎపి హైకోర్టుకు బదిలీ అయ్యారు.

ప్రజాశక్తి-అమరావతి : ఎపి హైకోర్టుకు కొత్తగా నియమితులైన నలుగురు జడ్జీలు శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. దేశంలోని వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు 16 మందిని బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి, తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తులు ఇద్దరు చొప్పున ఉన్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్‌ మెఘావాల్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ఎపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి మానవేంద్రనాథ్‌ రారు గుజరాత్‌, అదనపు న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకట రమణ మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అదేవిధంగా తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ మున్నూరి లక్ష్మణ్‌, జస్టిస్‌ జి అనుపమ చక్రవర్తిని రాజస్థాన్‌, పాట్నా హైకోర్టులకు బదిలీ అయ్యారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నరేంద్రజీ ఎపి హైకోర్టుకు బదిలీ అయ్యారు.
న్యాయవాదుల కోటా నుంచి హరినాథ్‌ నూనెపల్లి, కిరణ్మయి కనపర్తి, సుమతి జగడం, న్యాపతి విజరు ఎపి హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితు లయ్యారు. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నెల 10న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ సారథ్యంలోని కొలీజియం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో వీరి నియామకానికి సంబంధించి బుధవారం కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్తవారి నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరనుంది.
ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాతకోట గ్రామంలో బాల వెంకటరెడ్డి, కృష్ణవేణి దంపతులకు 1972 జనవరి 12న నూనేపల్లి హరినాథ్‌ జన్మించారు. ఏలూరు సిఆర్‌ఆర్‌ కాలేజీలో లా, హైదరాబాద్‌ ఒయులో ఎల్‌ఎల్‌ఎం చేశారు. సీనియర్‌ న్యాయవాది ఎస్‌ రవి వద్ద జూనియర్‌గా చేశారు. తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్‌ చేపట్టి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు స్టాడింగ్‌ కౌన్సిల్‌గా చేశారు. ఇప్పుడు హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌గా చేస్తున్నారు.
కృష్ణా జిల్లా కూచిపూడిలో మండల రామలింగేశ్వరరావు, ఝాన్సీకి 1970 జులై 30న మండల కిరణ్మయి జన్మించారు. ఒయు నుంచి లా చేశాక 1994లో ఎన్‌రోల్‌ అయ్యారు. జెవి ప్రసాద్‌ వద్ద జూనియర్‌గా చేశారు. వివిధ సంస్థలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా చేశారు. 14 ఏళ్లపాటు ఐటి శాఖకు కౌన్సిల్‌గా చేశారు.
కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం పండువారిపేటలో 1971 జూన్‌ 28న జగడం జానకి, లక్ష్మీపతి దంపతులకు సుమతి జన్మించారు. ఒయులో బిఎ, ఆంధ్ర మహిళా సభ లా కాలేజీలో లా చేశారు. 1998లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. బొజ్జా తారకం వద్ద జూనియర్‌గా చేశారు. 2020 నుంచి ఎపి ప్రభుత్వ ప్లీడర్‌గా హైకోర్టులో చేస్తున్నారు.
రాజమండ్రిలో 1974 ఆగస్టు 8న న్యాపతి సుబ్బారావు, ప్రమీకు విజయ్ జన్మించారు. ఎయు నుంచి 1997లో లా చేశాక ప్రాక్టీస్‌ ప్రారంభించారు. ఎంఎస్‌ రామచంద్రరావు (ఇప్పుడు హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు సిజె) సీనియర్‌ న్యాయవాదిగా చేసేప్పుడు ఆయన వద్ద జూనియర్‌గా చేశారు. అన్ని రకాల కేసులను వాదించిన అనుభవం ఉంది.