
భోపాల్ : వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడబోయి.. తానే చిక్కుల్లో పడ్డారు ఓ రాష్ట్ర హోంమంత్రి. ఇంతకీ ఏ రాష్ట్ర హోంమంత్రి ఎవరంటే.. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా. తాజాగా ఆయన తన సొంత నియోజకవర్గమైన దాటియా జిల్లా వరద ప్రభావిత ప్రాంత సర్వేలో పాల్గొన్నారు. ఆ జిల్లా సర్వేలో ఉండగా.. వరదల్లో చిక్కుకుని డాబా పైన ఆశ్రయం కోసం ఎదురుచూస్తూ ఉన్న తొమ్మిదిమంది కనిపించారు. దీంతో వెంటనే వారిని కాపాడడానికి ఆయనతోపాటు.. అధికారులు పడవలో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో చెట్టు విరిగిపడి.. పడవ ఆగిపోయింది. దీంతో అధికారులు వెంటనే ఓ హెలికాప్టర్‌ను ఏర్పాటు చేశారు. ఆ హెలికాప్టర్‌లో వరదల్లో చిక్కుకున్న ఆ తొమ్మిదిమందితోపాటు.. మిశ్రా కూడా ఎక్కారు. ఇలా త్వరితగతిన చర్యలు చేపట్టి వారిని కాపాడినందుకు హోంమంత్రి అధికారులను అభినందించారు. అయితే హోంమంత్రి డాబా పైనుంచి హెలికాప్టర్ ఎక్కే వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మిశ్రా విమానమెక్కడానికి రెస్క్యూ సిబ్బంది తాడు వేయగా.. దాని సహాయంతో ఆయన హెలికాప్టర్ ఎక్కారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత భూపేంద్ర గుప్తా స్పందిస్తూ.. 'నరోత్తమ్ మిశ్రా స్పైడర్‌మేన్‌లా స్టంట్ చేసి విమానమెక్కడం చూస్తుంటే.. కేవలం అది పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్‌లాగానే ఉంది' అని అన్నారు.