Oct 22,2023 10:18

పిల్లలకు దసరా సెలవలు ఇచ్చారు. పిల్లలతో కలిసి ఊర్లకు వెళ్లడం సహజం. దాంతో అమ్మలు, అమ్మమ్మలు, పెద్దవాళ్లు అందరూ పిండి వంటలు మొదలుపెడతారు. ఊర్లు వెళ్లినా, వెళ్లకపోయినా పిల్లలు ఇంటిపట్టునే ఉంటారు. వారికోసమైన వండుకోవాలి. ప్రాంతాల వారీగా వంటలలో మార్పులు ఉన్నా .. పండగా అనగానే మొదట గుర్తుకొచ్చేది స్వీటు, హాటూ. స్వీటు అంటే అరిసెలు, కొబ్బరి బూరెలు, గవ్వలు చేస్తారు. పంచదారకు దూరంగా ఉండేవారు బెల్లంతో నోరు తీపి చేసుకుంటే సరి!. ఈ పండగకు తెలుగువారు కారంగా సకినాలు, చెక్కలు చేయడం సహజం. మరి ఈ పండగకి కొన్నిరకాల పిండివంటలు, ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

  • బెల్లం గవ్వలు

కావలసినవి : గోధుమ పిండి - కప్పు, బెల్లం -కప్పు, నెయ్యి -3 టేబుల్‌ స్పూన్లు, నూనె- వేయించడానికి తగినంత, సోడా -చిటికెడు.
తయారీ : ఒక గిన్నెలో గోధుమపిండి, నెయ్యి, వంటసోడా వేసి నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలపాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, గవ్వల పీట మీద ఒత్తుకోవాలి. అవి ఆరిపోకుండా మూతపెట్టి ఉంచాలి. ఓ బాండీలో నూనె పోసి, పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అందులో గవ్వలను వేసి, దోరగా వేయించి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో బెల్లం వేసి, మునిగేంత వరకూ నీరు పోయాలి. దీనిని స్టవ్‌ మీద పెట్టి, ఉండపాకం వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. అప్పటికే వేయించి పెట్టుకున్న గవ్వలను పాకంలో వేసి, బాగా కలపాలి. వాటిని నెయ్యి రాసిన పళ్లెంలోకి మార్చుకోవాలి. చల్లారిన తర్వాత గవ్వలు విడివిడిగా వస్తాయి.

  • సకినాలు

కావలసినవి : - బియ్యం - కేజీ (పాతవి), మినపప్పు -అర కప్పు, పుట్నాల పప్పు - అర కప్పు, తెల్ల నువ్వులు -పావు కప్పు, వాము - రెండు టీ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడా, నెయ్యి - మూడు స్పూన్లు, నూనె- వేయించడానికి సరిపడా.
తయారీ : - బియ్యాన్ని శుభ్రంగా కడిగి 15 గంటలు నానబెట్టాలి. మరుసటి రోజు నీళ్లు తొలగించి, పిండిచేయాలి. జల్లెడ పట్టి మెత్తటి పిండిని మాత్రమే తీసుకుని పక్కనపెట్టుకోవాలి. బాండీలో మినపప్పు వేసి పొయ్యిమీద దోరగా వేయించాలి. పుట్నాల పప్పు, వేయించిన మినపప్పు కలిపి మిక్సీపట్టుకోవాలి. దీన్ని కూడా జల్లెడ పట్టుకుని మెత్తటి పిండిని మాత్రమే తీసుకుని, బియ్యపు పిండిలో కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో నువ్వులు, ఉప్పు, నెయ్యి, వాము వేసుకుని కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దగా కలిపి పెట్టుకోవాలి. తడి ఆరిపోకుండా గిన్నె మీద మూత పెట్టాలి. ఓ తడి బట్ట మీద, చేతిలోకి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ సకినాలుగా చుట్టిపెట్టాలి. పొయ్యి మీద బాండీ పెట్టి, నూనె పోసి వేడి చేయాలి. పది, పదిహేను నిమిషాల తర్వాత శకినాలు తడి ఆరిపోతాయి. పెద్ద గరెటీతో ఒక్కోక్కటి తీసుకుంటూ వేడి నూనెలో వేసుకోవాలి. రంగు మారిన తర్వాత తీయాలి. అంతే కరకరలాడే సకినాలు రెడీ.

  • కొబ్బరి బూరెలు

కావలసినవి: బియ్యం-రెండు కప్పులు, పచ్చికొబ్బరి -అర కప్పు, బెల్లం - ఒకటిన్నర కప్పు, నువ్వులు -పావు కప్పు, వంటసోడా - అర టీస్పూన్‌, యాలకుల పొడి - టీస్పూన్‌, నూనె- వేయించడానికి సరిపడా.
తయారీ : బియ్యాన్ని బాగా కడిగి, రోజంతా నాన బెట్టాలి. నీళ్లు వంపిన బియ్యాన్ని ఆరబెట్టి పిండి పట్టుకుని జల్లించాలి. మందపాటి గిన్నెలో బెల్లం ముదురుపాకం పట్టుకోవాలి. తర్వాత ఆ గిన్నెను దింపి యాలకుల పొడి, వంటసోడా, నువ్వులు, పచ్చికొబ్బరి వేసి కొద్దికొద్దిగా పిండి వేస్తూ బాగా కలపాలి. పిండి ఆరిపోకుండా మూతపెట్టి, కొద్దికొద్దిగా తీసుకుంటూ బూరెలు ఒత్తుకోవాలి. వాటిని వేడివేడి నూనెలో కాల్చుకుంటే నోరూరించే కొబ్బరి బూరెలు సిద్ధం.