Jul 18,2022 23:47

ఎస్‌టిపిఐ ప్రతినిధులను సత్కరిస్తున్న ఎయు విసి ప్రసాదరెడ్డి

ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ : ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టిపిఐ) ఉన్నతాధికారులు సోమవారం సందర్శించారు. ఏయూ వీసీ ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డితో ఎస్‌టిపిఐ నెక్ట్‌ డైరెక్టర్‌ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ సుబోధ్‌ సచన్‌, ఎన్‌టిపిఐ హైదరాబాద్‌ డైరెక్టర్‌ సివిడి రామ్‌ప్రసాద్‌, విశాఖపట్నం అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సురేష్‌ బేత భేటీ అయ్యారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎస్‌టిపిఐ సహకారంతో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటుపై చర్చించారు. త్వరలో దీనికి సంబంధించి అవగాహన ఒప్పందం చేసుకోవాలని వీసీ సూచించారు. ఏయూ-ఎస్‌టిపిఐ సంయుక్త భాగస్వామ్యంతో తొలి దశలో రూ.19.75 కోట్ల వ్యయంతో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు జరుగుతాయి. మూడు దశల్లో పూర్తిస్థాయిలో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను వీసీ ప్రసాదరెడ్డి వివరించారు. మూడు జిల్లాలకు ఉన్నత విద్యాకేంద్రంగా ఏయూ నిలుస్తోందన్నారు. ప్రతిష్టాత్మకంగా ఏయూలో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ కోర్సును అందిస్తున్నామని చెప్పారు. రాంకీ ఫార్మా సంస్థ, డిఆర్‌ఎఫ్‌ఎల్‌, ఐఐఎం విశాఖపట్నంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. విభిన్న రంగాలకు చెందిన నిపుణుల భాగస్వామ్యం కావడం విశ్వవిద్యాలయానికి మరింత విలువను జోడించడం సాధపడుతుందన్నారు. ఎన్‌టిపిఐ విశాఖ కార్యాలయాన్ని ఏయూ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని, ఇక్కడ నుంచి ఎస్‌టిపిఐ కార్యకలాపాలను నిర్వహణ జరపాలని ఏయూ వీసీ ఆహ్వానించారు.
ఎస్‌టిపిఐ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ సుబోధ్‌ సచన్‌ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు సమున్న జ్ఞాన కేంద్రాలుగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా ఎస్‌టిపిఐ ప్రతినిధులను వీసీ ప్రసాద రెడ్డి సత్కరించారు.