- యుపిలో ఫిబ్రవరి 10 - మార్చి 7 మధ్య ఏడు దశల్లో పోలింగ్
- పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలకు ఫిబ్రవరి14న
- మణిపూర్‌లో ఫిబ్రవరి 27, మార్చి3న
- ఓట్ల లెక్కింపు మార్చి 10న
- బహిరంగ ప్రచారంపై ఈ నెల15 వరకు ఇసి నిషేధం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కోవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్న తరుణంలో తగు జాగ్రత్తలతో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది. భారత ఎన్నికల ప్రధానాధికారి (సిఇసి) సుశీల్ చంద్ర శనివారం నాడిక్కడ ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. కీలకమైన అతిపెద్ద రాష్ట్రం యుపిలో ఫిబ్రవరి 10 - మార్చి 7 మధ్య ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తారు. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలకు ఫిబ్రవరి14న ఒకే విడతలో పోలింగ్ పూర్తవుతుంది. మణిపూర్‌లో మాత్రం ఫిబ్రవరి 27, మార్చి3న రెండు విడతలుగా నిర్వహిస్తారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపడతారు. కోవిడ్ కారణంగా బహిరంగ ప్రచారంపై ఈ నెల15 వరకు ఇసి నిషేధం విధించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుండే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంని సిఇసి చంద్ర తెలిపారు.
ఎన్నికలు జరిగే మొత్తం 690 శాసనసభా నియోజకవర్గాల్లో 403 స్థానాలు యుపి ఒక్కటే కలిగి ఉండగా, పంజాబ్-117 ఉత్తరాఖండ్-70,, మణిపూర్-60, గోవా-40 స్థానాలు కలిగి ఉన్నాయి.. యుపిలో మొదటి విడత ఫిబ్రవరి 10న ప్రారంభమవుతుంది. మిగతా విడతలు ఫిబ్రవరి14, 20, 23, 27, మార్చి3,10, తేదీల్లో జరుగుతాయి.
ఫిబ్రవరి 10న తొలి విడత (11 జిల్లాల్లో 58 నియోజకవర్గాలు) పోలింగ్ జరగనుండగా,
ఫిబ్రవరి 14న రెండో దశ (9 జిల్లాల్లో 55 నియోజకవర్గాలు),
ఫిబ్రవరి 20న మూడో దశ (16 జిల్లాల్లో 59 నియోజకవర్గాలు),
ఫిబ్రవరి 23న నాలుగో దశ (9 జిల్లాల్లో 60 నియోజకవర్గాలు),
ఫిబ్రవరి 27న ఐదో దశ (11 జిల్లాల్లో 60 నియోజకవర్గాలు),
మార్చి 3న ఆరో దశ (10 జిల్లాల్లో 57 నియోజకవర్గాలు),
మార్చి 7న ఏడో దశ (9 జిల్లాల్లో 54 నియోజకవర్గాలు) ఓటింగ్ నిర్వహించనున్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఫిబ్రవరి 27 (6 జిల్లాల్లో 38 నియోజకవర్గాలు) తొలిదశ, మార్చి 3న రెండో దశ (10 జిల్లాల్లో 22 నియోజకవర్గాలు)లో ఎన్నికలు జరగనున్నాయి.ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభల గడువు మార్చితో ముగియనుండగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో పూర్తవుతుంది. 2017లో యుపిలో బిజెపి 303 స్థానాలు , ఎస్‌పి 49, బిఎస్‌పి 15, కాంగ్రెస్ 7 స్థానాలు సాధించాయి తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 14న జారీ అవుతుంది. అభ్యర్థులు ఈ నెల 21 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈనెల 27. పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుంది.
