Oct 28,2022 22:43

బ్రోచర్‌ విడుదల చేస్తున్న ఎయు విసి, లూక్స్‌ ప్రతినిధులు

సెయింట్‌ లూక్స్‌ సంస్థతో అవగాహన ఒప్పందం
ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ :
ఎయు నుంచి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌండ్‌ ఇంజనీరింగ్‌, మ్యూజిక్‌ ప్రొడక్షన్‌, ఫిల్మ్‌ ఎడిటింగ్‌ కోర్సులను ప్రారంభించనున్నట్లు విసి ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తెలిపారు. శుక్రవారం అకడమిక్‌ సెనేట్‌ మందిరంలో అంతర్జాతీయంగా పేరు గాంచిన సౌండ్‌ ఇంజనీర్‌, స్టూడియో డిజైనర్‌ ఆదిత్య మోదీతో కలసి కోర్సుల వివరాలతో కూడిన బ్రోచరును ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఆది నుంచి ఎయులో శాస్త్ర సాంకేతిక రంగాలతో సమానంగా కళలకు ప్రాధ్యాతను ఇస్తూ వస్తోందన్నారు. నేటి తరానికి ఉపయుక్తంగా నిష్ణాతులను తీర్చిదిద్దే దిశగా ఈ రంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన సెయింట్‌ లూక్స్‌ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకున్నామన్నారు. దీనికి అవసరమైన భవనం ఎయు సమకూరుస్తుందని, అధునాతన స్టూడియోను లూక్స్‌ సంస్థ నిర్మిస్తుందన్నారు. మూడు నెలలు, ఆరు నెలులు, ఏడాది కాల వ్యవధి కలిగిన సౌండ్‌ ఇంజనీరింగ్‌ కోర్సులను ప్రాధమికంగా ప్రారంభిస్తున్నామన్నారు.
సెయింట్‌ లూక్స్‌ సంస్థ వ్యవస్థాపకులు సంగీత దర్శకులు ఆశీర్వాద్‌ లూక్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో డాల్బీ ఎట్మాస్‌ స్టూడియో నిర్మాణం చేపడతామన్నారు.కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె. సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కష్ణమోహన్‌, ప్రీతమ్‌ లూక్స్‌ పాల్గొన్నారు.