Jul 28,2023 15:36
  • నీట మునిగిన లోతట్టు లంక గ్రామాలు
  • స్థంబించిన జన జీవనం
  • పశువులకు గ్రాసం కొరత
  • ఇబ్బందులలో లంక వాసులు

ప్రజాశక్తి-రాజోలు : కోనసీమ లంక గ్రామాలను వరదనీరు చుట్టిముట్టింది. మూడు రోజులుగా వరద గుప్పిట్లో లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ముంపు బారినపడ్డాయి. కొంత మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. వరద ఉద్ధృతితో లోతట్టు లంక గ్రామాల్లోని ఇళ్లలోకి వరద చేరింది. ఎక్కడికక్కడ కాజ్‌వేలు నీటమునిగాయి. కొందరు మరపడవలు, నాటు పడవలను ఆశ్రయించి నిత్యావసరాలు తెచ్చుకుంటున్నారు. పెరుగుతున్న వరదతో రాకపోకలు కష్టంగా మారాయి. వరద ఉద్ధృతితో సఖినేటిపల్లి మండలంలోని అప్పనారాముని లంక, సఖినేటిపల్లిలంక, కొత్తలంక, టేకిశెట్టిపాలెంలోని కొంతభాగం, మలికిపురం మండలంలోని రామరాజులంక, బాడవ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల్లోకి నడుంలోతు నీరు చేరడంతో జనం ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. టేకిశెట్టిపాలెంలో నివాసాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో ఏటిగట్టుపై గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. గర్భిణులు, పిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని పాములు సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వద్ద వశిష్ట గోదావరికి వరద ఉదృతి పెరిగింది. గత మూడు రోజులుగా నరసాపురం–సఖినేటిపల్లి రేవుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో లంక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

  • పంటలకు భారీ నష్టం‌...!

నదీ పరివాహక గ్రామాల పరిధిలో మండలంలో సుమారు మూడు వేల ఎకరాల్లో లాభసాటి పంటలు సాగవుతున్నాయి. వరదల కారణంగా ఈ పంటలను దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పలు గ్రామాల్లో కూరగాయ పంటలు పూర్తిగా కుళ్లిపోయాయి. తమలపాకుతోపాటు కూరగాయల పంటలకు ఎకరాకు సుమారు రూ.50 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. పంటలన్నీ వారం రోజులకుపైగా నీటిలో నానడంతో కుళ్లిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. దీంతో రైతుల పెట్టుబడి, శ్రమంతా గోదావరి పాలైంది.

  • పశుగ్రాసం కొరత..!

పశువులకు లంక గ్రామాల పచ్చగడ్డే ఆధారం. గోదావరి వరద కారణంగా అది కాస్త నీటమునిగింది. దీంతో పశువులకు పచ్చగడ్డి తెచ్చేందుకు రైతులు అగచాట్లు పడుతున్నారు. ఓ పక్క వరద, మరోపక్క వర్షంతో రోడ్లు బురదగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చగడ్డి కోసుకురావడం కష్టతరమే. మనుషులైతే ఆకలిని చెప్పగలరు కానీ పశువుల ఆకలి దప్పికలు పోషకులు తెలుసుకోవాల్సిందే. వర్షాకాలంలో పశువులకు మేత దొరకడం దుర్లభమే. లంకలను గోదావరి ముంచెత్తడంతో రైతులు కష్టనష్టాలకు ఓర్చుకుని మూగజీవులను పోషించాలి. పెరవలి మండలంలో లంకల ఆధారంగా పశువుల పెంపకం చేపడుతుంటారు. అరటి, కంద, కూరగాయలతోపాటు విస్తారంగా పచ్చగడ్డిని పండిస్తుంటారు. గోదావరి వరద ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో లంక గ్రామాల్లో పశువులను రైతులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నీరు చేరని మెరక ప్రాంతాలు, ఏటిగట్లపైకి పశువులు, జీవాలను తరలించారు. లంకలన్నీ మునగడం, ఎండుగడ్డి కొరత వంటి పరిస్థితుల్లో పశువులకు గ్రాసంలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ముమ్మిడివరం, పి.గన్నవరం, రామచంద్రపురం, కొత్తపేట, ఉప్పలగుప్తం, రాజోలు, మలికిపురం, ఆలమూరు, రావులపాలెం, అమలాపురంలలోని ప్రాంతీయ పశుసంవర్ధక ఆసుపత్రుల పరిధిలో వరద ప్రభావిత లంకగ్రామాల్లో ఆవులు 16,178, గేదెలు, 29,106, గొర్రెలు, మేకలు 14,533 ఉన్నాయి. వీటిలో 35,903 పశువులను రైతులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత ఐదు రోజులుగా వాటికి గ్రాసం లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

  • రవాణాకు అవస్థలు..!

గోదావరి ఉగ్రరూపం దాల్చినప్పటి నుంచి లంక గ్రామాలకు బయట ప్రపంచంతో రాకపోకలు దాదాపు నిలిచిపోతాయి. గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నదిపై పడవలు, బోట్ల రాకపోకలను నిలిపి వేస్తారు. దీంతో నదీ పాయల నడుమ జీవిస్తున్న లంకప్రజలు గోదావరి శాంతించే వరకు గ్రామం నుంచి బయటకు అడుగుపెట్టే అవకాశం ఉండదు. అందుకే వరదల సమయం వస్తుందంటే ముందుగానే జాగ్రత్త పడుతుంటారు. బియ్యం, నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకుంటారు. అయితే వరదల సమయంలో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైతే మాత్రం గోదావరిపైనే భారం వేస్తారు. ఈ సమయంలో వైద్య సేవలు అందించే అవకాశం ఉండదు. రాత్రి సమయంలో ఇటువంటి పరిస్థితి తలెత్తితే ఇక అంతే సంగతులు. ఇక వరద సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఉపాధిని కోల్పోవడం పరిపాటిగా మారుతోంది.