పోలింగ్ సమయం ఓ గంట పెంపు
పోలింగ్ సమయాన్ని ఓ గంట పెంచుతున్నట్లు భారత ఎన్నికల ప్రధానాధికారి సుశీల్ చంద్ర తెలిపారు. కరోనా నేపథ్యంలో 16 శాతం పోలింగ్ కేంద్రాలను .పెంచామన్నారు.. గతంలో 1,500 మందికి ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయగా, ఇప్పుడు ఆ సంఖ్యను 1,250కి కుదించినట్లు తెలిపారు. ప్రతి అసెంబ్లీకి అయిదు సంవత్సరాల గడువు ఉంటుంది. ఆ తరువాత ప్రజలు తమకు జవాబుదారీ వహించే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ప్రజలు హక్కు.దానిని ఎంటువంటి పరిస్థితుల్లోను నిరాకరించడానికి వీల్లేదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 172(1) స్పష్టం చేస్తోందని సిఇసి చంద్ర తెలిపారు. ఎన్నికలు జాప్యం చేయడం అప్రజాస్వామికం అవుతుంది కాబట్టి కోవిడ్ సేప్టీ ప్రోటోకాల్స్, ముందస్తు జాగ్రత్తలతో వీటిని నిర్వహిస్తామని అన్నారు.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించి, పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. కరోనా రహిత పోలింగ్‌కు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఓటర్లతో పాటు సిబ్బందిని రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్ర తెలిపారు.. ఈ ఎన్నికల్లో మొత్తం 18.34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇందులో 8.55 కోట్ల మంది మహిళా ఓటర్లు, 24.9 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువత ఉన్నట్లు చెప్పారు. మొత్తం 2,15,368 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.. పోలింగ్ విధుల్లో పాల్గనే వారిని ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పరిగణించి, వారికి కూడా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని కేంద్రానికి సూచించారు.
ఆన్‌లైన్‌లో నామినేషన్లకు అవకాశం
మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్‌లో నామినేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు సిఇసి తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ లో తమ నామినేషన్లను దాఖలు చేయొచ్చని తెలిపారు. దీనివల్ల రద్దీ తగ్గే అవకాశం ఉందని చెప్పారు.
అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.40 లక్షలకు పెంపు
ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో అభ్యర్థులు రూ.40లక్షలు ఎన్నికల వ్యయం చేసేందుకు అవకాశమిచ్చారు. గోవా, మణిపూర్‌లో ఈ వ్యయం రూ. 28 లక్షలుగా నిర్ణయించారు. డబుల్ వ్యాక్సిన్ తీసుకున్నవారే ఎన్నికల విధుల్లో పాల్గంటారు. కోవిడ్ సోకిన వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. క్రిమినల్ కేసులున్న అభ్యర్థులకు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్లలో తెలియజేయాలని పేర్కొన్నారు. ఆ అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేశారో కారణాలు కూడా చెప్పాలని తెలిపారు.
వర్చువల్‌గా ప్రచారాలు నిర్వహించండి
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ వర్చువల్‌గా ప్రచారం నిర్వహించుకోవాలని సిఇసి సూచించారు. ఈ నెల 15 వరకు రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్, వాహన ర్యాలీలు వంటి బహిరంగ ప్రచారాలపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించారు. ఆ తరువాత పరిస్థితులను సమీక్షించి ప్రచారాలపై మళ్లీ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఎటువంటి ర్యాలీ, బహిరంగ సభలు నిర్వహించ కూడదు. ఇంటింటి ప్రచారంలో కూడా అభ్యర్థితో సహా ఐదుగురికి మాత్రమే అనుమతి. వాహన కాన్వారు కి ఐదు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని, అది కూడా వాహనాల మధ్య వంద మీటర్ల దూరం ఉండాలని సూచించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన అభ్యర్థికి, పార్టీకి ఎన్నికలయ్యే వరకు అనుమతి ఇవ్వబోమని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల కోసం స్టార్ క్యాంపెయినర్ల గరిష్ట సంఖ్య 40 నుంచి 30కి, గుర్తింపు లేని పార్టీల స్టార్ క్యాంపెయినర్ల గరిష్ట సంఖ్య 20 నుంచి 15కి కుదించినట్లు తెలిపారు. ఓటర్లు, ఎన్నికల నిర్వహణ అధికారులు మాస్క్ లు, శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఐదు రాష్ట్రాలకు గానూ 900 మంది ఎలక్షన్ అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. అన్ని కరోనా ప్రోటోకాల్ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.










