Jul 25,2021 21:43

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌కు చెందిన ముఖ్యనేతలతో ప్రధాని మోడీ సమావేశం నిర్వహించి నెలరోజులు దాటినా అక్కడి ప్రజల హృదయాలను గెలుచుకునే ఎటువంటి ప్రయత్నం జరగలేదనిఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షులు ఫరూక్‌ అబ్దుల్లా విమర్శించారు. ఆయన ఆదివారం పిటిఐతో మాట్లాడుతూ జూన్‌ 24 నాటి సమావేశంలో ఢిల్లీకి కాశ్మీర్‌కు మధ్య ఉన్న దూరాన్ని తొలగిస్తామని, అక్కడి ప్రజల హృదయాలను గెలుచుకుంటామని ప్రధాని అన్నారని గుర్తు చేశారు. 'ఈ వ్యాఖ్యలు స్వాగతించదగ్గవే అయినా, అందుకోసం ఎలాంటి ప్రయత్నం జరగడం లేదు. ప్రజల్ని నిర్బంధించడం, అసమ్మతిని సహించలేకపోవడం కొనసాగుతూనే ఉంది. క్షేత్రస్థాయిలో మార్పును చూడాలని కోరుకుంటున్నాం. కేంద్రం చేసిన గాయాలతో ఉన్న ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే ప్రయత్నాలు చేయాలి. ఆకస్మికంగా రాష్ట్రం ప్రత్యేక హోదాను రద్దు చేశారు' అని ఫరూక్‌ పేర్కొన్నారు. ఇరు వైపులా (ఢిల్లీ, శ్రీనగర్‌) నమ్మకం లేకుండా పోయిందని, ప్రధానులు నెహ్రూ, పివి నరసింహారావు, వాజ్‌పేరు హామీలు ఇచ్చినా నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. ప్రధాని ఆహ్వానం మేరకే ఆ సమావేశానికి హాజరయ్యామని, ఆ సమావేశంపై ఎలాంటి అంచనాలు లేవని తెలిపారు. ప్రజల హృదయాలను, ఆలోచనలను గెలుచుకునే చర్యలు ఉంటాయని ఆశించానని, అలాంటివి ఏమీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలలోపే రాష్ట్ర హోదాను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ఆయన పునరుద్ఘాటించారు. ఇది అన్ని ప్రధాన పార్టీల డిమాండ్‌ అని, దీనిని ఆమోదించి కేంద్రం తన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. గుప్కార్‌ కూటమి అంతా కలిసి కట్టుగా ఉందని, రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని, ప్రజలు కూడా తమ వెంట వుండి పోరాడతారని చెప్పారు. ప్రజాస్వామ్య స్థంభాన్ని నిలబెట్టడం కోసం దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, అది త్వరగా జరగాలని ఫరూక్‌ అబ్దుల్లా ఆకాంక్షించారు.