
'ఎరుపంటే కొందరికీ భయం.. భయం...' అన్నాడో విప్లవ కవి. కాని ఇపుడు కేంద్రంలోని బిజెపి పాలకుల తీరు చూస్తే 'ఇండియా అంటేనే కొందరికి భయం భయం' అని రాసేవాడేమో! జీ-20 సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి భవన్ నుండి అతిథులకు పంపిన విందు ఆహ్వానాలలో ద్రౌపది ముర్మును 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' అనకుండా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని పేర్కొనడంతో ఇటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి. నిన్న మొన్నటి దాకా ఇండియా వేదిక పేరుపైనే నానా యాగీ చేసిన బిజెపి ఇపుడు దేశం పేరునే మార్చేయజూస్తోందన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ దేశాన్ని భారత్ అనే పిలవాలని ఇటీవల చెప్పడం, ఇప్పుడీ ఆహ్వాన పత్రిక ముద్రించడంతో ఏకంగా దేశం పేరును కేంద్ర ప్రభుత్వం మారుస్తోందని అనేక కథనాలు వెలువడ్డాయి. గత నెలలో మోడీ గ్రీస్‌లో పర్యటించినప్పుడు ప్రొటోకాల్ సామగ్రిపై 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్' అని ముద్రించినట్లు, ఇకపై భారత్ అనే పదాన్నే ఉపయోగించాలని తమను మౌఖికంగా ఆదేశించారని సిబ్బంది తెలిపిన విషయం కూడా మీడియాలో వచ్చింది. ఇండియాకు బదులు భారత్ పేరును ప్రభుత్వం రెండవసారి ప్రస్తావించడంతో దానికి మరింత బలం చేకూరుతోంది.
దేశం పేరును భారత్‌గా మార్చాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు 2016లో కొట్టివేసింది. 2020లో ఇలాంటి పిటిషనే విచారణకు వచ్చినప్పుడు దానిని కూడా అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ''ఇండియా..అంటే భారత్.. రాష్ట్రాల సమాఖ్య'' అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 చెబుతోంది. రాజ్యాంగం గుర్తించిన 'ఇండియా', 'భారత్' పదాలు రెండూ దేశానికి అధికారిక పేర్లే'నని పేర్కొంది. ఆ కేసుల్లో మోడీ సర్కారు తన అఫిడవిట్‌లో 'పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను భారత రాజ్యాంగ సభలో సుదీర్ఘంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. అందువల్ల భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఎలాంటి మార్పునూ పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేద'ని చెప్పింది. మరి ఇప్పుడెందుకీ ప్రతిపాదన చేస్తోంది? ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం రెండు సార్లు తిరస్కరించినప్పటికీ సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే పేరు మార్పునకు పూనుకోవడం కోర్టు ధిక్కారం కాదా? అంతేగాక భారత రాజ్యాంగసభ ఏకగ్రీవంగా చేసిన నిర్ణయాన్ని తిరగదోడాలనుకోవడం రాజ్యాంగ నిర్మాతలను, రాజ్యాంగాన్నీ అవమాన పరిచే ప్రయత్నమే కదా! వివిధ పథకాలకు 'మేకిన్ ఇండియా', 'డిజిటల్ ఇండియా', 'స్టార్టప్ ఇండియా' వంటి పేర్లు పెట్టిన కేంద్ర ప్రభుత్వం దేశం పేరులోనే ఇండియా లేకుండా చేయాలని హఠాత్తుగా యోచిస్తోంది. కాబట్టి ఇండియా పేరంటేనే మోడీ సర్కారుకు భయం కలుగుతోందన్నది నిర్వివాదాంశం.
మనకు రాజ్యాంగం ఉంది. శతాబ్దాలుగా దేశం ఎలా ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలుసు. మన స్వతంత్ర భారతదేశాన్ని మనం వారసత్వంగా పొందాము. రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్‌లో 'ఇండియా అంటే భారత్ రాష్ట్రాల యూనియన్' అని స్పష్టంగా పేర్కొంది. వైవిధ్యం, బహుళత్వం, ఇలా ప్రతిదీ రాజ్యాంగంలో చేర్చబడింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), ఐఐటిలు, ఐఐఎం వంటి పేర్లలో కూడా ''ఇండియా'' అనే పదం ఉంది. ఇప్పటి వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఉండగా దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటే ఈ దేశం ఒక రిపబ్లిక్‌గా ఉండడం బిజెపి కి ఇష్టం లేదా? ఇండో-పసిఫిక్ అని ఉంది. దాన్ని మార్చేయగలరా? ఇటువంటి ప్రశ్నలెన్నో! ఈ విధమైన ప్రయత్నాలు భారత రాజ్యాంగ విధ్వంసానికి దారి తీస్తాయి. పాలకులు వేసే ఏ రాజకీయ ఎత్తుగడ కూడా దేశానికి వ్యతిరేకంగా ఉండకూడదు. అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమైన దేశం పేరు మార్చే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలి. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ వైవిధ్యాన్ని నాశనం చేసే బిజెపి ప్రయత్నాలను దేశంలోని ప్రజాస్వామ్య శక్తులన్నీ ప్రతిఘటించాలి. భారత రాజ్యాంగాన్ని, దాని మౌలిక స్వభావాన్ని కాపాడుకోవాలి.