ప్రజాశక్తి - బుచ్చయ్య పేట(అనకాపల్లి) : వాతావరణంలో వచ్చిన మార్పులతో వరి పంటను రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.ఈనెల 20వ తేదీ తర్వాత వర్షాలు పడతాయన్న ప్రచారంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.ఇప్పటికే పంట పండేయడంతో కోయకపోతే నేల రాలిపోతుందన్న భయంతో కొంతమంది కోతలు మొదలుపెట్టారు. కోసినవారు అటు ఇటుగా ఆరబెట్టి కుప్పలు పెట్టేసుకుంటున్నారు.మరి కొంతమంది ఆ దేవుడిపైనే భారం వేసి కోతలు కోస్తున్నారు.అందరూ ఒకేసారి కోతలు మొదలెట్టడంతో కూలీలకు కొరత ఏర్పడింది. గత మూడు రోజుల నుండి బుచ్చియ్యపేట మండలంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.అందరూ ఒకేసారి కోతలు మొదలట్టడంతో కూలీలు దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారు.పక్క గ్రామాల నుండి అదనంగా రవాణాచార్జీలు ఇచ్చి కూలీలను తీసుకువస్తున్నారు. ఈ ఏడాది మండలంలో 6500 ఎకరాలలో వరి పంట వేశారు. ఇప్పటికీ 2వేల ఎకరాల వరకు వరి కోతలు పూర్తయినట్లు తెలుస్తోంది. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు పడతాయన్న ప్రచారం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది.










