Jul 23,2021 18:25

ముంబయి : మహారాష్ట్రలో గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలు ఎటు వెళ్లాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యం వరదల్లో చిక్కుకున్న ఓ మహిళను రక్షించే ప్రయత్నం చేశారు. భవనం పైనుండి కొంతమంది తాడు సహాయంతో ఆమెను పైకి లాగాలని ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నంలో వారు పట్టుని కోల్పోవడంతో... ఆమె ఒక్కసారిగా కిందకు జారి మళ్లీ వరద నీటిలో పడిపోయింది. ఈ సంఘటన ముంబై నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రత్నగిరి తీరప్రాంత పట్టణం చిప్లున్‌లో జరిగింది. దాదాపు 70 వేల మందికిపైగా జనాభా వున్న చిప్లూన్‌ 50 శాతానికిపైగా వరద నీటిలో మునిగిపోయింది. అలాగే అక్కడున్న 5 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిని ఎన్డీఆర్‌ఎఫ్‌, రాష్ట్ర రెస్క్యూ బృందాలు, నావికాదళం వరద సహాయ బృందాలు వారిని కాపాడుతున్నాయి. ఈ ఘటనలను చూస్తుంటే వర్షాల వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలిసిపోతుంది.